భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రజలకు అంకితం చేస్తున్న కూటమి ప్రభుత్వం: అచ్చెన్న
ABN , Publish Date - Jul 29 , 2026 | 09:41 PM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ క్రెడిట్ చోరికి పాల్పడుతోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు విమర్శించారు. బుధవారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
విజయనగరం, జులై 29: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ క్రెడిట్ చోరికి పాల్పడుతోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు విమర్శించారు. బుధవారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతులను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రెచ్చగొట్టారని అన్నారు. అప్పట్లో ఈ ఎయిర్‌పోర్టుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని.. ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎందుకని ప్రశ్నించారని గుర్తు చేశారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం ఎయిర్‌పోర్టును కూటమి ప్రభుత్వం ప్రజలకు అంకితం చేస్తోందని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆలోచన 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత హుద్‌హుద్ తుఫాన్ అనంతరం రూపుదిద్దుకుందని వివరించారు. అలా 2019లో చంద్రబాబు హయాంలో ఈ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన జరిగిందని చెప్పారు.
చంద్రబాబు నాయకత్వంలో, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషితో అన్ని అనుమతులు సాధించి నిర్ణయించిన సమయాని కంటే ముందే ఈ విమానాశ్రయాన్ని పూర్తి చేశామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఇప్పుడు వైసీపీ క్రెడిట్ కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యంగ్యంగా అన్నారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన మంచి పనులను కొనసాగించాల్సిన బాధ్యత తర్వాత ప్రభుత్వాలపై ఉంటుందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రూ.24 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రంపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించిందని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
2019 ఎన్నికల వరకు అమరావతినే రాజధానిగా చెప్పిన వైసీపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తీసుకురావడం దుర్మార్గం అని తెలిపారు. రాజధాని విషయంలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని గుర్తు చేశారు. గత రెండేళ్లలో చంద్రబాబు నాయకత్వం, ప్రధాని మోదీ సహకారంతో ఉత్తరాంధ్రకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామని వివరించారు. అలాగే విశాఖ రైల్వే జోన్ సాధించామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టేందుకు కేంద్రం వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించిందని చెప్పారు. ఉత్తరాంధ్రలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు.
ఇచ్చాపురం నుంచి కాకినాడ వరకు పారిశ్రామిక, ఆర్థిక కారిడార్ అభివృద్ధి దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సమస్యల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. పలాసకు చెందిన దానయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించ లేదు గానీ వైసీపీ నేతను పరమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదం జరిగితే చట్టపరంగా విచారణ జరగాలని, రాజకీయాలు చేయడం తగదని వైసీపీ నేతలకు ఆయన సూచించారు.
భోగాపురం విమానాశ్రయం నుంచి ఆగస్టు 16న తొలి అంతర్జాతీయ విమానం సింగపూర్ నుంచి రానుందని, 17న వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. శ్రీకాకుళం వాసుల ఎన్నో ఏళ్ల నేరడి బ్యారేజీ కల సాకారం చేశామని వివరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఆగస్టు 13 నుంచి నీరు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో అనుబంధ పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం విమానాశ్రయానికి పెట్టడం వెనుక సీఎం చంద్రబాబు ఆలోచన ఉందని వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పునరుద్ఘాటించారు. వైసీపీ నేతలకు కూటమి పాలనపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఎలా చీదరించారో ... 2029 ఎన్నికల్లో కూడా అలానే చీదరిస్తారని వైసీపీ రాజకీయ భవిష్యత్తుపై జోస్యం చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రిజిస్ట్రేషన్ సేవల్లో ప్రైవేట్ జోక్యంపై హైకోర్టులో పిల్.. విచారణ వాయిదా
చిన్నారి విన్యాసాలు.. సైనికుల ఫిదా.. వీడియో వైరల్
For More AP News And Telugu News