నేటి రాజకీయాల్లో రాద్ధాంతం తప్ప సిద్ధాంతం లేదు: వెంకయ్య నాయుడు..
ABN , Publish Date - Jul 12 , 2026 | 09:14 PM
తిరుపతి లడ్డూ వ్యవహారం, అయోధ్యలో దొంగతనం, శబరిమల ఘటన తననెంతో బాధించాయని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వీటికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈరోజు (ఆదివారం) విశాఖలో 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగగా ఆయన పాల్గొన్నారు.
విశాఖ: తిరుపతి లడ్డూ వ్యవహారం, అయోధ్యలో దొంగతనం, శబరిమల ఘటన తననెంతో బాధించాయని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వీటికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈరోజు (ఆదివారం) విశాఖలో 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పుస్తకాన్ని ఆవిష్కరించి, వెంకయ్య నాయుడితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అనంతరం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..'విశాఖ వచ్చినప్పుడల్లా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక్కడే నేను చదువుకున్నాను. ఈ నగరం నాకు మంచి స్నేహితులను ఇచ్చింది. విశాఖలోనే విద్యార్థి నాయకుడిగా ఎదిగాను. అన్ని పదవుల కంటే బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు కావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా 48వ ఏట బీజేపీ అధ్యక్షుడు అయ్యే అవకాశం వచ్చింది. కానీ, అప్పుడు మా కుటుంబ సభ్యులతో చర్చిస్తే వద్దు అన్నారు. వాజ్‌పేయి, అద్వానీ వంటి వారితో పని చేయడం అదృష్టం. నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణ రద్దయ్యింది. నా జీవితంలో ఇది మంచి ఘట్టంగా భావిస్తాను. యువత రాజకీయాల్లోకి రావాలి. నా వయసు 77 సంవత్సరాలు. ఇక ఎంతకాలం ఉంటానో తెలియదు.
యువతకు ఎన్నో విషయాలు చెప్పడానికి తిరుగుతూనే ఉంటాను. నేను తిరుగుతూనే పోవాలనేది నా కోరిక. నేటి రాజకీయాల్లో రాద్ధాంతం తప్ప సిద్ధాంతం లేదు. కొంతమంది నిన్న ఏం మాట్లాడారో, ఈరోజు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదు. రాజకీయ నాయకులు నైతిక విలువలు పాటించాలి. ఎవరైనా సరే పదవులకు రాజీనామా చేసి మాత్రమే పార్టీలు మారాలి. దీనిపై చర్చ జరగాలి. ఏపీలో కొంతమంది బూతులు మాట్లాడుతున్నారు. అలాంటి వారికి ఎన్నికల బూత్‌లోనే ఓటర్లు బుద్ధి చెప్పారు. నేను ఎవరినీ, ఏ రాజకీయ పార్టీనీ విమర్శించడం లేదు. నేను బీజేపీలో లేను. కానీ మనసంతా ఆ పార్టీపైనే ఉంది. మా తాత, అమ్మమ్మ కారణంగానే ఈ స్థాయికి చేరుకున్నా. నాకు చిన్నప్పుడు దూకుడు ఎక్కువ. తెన్నేటి విశ్వనాథం పరిచయంతో దూకుడు తగ్గింది' అని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలే త్వరగా వైరల్ అవుతున్నాయి: రాయపాటి శైలజ
ఘనంగా 'వెంకయ్య నాయకుడు' పుస్తకావిష్కరణ.. స్పీకర్ ఎమోషనల్ స్పీచ్..