Share News

కూటమి సంకల్పానికి సజీవ సాక్ష్యం.. వెలిగొండ: డిప్యూటీ సీఎం పవన్

ABN , Publish Date - Aug 31 , 2026 | 01:40 PM

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కూటమి ప్రభుత్వ సంకల్పానికి వెలిగొండ ప్రాజెక్టు సజీవ సాక్ష్యమని పేర్కొంటూ.. నాలుగు జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

కూటమి సంకల్పానికి సజీవ సాక్ష్యం.. వెలిగొండ: డిప్యూటీ సీఎం పవన్
Velugonda Project

అమరావతి, ఆగస్టు 31: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణా జలాలు కరవు పీడిత ప్రాంతాలకు చేరనున్న ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కావడం మార్కాపురం, ప్రకాశం, కడప, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ప్రజలకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు సాకారం కావడానికి మూడు దశాబ్దాలుగా కృషి చేసిన ఇంజినీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంస్థలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.


వెలిగొండ ప్రాజెక్టు కోసం 7,300 మందికి పైగా తమ ఇళ్లు.. భూములు కోల్పోయి నిర్వాసితులుగా మిగిలారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం రూ.905 కోట్లు విడుదల చేయగా.. ఇప్పటికే రూ.768 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

1996లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని.. నేడు ఆయన నాయకత్వంలోనే తొలి దశ ప్రారంభం అవుతోందని పవన్ గుర్తుచేశారు. చంద్రబాబు దూరదృష్టి, సంకల్పం కరవు ప్రాంతాల్లో జల సిరులు పారించనుందని పేర్కొన్నారు. మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో జల్‌ జీవన్‌ మిషన్–అమరజీవి జలధార కింద చేపడుతున్న మెగా వాటర్‌ గ్రిడ్‌ పథకానికి వెలిగొండ ప్రధాన నీటి వనరుగా నిలవనుందని తెలిపారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్ప సాధనలోనూ ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ.. ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

మియాపూర్‌లో విషాదం.. చదువు రావడం లేదనే మనస్తాపంతో

రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఐదు బైక్‌ల దగ్ధం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 02:04 PM