Share News

కిడ్నీ పనితీరు మారుతోంది

ABN , Publish Date - Sep 13 , 2026 | 03:27 AM

ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల మూల కారణాలను కనుగొనడానికి జరుగుతున్న నిపుణుల బృందం అధ్యయనంలో ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐసీఎంఆర్‌- డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ఆమోదంతో 7 మండలాల్లో 5,851మందిని పరిశీలించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ అధ్యయనంలో ఇప్పటివరకు నాలుగు మండలాల్లో 3,897 మందికి పరీక్షలు చేశారు.

కిడ్నీ పనితీరు మారుతోంది

  • ఉద్ధానంలో నిపుణుల బృందం అధ్యయనంలో గుర్తింపు

  • ఐసీఎంఆర్‌కు మధ్యంతర నివేదిక.. 7 మండలాల్లో

  • 5,851 మందికి పరీక్షలు చేయడం లక్ష్యం

  • ఇప్పటివరకు 4 మండలాల్లో 3,897 మందికి పరీక్షలు

  • వారిలో 949 మందికి కిడ్నీ వ్యాధి నిర్ధారణ

  • కవిటి మండలంలో కేసులు ఎక్కువ

  • త్వరలోనే మిగతా 3 మండలాల్లో పూర్తి

  • తుది ఫలితాల తర్వాత మూలాలు తెలుస్తాయి: ఆరోగ్య మంత్రి

అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల మూల కారణాలను కనుగొనడానికి జరుగుతున్న నిపుణుల బృందం అధ్యయనంలో ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐసీఎంఆర్‌- డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ఆమోదంతో 7 మండలాల్లో 5,851మందిని పరిశీలించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ అధ్యయనంలో ఇప్పటివరకు నాలుగు మండలాల్లో 3,897 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 949మందికి మూత్రపిండ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 550 మందికి క్రానిక్‌ కిడ్నీ డీసీజ్‌ (సీకేడీ), 399 మందికి కారణం తెలియని క్రానిక్‌ కిడ్నీ డీసీజ్‌ (సీకేడీయూ) ఉన్నట్లు మధ్యంతర విశ్లేషణలో తేలింది. కవిటి మండలంలో పరిశీలించినవారిలో వ్యాధి శాతం, సీకేడీ- సీకేడీయూ కేసుల సంఖ్య అత్యధికంగా నమోదైంది. ఈ నివేదికను నిపుణులబృందం ఐసీఎంఆర్‌కు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు అందించారు. ఈ బృందానికి సీనియర్‌ నెఫ్రాలజిస్ట్‌ డా.తాటపూడి రవిరాజ్‌ మెంటర్‌, ఆంధ్రా మెడికల్‌ కాలేజీ నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్‌ డా.జి.ప్రసాద్‌ ప్రిన్సిపాల్‌ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే మిగిలిన మూడు మండలాల్లో పరీక్షలు చేపడతామని అధ్యయన బృందం మంత్రికి తెలిపింది.


రక్త, మూత్ర నమూనాలతో విశ్లేషణ

సర్వే, రక్తం-మూత్ర నమూనాల సేకరణ పూర్తయిన 3,897 మంది ఆధారంగా ఈ మధ్యంతర విశ్లేషణ చేపట్టారు. త్వరలోనే మిగిలిన వారి నుంచి కూడా నమూనాలు సేకరించనున్నారు. ఇప్పటి వరకు చేసిన విశ్లేషణలో కిడ్నీ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ రక్తంలోని క్రియాటిన్‌, యూరియా, యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు క్రమంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. ఈ ఫలితాలు కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గుతున్నట్లు సూచిస్తున్నాయి. వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ కిడ్నీ పనితీరుకు సంబంధించి మార్పులు స్పష్టంగా కనిపించినట్లు నివేదికలో పేర్కొన్నారు. మూత్రంలో అల్బుమిన్‌ స్థాయిలపైనా విశ్లేషణ చేశారు. కొందరిలో కిడ్నీ పనితీరు సాధారణంగా ఉన్నప్పటికీ అల్బుమిన్‌ అసాధారణంగా కనిపించినట్లు గుర్తించారు. కిడ్నీ పనితీరు తగ్గడంతో పాటు అల్బుమిన్‌ పెరిగినవారిని ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తేలింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 55.3 శాతం మంది 48ఏళ్లకు పైబడిన వారున్నారు.

సుమారు మూడో వంతు మంది వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్నవారు. వారిలో పొగాకు వినియోగం 38.8 శాతం, మద్యం వినియోగం 23.7శాతంగా నమోదైంది. పురుగు మందులు, ఎరువుల వినియోగం, తాగునీటి వనరులు, వ్యవసాయపనులు, ఎండ వేడి, జీవనశైలి, మధుమేహం, రక్తపోటు, మందుల వినియోగం తదితర అంశాలపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. తుది ఫలితాల ద్వారా కిడ్నీ వ్యాధుల మూలాలు తెలుస్తాయని ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఉద్ధానంలో సీకేడీ, సీకేడీయూ కారణాలను గుర్తించడం, వ్యాధిని ముందుగానే గుర్తించే మార్గాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా చేపట్టిన ఈ అధ్యయనానికి రూ. 6.2 కోట్ల నిధులు కేటాయించారు. మూడు సంవత్సరాల కాల పరిమితి విధించారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం

‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

Updated Date - Sep 13 , 2026 | 03:27 AM