అనకాపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం.. ముగ్గురి మృతి..
ABN , Publish Date - May 23 , 2026 | 07:59 PM
అనకాపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మేఘావృతమైన వాతావరణం పలు మండలాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా గాలి బీభత్సం, అకాల వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
అనకాపల్లి: జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మేఘావృతమైన వాతావరణం పలు మండలాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా గాలి బీభత్సం, అకాల వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన ఈదురుగాలులకు పాయకరావుపేట మండలం సత్యవరంలో కొబ్బరిచెట్టు కూలి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతిచెందారు. నక్కపల్లిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
సత్యవరం మృతులను అరట్లకోట గ్రామానికి చెందిన శంకరయ్య, ఎరకయ్యగా గుర్తించారు. వారిద్దరూ తమలపాకులు సేకరించేందుకు వెళ్లగా చెట్టు కూలి ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పడిన చెట్టును తొలగించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జిల్లావ్యాప్తంగా గాలివానకు పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. ఇక, చీడిక, జి.జగన్నాథపురం, గొడిచర్ల, డెంకాడ, రమణయ్యపేట, ముకుందరాజుపేట, దోసలపాడు, చిన దొడ్డిగల్లు తదితర గ్రామాల్లో అరగంటపాటు గాలి, వాన బీభత్సం సృష్టించాయి. మామిడి, అరటితోటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
విషయం తెలుసుకున్న ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈదురుగాలులతో వర్షాలు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ వంటి వాటి వద్ద ఉండొద్దని పేర్కొన్నారు. తీవ్ర ఎండలతోపాటు, పిడుగులతో కూడిన వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాజమహేంద్రవరానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎప్పుడంటే..
కుటుంబంతో ప్రధాని మోదీని కలిసిన కేంద్ర మంత్రి.. ఎక్స్ వేదికగా భావోద్వేగం..