‘భోగాపురం’ గ్రాండ్ టేకాఫ్..
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:28 AM
రాష్ట్రంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఆవిష్కృతమైన వేళ...ఉత్తరాంధ్రకు ఉత్సవ కళ వచ్చింది. నేల ఈనిందా... అన్నట్టు భోగాపురానికి జనం పోటెత్తారు.
‘భోగాపురం’ గ్రాండ్ టేకాఫ్
ఎటుచూసినా జనసంద్రమే..
ఉదయం నుంచే ప్రభం‘జనం’
అంచనాలకు మించి పోటెత్తిన వైనం
ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారులన్నీ కిటకిట
సభాప్రాంగణంలో రెండు లక్షల మంది
చోటులేక బయట మరో లక్షన్నర మంది
ఏర్పాట్లపై ప్రధాని, సీఎం సంతృప్తి
భోగాపురం(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఆవిష్కృతమైన వేళ...ఉత్తరాంధ్రకు ఉత్సవ కళ వచ్చింది. నేల ఈనిందా... అన్నట్టు భోగాపురానికి జనం పోటెత్తారు. రూ.5,000 కోట్ల వ్యయం..అతి తక్కువ సమయంలో నిర్మాణం... ఆధునిక హంగులు, అందమైన సొబగులతో సిద్ధమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా టేకాఫ్ తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శనివారం ప్రారంభోత్సవం జరుపుకొంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్సవంలా నిర్వహించింది. ప్రారంభోత్సవం రోజే రన్‌వే...పలు ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లతో సందడిగా కనిపించింది. ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూపించేందుకు అక్కడి ప్రజలను రెండు వేల బస్సుల్లో భోగాపురం తీసుకువచ్చారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన జన ప్రవాహం..ప్రతి అర గంటకూ పెరుగుతూ మధ్యాహ్నం 11 గంటల నాటికి రెండు లక్షలకు దాటిపోయింది. 12 గంటల నాటికి 3 లక్షలకు పైగా చేరుకుంది. సభ ముగిసే సమయానికి 3.50 లక్షల మంది హాజరయ్యారని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి.
భేష్.. బాగా చేశారు..
భోగాపురం మొత్తం పండుగ వాతావరణమే కనిపించింది. భూములు ఇచ్చినందుకు తమ జీవితాలు బాగు పడుతున్నాయని స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రసంగిస్తున్నప్పుడు సభికులు పలుమార్లు చప్పట్లతో తమ స్పందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం మొత్తం విజయవంతం కావడంతో అటు ప్రధాని, ఇటు సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని, మూడు జిల్లాల నాయకులను ముఖ్యమంత్రి ప్రశంసించారు.
అంచనాలకు మించి..
వాస్తవానికి 2.10లక్షలు మంది వస్తారని ఊహించారు. అంతకుమించి.. తరలిరావడంతో జాతీయ రహదారినుంచి ఫ్లైఓవర్ మీదుగా విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో వెనుకనున్న వాహనాల్లోని ప్రజలు మూడు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చి సభా ప్రాంగణంముందే ఉండిపోయారు. తరువాత వచ్చే వాహనాలు సకాలంలో ప్రాంగణంలోనికి చేరుకోలేక బయటే ఉండిపోయారు. ఇలా వచ్చిన వారు లక్షవరకు ఉన్నట్లు అంచనా. జనం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఓపికగా ఉండి, కార్యక్రమం మొత్తం వీక్షించారు. ఉదయం 9.30 గంటలకే సభావేదిక నిండిపోయింది. దీంతో బస్సుల్లో వచ్చిన వారు చాలామంది బయటే ఉండిపోవాల్సి వచ్చింది. లోపల ఖాళీలేకపోవడంతో పంపించడంలేదని, ఎవరి బస్సుల్లో వారు ఉండాలని పోలీసులు సూచించారు. చాలామంది బయటి నుంచే నాయకుల ప్రసంగాలను విన్నారు. తిరుగు ప్రయాణంలో ఎయిర్‌పోర్టు నుంచి గూడెపువలస రహదారిలో హైవే చేరేందుకు నాలుగు కిలోమీటర్ల రహదారి ఉంది. దీన్ని దాటేందుకు నాలుగైదు గంటల సమయం పట్టింది. అంతగా రద్దీ కనిపించింది.
రాష్టాభివృద్ధికి కేంద్రం సహకారం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
రాష్ర్టాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నదని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పా రు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో శనివారం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక వసతులకు భారీ ప్రోత్సాహం అందిస్తూ.. నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా మారనుందన్నారు. ఈ విమానాశ్రయంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అభివృద్ధిలో అదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చని చెప్పారు.
శభాష్ లోకేశ్.. భుజం తట్టి మోదీ ప్రశంస
‘శభాష్ లోకేశ్. నువ్వు బాగా పనిచేస్తున్నావు’ అని మంత్రి లోకేశ్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం నరేంద్ర మోదీకి లోకేశ్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మోదీ.. లోకేశ్ భుజం తట్టి మాట్లాడారు. ఇదేవేగం, చైతన్య స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. గతంలో కూడా ఏపీలో మోదీ పాల్గొన్న కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు, విశాఖలో యోగాంధ్ర గిన్నిస్ రికార్డులో కీలకపాత్ర పోషించినందునకు లోకేశ్‌ను మోదీ మెచ్చుకున్నారు.