మిగిలేది జ్ఞాపకాలే..!
ABN , Publish Date - Aug 30 , 2026 | 05:06 AM
ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. ఆ గ్రామాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. తరతరాలుగా తమను పెనవేసుకున్న ఊరు, నడిచిన నేల, చదివిన బడి, మొక్కిన గుడి, చెట్టును పుట్టను వదిలి నిర్వాసిత కుటుంబాలు కొత్త గమ్యాల వైపు కదులుతున్నాయి.
చదివిన బడి, మొక్కిన గుడి
ఇక.. కనుమరుగు
పెళ్లి వేడుకలకు ఇక సెలవ్
కన్నీటితో ఊళ్లను వీడుతున్న
వెలిగొండ నిర్వాసితులు
మార్కాపురం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. ఆ గ్రామాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. తరతరాలుగా తమను పెనవేసుకున్న ఊరు, నడిచిన నేల, చదివిన బడి, మొక్కిన గుడి, చెట్టును పుట్టను వదిలి నిర్వాసిత కుటుంబాలు కొత్త గమ్యాల వైపు కదులుతున్నాయి. లక్షలాది మంది భవిష్యత్ కోసం ఊళ్లను, భూములను త్యాగం చేసిన వెలిగొండ నిర్వాసిత కుటుంబాలు కొత్త భవిష్యత్తు దిశగా బయటకు వస్తున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం దీనిని ప్రారంభించనున్నారు. అనంతరం.. కృష్ణాజలాలను నల్ల్లమల సాగర్ రిజర్వాయర్‌లోకి వదులుతారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేళ 11 గ్రామాలకు చెందిన 7,321 నిర్వాసిత కుటుంబాలు ఊళ్లను వదిలి బయటకు వస్తున్నాయి. వారికి రావాల్సిన పరిహారం రూ.910 కోట్లు ఇస్తూనే మరో రూ.169 కోట్లు అదనంగా చెల్లించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాల్లో కొంత భరోసా నింపింది.
కడసారి చూసుకుంటూ..
ఎన్నో ఏళ్లుగా తమ జీవితాలకు సాక్ష్యంగా నిలిచిన పల్లెను విడిచి వెళ్లాల్సిన వేళ వారి ఆవేదన కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. నిన్నటివరకు పిల్లల కేరింతలతో కళకళలాడిన పాఠశాలలు ఇక కనుమరుగు కానున్నాయి. మొత్తం ముంపు గ్రామాల్లో 10 పాఠశాలలు ఉండగా వీటిలో 769 మంది పిల్లలు చదువుతున్నారు. వీరందరి కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. నిన్నటివరకు చదివిన బడి ఇక ఉండదన్న విషయం తలచుకుని విద్యార్థులు దిగాలుగా వెళుతుంటే, గతంలో మనం చదివిన బడి ఇది అని పూర్వ విద్యార్థులు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లో కన్నా ఎక్కువ మందితో నడిచిన స్కూల్.. సుంకేసుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ విశాలమైన పాఠశాల ఇప్పుడు బోసిపోయింది. ఇదే గ్రామంలో ఎందరో పూజలు చేసిన రామాలయాన్ని.. వదిలి వెళ్లే ముందు స్థానికులు కడసారి దర్శించుకున్నారు. కలనూతల గ్రామంలో ప్రఖ్యాతి గాంచిన పీర్ల చావిడిని వీడిన ప్రజలు కన్నీటిపర్యంతమవుతున్నారు. శనివారం చివరిసారి ముస్లింలు ప్రార్థనలు చేశారు.
ఒకే రోజు 6 పెళ్లిళ్లు
సొంత ఊరిలో ఉత్సవాలైనా, ఊరేగింపులైనా, పెళ్లిళ్లయినా ఇదే ఆఖరు.. అని భావిస్తున్న స్థానికులు రెండురోజుల కిందట చాలా చోట్ల పెళ్లిళ్లు నిర్వహించారు. సుంకేసుల ఎస్సీ కాలనీలో ఒకే రోజు ఆరు పెళ్లిళ్లు జరిగాయి. బంధువులంతా ఎక్కడెక్కడికి వెళ్తారోనని భావిస్తూ.. వారంతా ఉన్నప్పుడే ఉన్న ఊరిలోనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఇలా చేసినట్టు బంధువులు తెలిపారు.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు