Share News

కురుపాం గురుకులంలో వైరల్‌ జ్వరాలు

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:49 AM

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో వైరల్‌ జ్వరాలు వ్యాపించాయి. రెండు రోజుల్లోనే 110 మంది విద్యార్థినులు జ్వరం, తలనొప్పి, వాంతులు...

కురుపాం గురుకులంలో వైరల్‌ జ్వరాలు

  • 2 రోజుల్లోనే 110 మందికి అస్వస్థత

అమరావతి, కురుపాం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో వైరల్‌ జ్వరాలు వ్యాపించాయి. రెండు రోజుల్లోనే 110 మంది విద్యార్థినులు జ్వరం, తలనొప్పి, వాంతులు, జలుబు, దగ్గుతో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం 80 మందికిపైగా విద్యార్థినులు వైద్య సేవలు పొందుతున్నారు. జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందిస్తున్నారు. ఈ పాఠశాలలో 516 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇటీవల తుఫాను అనంతరం ముగ్గురు విద్యార్థినులకు వైరల్‌ జ్వరాలు రావడంతో అధికారులు చికిత్స అందించారు.

గురువారం ఒక్కసారిగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. మాదలింగి పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ తనూజ పాఠశాలకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. 44 మందిని మాదలింగి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం పాఠశాలకు పంపించారు. మరో నలుగురిని కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. పాఠశాలలో కొంతమంది కోలుకున్నప్పటికీ మరికొందరికి మళ్లీ జ్వరాలు వచ్చాయి. దీంతో శుక్రవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో కేవీ పద్మావతి ఆధ్వర్యంలో జిల్లా వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించారు.

వైద్య బృందాన్ని పాఠశాలలో అందుబాటులో ఉంచారు. మరో రెండు, మూడు రోజులపాటు వైద్యులు అక్కడే ఉంటారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ పి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తాగునీటి నమూనాలను సేకరించారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాఠశాలకు చేరుకుని ఆహార నమూనాలను కూడా సేకరించారు.


సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఆరా

గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో వైరల్‌ జ్వరాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్‌, సత్యకుమార్‌ స్పందించారు. వెంటనే గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మంత్రి సత్యకుమార్‌ ఆదేశాల మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ ఆర్‌.వెంకటరమణ పరిస్థితిని సమీక్షించారు. సమగ్ర నివేదికను మంత్రికి ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 01:51 AM