Share News

రిలయన్స్ ఇండస్ట్రీస్ డేటా సెంటర్‌కు భారీ ప్రోత్సాహకాలు..

ABN , Publish Date - May 20 , 2026 | 09:12 PM

ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారీ పెట్టుబడికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలిపల్లి, భోగాపురం పరిధిలో 853.97 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ డేటా సెంటర్‌కు భారీ ప్రోత్సాహకాలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారీ పెట్టుబడికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలిపల్లి, భోగాపురం పరిధిలో 853.97 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిలయన్స్ ఏఐ డేటా సెంటర్‌కు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. వాటికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. విజయనగరం జిల్లాలో గిగా-స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆర్ఐఎల్ ముందుకొచ్చింది.


రూ.1,08,010 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఏఐ డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఆర్ఐఎల్ ప్రతిపాదనలు చేసింది. దీనికి, అనుమతులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. డేటా సెంటర్ కోసం 853.97 ఎకరాల భూమిని కేటాయించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రాజెక్టు కోసం సేకరించే భూమి విలువపై రిలయన్స్ సంస్థకు 25 శాతం రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. అలాగే కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS) ఏర్పాటుకు మరో ఎకరం భూమిని ప్రత్యేకంగా కేటాయించింది. డేటా సెంటర్ కోసం విద్యుత్ గ్రిడ్ మౌలిక సదుపాయాలు, 20 ఏళ్ల పాటు నీటి సరఫరా గ్యారెంటీని ప్రభుత్వం కల్పించనుంది. ప్రాజెక్టుకు 100 శాతం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు.. మెషినరీపై 6 శాతం క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వనుంది. 10 ఏళ్ల పాటు నిర్మాణ రంగం, లీజింగ్ ఖర్చులపైనా 100 శాతం నెట్ SGST రీయింబర్స్‌మెంట్ చేయనుంది.


యూనిట్ విద్యుత్‌పై రూ.1 చొప్పున 15 ఏళ్ల పాటు రాయితీ.. నీటి పన్నుపై 10 ఏళ్ల పాటు 15 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. రూ.5 వేల కోట్ల పరిమితితో 20 ఏళ్ల పాటు ట్రాన్స్‌మిషన్/వీలింగ్ ఛార్జీల నుంచి 100 శాతం మినహాయింపు ఇచ్చేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB) రూల్స్ ప్రకారం ప్రాజెక్టుకు సింగిల్ విండో క్లియరెన్స్ సదుపాయం కల్పిస్తోంది. రూ.5 వేల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్నందున దీనిని 'మెగా ప్రాజెక్ట్'గా పరిగణించి టైలర్ మేడ్ ప్రోత్సాహకాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.


ఈ వార్తలు కూడా చదవండి

మే 22న ప్రారంభం కానున్న SAEL.. ఎక్స్ వేదికగా చంద్రబాబు, లోకేశ్ పోస్టు..

కువైట్‌లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు అండగా ఏపీ ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

Updated Date - May 20 , 2026 | 09:30 PM