ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరింది: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
ABN , Publish Date - May 06 , 2026 | 07:39 PM
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని, ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు దక్కుతుందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు.
విశాఖపట్నం, మే 06: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని, ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు దక్కుతుందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై ఆయన స్పందించారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాట్లాడారు. ఈ రైల్వే జోన్ సాధన కోసం బీజేపీ ఎన్నో పోరాటాలు చేసిందని, విభజన చట్టంలో ఈ అంశంపై స్పష్టత లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొనలేదు.. కేవలం ఈ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే ఉంది. కానీ, 2019 ఎన్నికలకు ముందే ఈ జోన్‌ను ప్రకటించాం.. ఇప్పుడు ఆ కల నెరవేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన భూమిని అందించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ సుదీర్ఘ ప్రక్రియలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ జోన్ సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కీలక పాత్ర పోషించారు. వీరందరికీ కృతజ్ఞతలు. ఒకప్పుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వడం సులువు, కానీ రైల్వే జోన్ ఇవ్వడం కష్టం అని అన్నారు. . అమరావతి రాజధానికి ఏ విధంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారో, అదే తరహాలో రైల్వే జోన్‌కు కూడా గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. రైల్వే జోన్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రభుత్వం మంచి చేసినా వైఎస్సార్సీపీ, వామపక్షాలు గుర్తించడం లేదు. ఈ నెల 10వ తేదీ తర్వాత రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయి. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడతాయి’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మహ్మద్ నసీర్
కలిసి పని చేస్తే బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుంది: రాయపాటి శైలజ
For More AP News And Telugu News