బజార్‌లో పోస్టుల అమ్మకం
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:20 AM
జిల్లాలోని రైతుబజార్లలో ఎస్టేట్ అధికారులు, సూపర్‌వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా రహస్యంగా ఇంటర్వ్యూలు నిర్వహించడంపై అనుమానాలు అధికమవుతున్నాయి.
నోటిఫికేషన్ ఇవ్వకుండానే రైతుబజార్లలో ఎస్టేట్ అధికారులు, సూపర్ వైజర్‌ల పోస్టుల భర్తీ
13 పోస్టులకు 19 మందికి ఇంటర్వ్యూ
ఒక్కో పోస్టు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు బేరం
విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని రైతుబజార్లలో ఎస్టేట్ అధికారులు, సూపర్‌వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా రహస్యంగా ఇంటర్వ్యూలు నిర్వహించడంపై అనుమానాలు అధికమవుతున్నాయి. మూడు ఎస్టేట్ అధికారుల పోస్టులు, పది సూపర్‌వైజర్ పోస్టులకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిన్న ఉద్యోగానికి కూడా బీటెక్ చదివిన యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు ఈ పోస్టులను నోటిఫికేషన్ ఇస్తే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చేవి. కానీ 13 పోస్టుల ఇంటర్వ్యూలకు కనీసం 1ః2 నిష్పత్తిలో 26 మందిని కూడా పిలవలేదు. కేవలం 19 మందిని పిలిచి మమ అనిపించారు. ఇందులో బీసీలు, ఎస్‌సీలు, ఎస్‌టీలు, మహిళలు ఎంతమంది అనేది తెలియదు. ఏ విధంగా ఆయా వర్గాలకు ఈ ఉద్యోగాల సంఖ్యను కేటాయించారో కూడా తెలియదు. అంతా చాలా రహస్యంగా చేశారు. ఇవన్నీ రాజకీయ సిఫారసుల మేరకు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రేటు పలికిందని అంటున్నారు. ఈ లెక్కన ఈ 13 పోస్టుల ద్వారా కోటి రూపాయలకు పైగానే చేతులు మారాయని చెబుతున్నారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారని ‘ఆంధ్రజ్యోతి’ గురువారం ప్రచురించిన కథనంపై అధికార యంత్రాంగం స్పందించలేదు. నోటిఫికేషన్ ఇచ్చామని గాని, రిజర్వేషన్ల ప్రక్రియ పాటించామని గానీ వెల్లడించలేదు. ఇవన్నీ జాయింట్ కలెక్టర్ ఆమోదంతో జరగాలి. అక్కడి నుంచే విజయవాడకు వెళ్లాలి. కానీ ఇక్కడ జేసీ పాత్రను నామమాత్రం చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి, వారి జాబితాను విజయవాడకు పంపినట్టు తెలుస్తోంది. ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలో ముందు నిర్ణయించేశారని, ప్రక్రియ అంతా నామమాత్రమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత నిర్భయంగా ఈ పోస్టులను భర్తీచేయడం వెనుక వ్యవసాయ శాఖ పెద్దలు ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన ఆరోపణలు వస్తున్న దృష్ట్యా ఈ ఇంటర్వ్యూలను రద్దు చేసి, కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి ప్రక్రియ మొత్తం పారదర్శకంగా నిర్వహించాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు.