గుడ్ న్యూస్.. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు..
ABN , Publish Date - Aug 17 , 2026 | 08:52 AM
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ASR-1, ASR-2 పేర్లతో రెండు మార్గాల్లో ఈ సర్వీసులను నడపనున్నారు.
విశాఖపట్నం: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలు ఈరోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి. తొలి విమానం ఇండిగో (6E6408) ఉదయం 6:45 గంటలకు హైదరాబాద్ నుంచి భోగాపురానికి చేరుకుంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ASR-1, ASR-2 పేర్లతో రెండు మార్గాల్లో ఈ సర్వీసులను నడపనున్నారు. రెండు రూట్లలోనూ ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున ఉదయం నుంచి రాత్రి వరకు రాకపోకలు సాగనున్నాయి.
ASR-1 రూట్ ఇలా..
గాజువాక, ఎన్ఏడీ, గురుద్వార్, జూ పార్క్, మారికవలస, ఆనందపురం, తగరపువలస, ఎయిర్‌పోర్టు జంక్షన్ మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ సర్వీసు చేరుకుంటుంది. ఈ మార్గంలో పాత గాజువాక నుంచి విమానాశ్రయానికి రూ.400, ఎన్ఏడీ నుంచి రూ.350, గురుద్వార్ నుంచి రూ.300, జూ పార్క్ నుంచి రూ.250, మారికవలస నుంచి రూ.200, ఆనందపురం నుంచి రూ.150, తగరపువలస నుంచి రూ.100, ఎయిర్‌పోర్టు జంక్షన్ నుంచి రూ.50గా ఛార్జీ నిర్ణయించారు.
ASR-2 మార్గం..
రెండో మార్గంలో గాజువాక, సింధియా, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, సిరిపురం, ఇస్కాన్ టెంపుల్, ఐటీ హిల్స్, మారికవలస, ఆనందపురం, తగరపువలస, ఎయిర్‌పోర్టు జంక్షన్ మీదుగా విమానాశ్రయానికి బస్సులు నడుస్తాయి. ఈ రూట్‌లో పాత గాజువాక నుంచి విమానాశ్రయానికి రూ.400, సింధియా నుంచి రూ.400, కంచరపాలెం నుంచి రూ.400, సిరిపురం నుంచి రూ.350, ఇస్కాన్ టెంపుల్ నుంచి రూ.300, ఐటీ హిల్స్ నుంచి రూ.250, మారికవలస నుంచి రూ.200, ఆనందపురం నుంచి రూ.150, తగరపువలస నుంచి రూ.100, ఎయిర్‌పోర్టు జంక్షన్ నుంచి రూ.50గా ఛార్జీలు ఉంటాయి.
అరగంటకో బస్సు..
విమాన ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకునేలా ఈ రెండు మార్గాల్లో ప్రతి 30 నిమిషాలకు ఒక ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సు అందుబాటులో ఉండేలా సర్వీసులను నిర్వహించనున్నారు. ఉదయం 4:30 నుంచి రాత్రి 10:30 గంటల వరకు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. దీంతో విశాఖ నగరం, పరిసర ప్రాంతాల నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ప్రజా రవాణా మరింత సౌకర్యవంతంగా మారనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
రాజమండ్రి గోదావరిలో ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి గల్లంతు
జనసేన నేత హత్యకు వైసీపీ నేత కుట్ర..?