Share News

పరిహారం.. దరహాసం

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:21 AM

వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోంది.

పరిహారం.. దరహాసం

  • వెలిగొండ నిర్వాసితులకు అదనపు వరాలు

  • మరో రూ.169 కోట్ల పరిహారం

  • గెజిట్‌, జాబితాల్లో పేర్లు లేనివారికి సాయం

  • 2019 తర్వాత 18 ఏళ్లు నిండిన 1200 మందికి తలా 2 లక్షలు అందజేత

  • రక్షాబంధన్‌ కానుకగా మహిళలకు చీర, గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ

  • నిర్వాసితులకు నెలకు సరిపడా రేషన్‌ కిట్‌

  • పశువులకు నెల రోజులకు దాణా

  • సీఎం చంద్రబాబు నిర్ణయం: నిమ్మల

అమరావతి/మార్కాపురం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోంది. తరాలుగా ఉంటున్న సొంతూళ్లను, ఇళ్లను విడిచి వెళ్తున్న నిర్వాసితులకు ఇప్పటికే ప్రకటించి, చెల్లిస్తున్న పరిహారానికి అదనంగా మరిన్ని వరాలను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన రూ.910 కోట్లకు అదనంగా.. గెజిట్‌లోనూ, జాబితాలోనూ పేర్లు లేని 1800 మందికి రూ.169 కోట్లు చెల్లించాలని ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయించారు. ఇందులో 1200 మంది యువత ఉన్నారు.


2019 తర్వాత 18 ఏళ్లు నిండిన 1200 మంది యువతకు ప్రత్యేకంగా తలా రూ.రెండు లక్షలు చెల్లించాలని ప్రకటించారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు ఒక నెలకు సరిపడా రేషన్‌ కిట్‌నూ అందించనున్నారు. కాలపరిమితి దాటాక నిర్వాసితులకు చెల్లించేందుకు మార్గదర్శకాలు అంగీకరించవని ఆర్థిక శాఖ అధికారులు అడ్డుచెప్పగా.. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్నవారికి మానవతా దృక్పథంతో పరిహారం చెల్లిద్దామని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే వెలిగొండ నిర్వాసితులకు చేసిన చెల్లింపులపై క్యాబినెట్‌ సమావేశంలో చేర్చి ఆమోదం పొందుదామని పేర్కొన్నారు. ఈ వివరాలను శుక్రవారం జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మార్కాపురం కలెక్టరేట్‌లో మీడియా ప్రతినిధులకు వివరించారు. అర్హులైన నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులైన మహిళలకు రక్షాబంధన్‌ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కానుకను ఇవ్వాలని నిర్ణయించారని నిమ్మల తెలిపారు. రక్షాబంధన్‌ కానుకగా నిర్వాసిత మహిళలకు చీర, గాజులు, పసుపు, కుంకుమ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అలాగే నిర్వాసిత గ్రామాల్లో 4,933 పశువులు ఉన్నట్లు గుర్తించామని, ఇప్పటికిప్పుడు బయటకు వెళ్లిన కారణంగా ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో వాటికి నెల రోజులకు సరిపడా దాణా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.


నిర్వాసితులందరికీ న్యాయం

ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో, ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన నిర్వాసితుల సంక్షేమం కూడా ప్రభుత్వానికి అంతే ముఖ్యమని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సుమారు రూ.910 కోట్లు చెల్లించాల్సి ఉండగా, గత జగన్‌ ప్రభుత్వంలో వారికి ఎలాంటి చెల్లింపులు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 40 రోజుల్లో మూడు విడతల్లో సుమారు రూ.768 కోట్లను చెల్లించినట్లు తెలిపారు. స్థలం తీసుకునే వారికి రూ.11,76,000, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద రూ.12.50 లక్షలు, గిరిజనులకు 13.01 లక్షలు(ఎకరాకు) చెల్లించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రాజెక్టు పరిధిలోని 11 ముంపు గ్రామాలకు 11 కమిటీలను ఏర్పాటు చేసి, జిల్లా స్థాయి అధికారులు, జలవనరుల శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో నిర్వాసితుల గ్రీవెన్స్‌లను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొంతమంది నిర్వాసితులలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వినతులను ప్రత్యేకంగా తీసుకున్నామన్నారు. 1800 మందికి గెజిట్‌లో పేర్లు లేవని, రేషన్‌ కార్డులు లేవని, పేర్లు సరిపోవడం లేదన్న కారణాలతో దరఖాస్తులు వచ్చాయన్నారు. వారికి రూ.169 కోట్లు చెల్లించనున్నట్టు తెలిపారు. ఈ మొత్తం అదనపు భారమైనా ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామన్నారు. వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రికార్డుల్లో లోపాలున్నా ఆందోళన అవసరం లేదన్నారు.


గడువులోపే పూర్తి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలనే మూడు దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టు కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రామానాయుడు తెలిపారు. 1996లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని మంత్రి గుర్తుచేశారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 ఆగస్టు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి నిర్దేశించారని తెలిపారు. రెండేళ్లలో రూ.2,250 కోట్లకు పైగా వ్యయం చేశామన్నారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నట్టు తెలిపారు. 2024లో ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే సమయానికి వెలిగొండ హెడ్‌ రెగ్యులేటర్‌కు సంబంధించిన వింగ్స్‌వాల్స్‌ పనులు పూర్తికాని పరిస్థితి ఉండేదని నిమ్మల చెప్పారు. 2025 మేలో పనులు ప్రారంభించి 2026 మే నాటికి పూర్తి చేసినట్లు వివరించారు. టన్నెల్‌-1కు సంబంధించి సుమారు 1.20 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తొలగింపు పనులు, టన్నెల్‌-2కు సంబంధించి సుమారు 4,990మీ. బెంచింగ్‌ పనులు, 6,990మీ. లైనింగ్‌ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టులో కీలకమైన 11,000 క్యూసెక్కుల సామర్థ్యంకలిగిన ఫీడర్‌ కెనాల్‌ పనులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ఈ పనులకు సుమారు రూ.5,460 కోట్ల నిధులు మంజూరు చేసి, టెండర్లు పిలిచి, పనులను వేగవంతం చేసినట్లు చెప్పారు. ఫీడర్‌ కెనాల్‌లో భాగంగా 5.3 కిలోమీటర్ల పీసీ వాల్‌ నిర్మాణం, 11 కిలోమీటర్ల లైనింగ్‌ పనులు పూర్తి చేసినట్లు మంత్రి వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

వాల్మీకి కార్పొరేషన్ స్కాం.. మంత్రి పదవికి బి. నాగేంద్ర రాజీనామా

జగన్‌కు స్థానిక ఎన్నికలు జరగడం ఇష్టం లేదు సీఎం చంద్రబాబు

Updated Date - Aug 29 , 2026 | 03:23 AM