Share News

అచ్యుతాపురంలో గ్యాస్‌ దందా

ABN , Publish Date - Sep 13 , 2026 | 01:01 AM

అచ్యుతాపురంలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్లతో కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నారు. గ్యాస్‌ డీలర్లు, డెలివరీ బాయ్‌లతో కుమ్మక్కై దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం విజిలెన్స్‌ అధికారులు దిబ్బపాలెంలో చేసిన దాడుల్లో ఒకేసారి 82 గ్యాస్‌ సిలిండర్లు పట్టుబడ్డాయంటే ఏ స్థాయిలో ఈ దందా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.

అచ్యుతాపురంలో గ్యాస్‌ దందా
రీఫిల్లింగ్‌ చేయడానికి ఉపయోగిస్తున్న పరికరాలు

- డీలర్ల నుంచి తీసుకుని చిన్న, పెద్ద సిలిండర్లలోకి రీఫిల్లింగ్‌

- అధిక ధరకు దర్జాగా విక్రయాలు

- రోజూ రూ.వేలల్లో ఆదాయం పొందుతున్న అక్రమార్కులు

అచ్యుతాపురం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురంలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్లతో కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నారు. గ్యాస్‌ డీలర్లు, డెలివరీ బాయ్‌లతో కుమ్మక్కై దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం విజిలెన్స్‌ అధికారులు దిబ్బపాలెంలో చేసిన దాడుల్లో ఒకేసారి 82 గ్యాస్‌ సిలిండర్లు పట్టుబడ్డాయంటే ఏ స్థాయిలో ఈ దందా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రత్యేక ఆర్థిక మండలిలోని కర్మాగారాల్లో ఉద్యోగులు, కార్మికులు, వలస కూలీలు వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరంతా అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లోనే నివాసముంటున్నారు. వీరి కోసం అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో చిన్నా, చితక కలిపి వంద వరకు హోటళ్లు వెలిశాయి. మరో వంద వరకు తోపుడుబండ్లు, స్వీట్‌ షాపులున్నాయి. వీరందరికీ వంట గ్యాస్‌ తప్పని సరి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా వంటగ్యాస్‌ అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. గ్యాస్‌ డీలర్లు, డెలివరీ బాయ్‌ల నుంచి అక్రమ వ్యాపారులు సిలిండర్లు తీసుకుని ప్రత్యేక పరికరాల ద్వారా ఐదు కిలోలు, 19 కిలోల సిలిండర్లలో ఫిల్లింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 950లు ఉంటే దీనిని గ్యాస్‌ డీలర్లు అక్రమ వ్యాపారులకు రూ.2400లకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. అక్రమార్కులు ఈ గ్యాస్‌ని ఐదు కిలోలు, 19 కిలోల సిలిండర్లలోకి రీఫిల్లింగ్‌ చేసి కిలో రూ.250 చొప్పున విక్రయిస్తున్నారు. 19 కిలోల సిలిండర్లను వ్యాపార నిమిత్తం వినియోగిస్తారు. దీని అసలు ధర రూ.2820లు అయితే వీరు రూ.4700 లకు విక్రయిస్తున్నారు. వలస కార్మికులు ఐదు కిలోల సిలిండర్లను ఎక్కువగా వాడతారు. కర్మాగారాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు (బ్యాచిలర్స్‌) ఇద్దరు, నలుగురు కలిసి ఒక గదిని అద్దెకు తీసుకొని వండుకుంటున్నారు. ఇలాంటి వారు తప్పనిసరిగా గ్యాస్‌ బ్లాక్‌లోనే కొనాలి. దీనిని గమనించి భారీగా అక్రమ గ్యాస్‌ విక్రయిస్తున్నారు. ఎలమంచిలి, గాజువాకకు చెందిన ఇద్దరు డీలర్లు ఇక్కడ రీఫిల్లర్స్‌కి రోజుకి 40 సిలిండర్‌లు ఇస్తున్నారు. 40 సిలిండర్లు ఇచ్చినందుకు డీలర్‌లకు రోజుకు రూ.58 వేలు అదనపు ఆదాయం వస్తుండగా, రీఫిల్లర్లకు రోజుకు రూ.20 వేలు మిగులుతోంది. వినియోగదారుడు గ్యాస్‌ బుక్‌ చేసిన తరువాత ఓటీపీ నంబరు చెబితే తప్ప డీలర్లు గ్యాస్‌ ఇవ్వడం లేదు. కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రీఫిల్లర్స్‌కి రోజుకి 40 సిలిండర్లు వీరు సరఫరా చేస్తున్నారు.

Updated Date - Sep 13 , 2026 | 01:01 AM