Share News

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు

ABN , Publish Date - Oct 11 , 2026 | 04:51 AM

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు కనకదుర్గమ్మ బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. తెల్లవారుజామున 2.30 గంటలకు కవాత ఉద్ఘాటన అనంతరం అమ్మవారికి సుప్రభాత సేవ చేస్తారు

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు

  • బాలాత్రిపురసుందరీదేవిగా దుర్గమ్మ తొలి రోజు దర్శనం

  • ఉదయం 8 గంటలకు దర్శనం ప్రారంభం

  • 13న తమిళనాడు సీఎం విజయ్‌, 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక

  • 16న దుర్గమ్మకు సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ

విజయవాడ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు కనకదుర్గమ్మ బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. తెల్లవారుజామున 2.30 గంటలకు కవాత ఉద్ఘాటన అనంతరం అమ్మవారికి సుప్రభాత సేవ చేస్తారు. 3 గంటలకు అమ్మవారు, ఉపాలయాల మూర్తులకు స్నపనాభిషేకం నిర్వహిస్తారు. 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కలెక్టర్‌ లక్ష్మీశ, పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, దేవస్థాన ఈవో శీనానాయక్‌ అమ్మవారి తొలిదర్శనం చేసుకుంటారు. 9 గంటలకు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశన, నవరాత్రి కలశ స్థాపన చేస్తారు. 12వ తేదీ నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటలకు దర్శనాన్ని నిలుపుదల చేస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రుల్లో అమ్మవారి దర్శనానికి 25 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు.

3,130 మందితో పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్‌ కోసం 40 ప్రదేశాలను ఎంపిక చేశారు. 13వ తేదీన తమిళనాడు సీఎం జోసఫ్‌ విజయ్‌, 14న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అమ్మవారి దర్శనానికి రానున్నారు. 16వ తేదీ మూలా నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ ఏడాది ఏఐ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని అంచనా వేయబోతున్నారు. ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు భక్తులు వచ్చే బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్‌ ప్రాంతాలపై నిఘా కోసం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను దుర్గాఘాట్‌ చెంతన ఉన్న మోడల్‌ గెస్ట్‌హౌ‌స్‌లో ఏర్పాటు చేశారు. అమ్మవారిని ఆడపడుచులా భావించి పోలీసు శాఖ తరపున పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు దంపతులు శనివారం సాయంత్రం తొలిసారె సమర్పించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 04:51 AM