Share News

రూ. 9,02,434 కోట్లు

ABN , Publish Date - Nov 14 , 2026 | 02:52 AM

సాగర నగరం విశాఖపట్నంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. గురువారం జోష్‌తో మొదలైన సదస్సు రెండో రోజు కూడా అదే ఊపును కొనసాగించింది.

రూ. 9,02,434 కోట్లు

  • విశాఖ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల హోరు

  • ఏపీ జోష్‌ పెంచిన రెండు రోజుల సదస్సు

  • మొత్తం 109 ఎంవోయూలు ఖరారు

  • 3.5 లక్షల మందికి ఉపాధి అవకాశం

  • జనరల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ, కెమికల్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లోకి భారీగా పెట్టుబడులు

  • ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌, కేంద్ర మంత్రులు పీయూష్‌, ప్రహ్లాద్‌, గడ్కరీ, సోనోవాల్‌ రాక

  • గ్రౌండింగ్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలని చంద్రబాబు, లోకేశ్‌ పిలుపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): సాగర నగరం విశాఖపట్నంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. గురువారం జోష్‌తో మొదలైన సదస్సు రెండో రోజు కూడా అదే ఊపును కొనసాగించింది. రెండు రోజుల్లో మొత్తం 109 ఒప్పందాల ద్వారా రూ.9,02434 కోట్ల పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు ముందుకువచ్చాయి. వాటి ద్వారా 3.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఈ ఏడాది సదస్సుకు ముందస్తు కసరత్తు బాగా చేశారు. దేశ, విదేశాల్లో రోడ్‌ షోలు నిర్వహించి, రాష్ట్రంలోని 5 ప్రధాన నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించారు. వాటిల్లోనే కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరు కావలసి ఉండగా ఆయన రాలేకపోయారు.

తొలిరోజు సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌ ముఖ్య అతిథిగా రాగా, పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు హాజరయ్యారు. సాయంత్రం మరో కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌ వచ్చారు. రెండో రోజు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ హాజరయ్యారు. ముగింపు సభకు ముందుగా ప్రకటించినట్టుగానే ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ వచ్చారు.


ఒకరోజు ముందే విందు..సమావేశాలు

విశాఖ సదస్సును విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రులు పక్కా ప్రణాళికతోవ్యవహరించారు. సదస్సుకు ఒక రోజు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్‌ విశాఖపట్నం చేరుకున్నారు. నోవాటెల్‌ హోటల్‌లో విదేశీ మంత్రులు, రాయబారులతో సీఎం చంద్రబాబు సదస్సుకు ముందురోజు రాత్రే భేటీ అయ్యారు. ఆలోచనలు పంచుకున్నారు.

వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన అతిథులకు పార్క్‌ హోటల్‌లో విందు ఏర్పాటుచేశారు. ఆ రోజే కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రభుత్వం ముందస్తు అంచనా ప్రకారం, ఈ సదస్సు ద్వారా రూ.141 ఒప్పందాల ద్వారా రూ.12.14 లక్షల కోట్లు వస్తాయని భావించింది. కానీ ఏ కారణాల చేతనో వాటి విలువ రూ.9 లక్షల కోట్ల వద్ద ఆగింది.


భద్రతకు చట్టం తెస్తామని హామీ

రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా పారిశ్రామిక వేత్తలకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవడం, రాయితీలు రద్దు చేయడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేవారికి భద్రత కల్పించే విధంగా చట్టం తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో ప్రకటించారు. అదే విధంగా కేంద్రం కూడా దీనిపై జాతీయ స్థాయిలో చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. రెండున్నరేళ్లలో రూ.22 లక్షలకు పైగా పెట్టుబడులు సాధించిన నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు గ్రౌండింగ్‌ చేయడంపై దృష్టి సారిస్తామని కూడా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ప్రకటించారు.

పారిశ్రామికవేత్తలకు ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్‌ కాల్‌తోనే స్పందిస్తామని, శంకుస్థాపన చేసిన తరువాత ఆయా ప్రాజెక్టులు తమవిగానే భావించి ముందుకు తీసుకువెళతామని భరోసా ఇచ్చారు. కేవలం నగరాల్లోనే కాకుండా గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోను పెట్టుబడులు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈసారి జపాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ తదితర 18 దేశాల ప్రతినిధులు సదస్సుకు రావడం విశేషం.

ఈసారి సదస్సు ద్వారా మాన్యుఫ్యాక్చరింగ్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ, కెమికల్స్‌ అండ్‌ పెట్రో కెమికల్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టూరిజం తదితర రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, గ్రీన్‌కో ఎనర్జీస్‌, క్లీన్‌ మ్యాక్స్‌, ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్‌, మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, కియా ఇండియా, రెన్యూ ఎనర్జీ వంటి పెద్ద కంపెనీలు ఏపీలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.


రెండో రోజూ అదే జోష్‌

శుక్రవారం 12 కంపెనీలు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటి మొత్తం పెట్టుబడి రూ.1,41,585 కోట్లు. ఆ సంస్థల ద్వారా 10,919 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

  • డేటా సెంటర్‌ క్యాంపస్‌ ఏర్పాటు, 1,400 మెగావాట్ల టెలికాం సెంటర్లను నెలకొల్పేందుకు ఐటీ శాఖతో ఎయిర్‌ట్రంక్‌ ఇండియా-జేసీకే ఇన్‌ఫ్రా ఒప్పందం. రూ.1,03,018 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడి.

  • ప్రకాశం జిల్లా కందుకూరులో మైనింగ్‌ కార్యాకలాపాల కోసం హిందాల్కో గ్రూపు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

  • తిరుపతి జిల్లాలో రూ.510 కోట్ల పెట్టుబడితో ఆర్బిటల్‌ డేటా సెంటర్‌, రాకెట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అగ్నికుల్‌ కాస్మోస్‌ లిమిటెడ్‌ ఒప్పందం.

  • పునరుత్పాదక ఇంధన రంగంలో గ్రీన్‌ జెన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ రూ.8వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏపీ నెడ్‌క్యా్‌పతో ఒప్పందం.

  • పునరుత్పాదక రంగంలో రూ.6,600 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఒప్పందం.

  • రూ.6,452 కోట్ల పెట్టుబడితో కాకినాడ పోర్టు లో మెకనైజ్డ్‌ బెర్త్‌, రీగ్వాసిఫికేషన్‌ ప్లాంట్‌, షిప్‌ బిల్డింగ్‌, రిపేర్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకోసం ఏపీ మారీటైం బోర్డుతో కాకినాడ సీ పోర్టు లిమిటెడ్‌ ఒప్పందం.

  • ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగంలో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు హోధోర్‌ రాకెట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఒప్పందం చేసుకుంది. 200 మందికి ఉద్యోగాలు ఇస్తుంది.

  • రాజధాని అమరావతిలో రూ.175 కోట్ల పెట్టుబడితో ఓబెరాయ్‌ హోటల్‌ ఏర్పాటుకు ఏపీసీఆర్‌డీఏతో ఈఐహెచ్‌ లిమిటెడ్‌ ఒప్పందం.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 02:56 AM