విశాఖ జూలోకి కొత్త జంతువులు.. పవన్ కల్యాణ్ ట్వీట్
ABN , Publish Date - Sep 05 , 2026 | 09:33 PM
ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు కొత్త జంతువులు వచ్చాయి. జామ్‌నగర్‌లోని రాధేకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్‌తో జరిగిన జంతు మార్పిడి కార్యక్రమం విజయవంతమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’లో తెలిపారు.
విశాఖపట్నం: ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల (IGZP)కు కొత్త జంతువులు వచ్చాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రాధేకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్‌తో జంతు మార్పిడి కార్యక్రమాన్ని ఐజీజెడ్పీ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ జంతు మార్పిడిలో భాగంగా ఐజీజెడ్పీకి 3 జీబ్రాలు, 4 కాటన్-టాప్ టామరిన్‌లు, 3 రెడ్-నెక్డ్ వాలబీలు, 2 కామన్ మార్మోసెట్‌లు వచ్చాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న కాటన్-టాప్ టామరిన్‌లను ఐజీజెడ్పీలో తొలిసారిగా ప్రవేశపెట్టారు.
మరోవైపు ఐజీజెడ్పీ నుంచి 3 ఇండియన్ గౌర్‌లు, 4 స్టంప్-టెయిల్డ్ మకాక్‌లు, 2 ఘరియాల్‌లను జామ్‌నగర్‌కు తరలించారు. కొత్తగా వచ్చిన అన్ని జంతువులు ఆరోగ్యంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సెంట్రల్ జూ అథారిటీ (CZA) నిబంధనల ప్రకారం వాటిని తప్పనిసరి పశువైద్య క్వారంటైన్‌లో ఉంచారు. ఈ జంతు మార్పిడి కార్యక్రమం ఐజీజెడ్పీలో జంతువుల సంరక్షణ, సంతానోత్పత్తి కార్యక్రమాలకు మరింత బలం చేకూర్చనుంది. అలాగే వన్యప్రాణులపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు సందర్శకులకు మరింత మంచి అనుభూతిని అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పవన్ కల్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు.
Also Read:
గుంటూరులో బాలిక మిస్సింగ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు జారీ