విశాఖలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు.. లక్షల్లో ఫేక్ నోట్లు స్వాధీనం
ABN , Publish Date - Jan 24 , 2026 | 03:53 PM
విశాఖ రైల్వే స్టేషన్‌లో నకిలీ కరెన్సీ రాకెట్‌ను పోలీసులు బయటపెట్టారు. నకిలీ కరెన్సీ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం, జనవరి 24: విశాఖ రైల్వే స్టేషన్‌లో(Visakha Railway Station) నకిలీ కరెన్సీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సంయుక్తంగా నిర్వహించిన సాధారణ తనిఖీల్లో నకిలీ కరెన్సీ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి నుంచి 200 రూపాయల నోట్ల రూపంలో మొత్తం రూ.3.32 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నితీశ్ కుమార్, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన గురు సునీల్ కుమార్‌లుగా గుర్తించారు.
నిందితులను విచారించగా.. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైనట్లు తెలిపారు. రూ.50 వేల అసలు కరెన్సీకి మూడింతల(రూ.1.50 లక్షలు) విలువైన నకిలీ కరెన్సీ ఇచ్చేలా సదరు వ్యక్తితో ఒప్పందం కుదిరింది. నిందితులు ప్రధానంగా కోడిపందేలను టార్గెట్ చేసుకున్నారు. ఆ పందేల్లో చాలా మంది నకిలీ కరెన్సీని ఉపయోగిస్తారని భావించి, అక్కడ చలామణి చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కోడిపందేల్లో నకిలీ కరెన్సీ చలామణి కాకపోవడంతో విశాఖపట్నంలో ఓ వ్యక్తికి ఇచ్చేందుకు వచ్చారు. రైల్వే స్టేషన్‌లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. ఆ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై జీఆర్‌పీ సీఐ ధనుంజయ నాయుడు మీడియాతో మాట్లాడారు. రైళ్లలో స్మగ్లింగ్, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని.. ప్రజలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
నైనీ కోల్ టెండర్ల వివాదం.. కేంద్ర బృందం దర్యాప్తు ప్రారంభం
సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Read Latest Telangana News And Telugu News