ప్రాణం తీసిన పరీక్షల ఒత్తిడి
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:27 AM
పరీక్షల ఒత్తిడి ఓ మెరిట్ విద్యార్థినిని బలితీసుకుంది. మరో కొద్ది రోజుల్లో పీజీ మెడికల్ పూర్తి చేసి డాక్టర్‌గా సేవలందించాల్సిన విద్యార్థిని ఉరి వేసుకుని అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన గురువారం విశాఖపట్నంలో జరిగింది.
విశాఖలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య
ఏఎంసీలో చదువుతున్న శైలజ
ఫైనల్ సెమిస్టర్ పరీక్షల తరుణంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం
మద్దిలపాలెం (విశాఖపట్నం), సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పరీక్షల ఒత్తిడి ఓ మెరిట్ విద్యార్థినిని బలితీసుకుంది. మరో కొద్ది రోజుల్లో పీజీ మెడికల్ పూర్తి చేసి డాక్టర్‌గా సేవలందించాల్సిన విద్యార్థిని ఉరి వేసుకుని అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన గురువారం విశాఖపట్నంలో జరిగింది. ఇందుకు సంబంధించి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస గ్రామానికి చెందిన పెదిరెడ్ల వెంకటరావు కుటుంబం విశాఖలోని రామ్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆయన అనకాపల్లిలోని ఏఎంఏఎల్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె శైలజ (27) ఆంధ్ర మెడికల్ కళాశాల (ఏఎంసీ)లో పోస్టు గ్రాడ్యుయేషన్ (జనరల్ మెడిసిన్) ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రస్తుతం కాలేజీలో ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల 28తో అవి పూర్తికానున్నాయి. రెండు పరీక్షలకు హాజరైన శైలజ.. గురువారం మూడో పరీక్షకు వెళ్లాల్సి ఉంది. పరీక్షకు సిద్ధమవ్వాలని చెప్పడానికి ఉదయం ఎనిమిది గంటల సమయంలో శైలజ తల్లి ఆమె గది వద్దకు వెళ్లి తలుపు తట్టింది. గదిలో నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కంగారుపడింది. వెంటనే భర్తకు చెప్పగా, ఆయన తలుపులు గట్టిగా కొట్టి పిలిచినా లోపల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చింది. తలుపు తాళం విరగ్గొట్టి లోపలకు వెళ్లారు. గదిలో శైలజ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని కనిపించడంతో తల్లిదండ్రులు నిశ్చేష్టులైపోయారు. వెంటనే తేరుకుని శైలజను కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. పరీక్షల ఒత్తిడితోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు చెప్పారని సీఐ అప్పలనాయుడు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎంసెట్‌లో స్టేట్ 7వ ర్యాంకు..
శైలజ చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేది. ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ మార్కులు తెచ్చుకోవడమే కాకుండా 2016 ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించింది. పాండిచ్చేరి జిప్మర్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసింది. పీజీ మెడికల్‌లో అక్కడే పీడియాట్రిక్స్‌లో సీటు వచ్చింది. జనరల్ మెడిసిన్‌లో పీజీ చేయాలనే ఉద్దేశంతో మరోసారి ప్రవేశపరీక్ష రాసింది. ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ సీటు సాధించింది. అంత బాగా చదివే విద్యార్థిని పరీక్షల ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడడంతో తోటి విద్యార్థులను, అధ్యాపకులను ఆశ్చర్యపోతున్నారు.
ఈ వార్తలనూ చదవండి...
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతామా జగన్?!: మంత్రి లోకేశ్