Share News

బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

ABN , Publish Date - Feb 15 , 2026 | 07:24 PM

ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో బడ్జెట్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని పల్లా శ్రీనివాసరావు కోరారు..

బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
Palla Srinivasa Rao

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌‌ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇవాళ (ఆదివారం) విశాఖపట్నం నుంచి కూటమి ఎమ్మెల్యేలు, కీలక నేతలతో ఆయన నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో బడ్జెట్ ప్రాధాన్యతలపై సుదీర్ఘంగా చర్చించారు. 'విధ్వంసం నుంచి వికాసం వైపు' సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

వ్యవస్థను గాడిలో పెట్టే 'విజన్ డాక్యుమెంట్'

గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను.. మళ్లీ పురోగతి పట్టించేలా ఈ బడ్జెట్ ఉందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. భారత శతాబ్ది ఉత్సవాల నాటికి ఏపీ అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో (విజన్-2047) ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని చెప్పారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ కూడా పాల్గొని.. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని ఎలా సమతుల్యం చేస్తోందో వివరించారు.


ఇది గణాంకాల పుస్తకం కాదు.. ప్రజల జీవిత రేఖ: ఎమ్మెల్యే గణబాబు

బడ్జెట్‌పై ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఈ బడ్జెట్ కేవలం అంకెలతో కూడిన పుస్తకం కాదు, ఇది కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఒక బ్లూ ప్రింట్. మాటల కోసం కాకుండా, చేతల్లో ప్రగతిని చూపించే విజన్ డాక్యుమెంట్ ఇది.' అని ఆయన వ్యాఖ్యానించారు.

కూటమి నేతలు ఈ సందర్భంగా బడ్జెట్‌లోని కీలక అంశాలను ప్రస్తావించారు. సుమారు రూ. 3.32 లక్షల కోట్లతో కూడిన భారీ బడ్జెట్‌గా పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా సంక్షేమం కోసం దాదాపు రూ. 91,527 కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో పాటు విద్యా రంగానికి (రూ. 32,308 కోట్లు) అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శివరాత్రి పూజలో పాల్గొన్న ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్

ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం: మంత్రి లోకేశ్

Updated Date - Feb 15 , 2026 | 07:59 PM