ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ ఏసీ శాంతి.. కుమారుడితో ములాఖాత్ పిటిషన్ తీర్పు వాయిదా
ABN , Publish Date - Apr 13 , 2026 | 07:37 PM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15, 16వ తేదీల్లో విచారించేందుకు అనుమతిచ్చింది.
విజయవాడ, ఏప్రిల్ 13: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిపై విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంతిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆమెను రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది.
ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఏసీబీ అధికారులు ఆమెను విచారించనున్నారు. ప్రస్తుతం ఆమె ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు.. తన వ్యక్తిగత పరిస్థితిని వివరిస్తూ శాంతి దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా కోర్టులో చర్చ జరిగింది. తనకు రెండున్నరేళ్ల చిన్న బాబు ఉన్నాడని, పసివాడు కావడంతో రోజువారీగా జైలులో ములాఖాత్‌కు(కలిసేందుకు) అనుమతించాలని ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. తీర్పును ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.
దేవాదాయ శాఖలో కీలక పదవిలో ఉన్న శాంతి.. అధికార దుర్వినియోగానికి పాల్పడి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో లభించిన కీలక పత్రాలు, ఆస్తుల వివరాల ఆధారంగా ఆమెను అరెస్ట్ చేశారు. కస్టడీ విచారణలో మరిన్ని బినామీ ఆస్తులు, నిధుల మళ్లింపు వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఏప్రిల్ 16న వెలువడనున్న తీర్పు, కస్టడీ విచారణలో వెల్లడయ్యే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఇవి కూడా చదవండి
క్రూడాయిల్ పైకి.. స్టాక్ మార్కెట్లు కిందకి..
జీవితం నాశనం చేసే అలవాట్లు ఇవే.. ప్రతి పురుషుడు తప్పక తెలుసుకోవాల్సినవి