రేణిగుంట-అరక్కోణం మధ్య మరో 2 లైన్లు
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:13 AM
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని రేణిగుంట-అరక్కోణం మధ్య 77 కిలోమీటర్ల మేర 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ లైన్ల నిర్మాణంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు, అలాగే తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలకు వెళ్లే భక్తులకు కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది.
77 కిలోమీటర్ల నిర్మాణానికికేంద్ర క్యాబినెట్ ఆమోదం
తిరుమల వెళ్లే భక్తులకు పెరగనున్న కనెక్టివిటీ
నాలుగు రాష్ట్రాల్లో మొత్తంరూ.10,021 కోట్లతో పనులు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని రేణిగుంట-అరక్కోణం మధ్య 77 కిలోమీటర్ల మేర 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ లైన్ల నిర్మాణంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు, అలాగే తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలకు వెళ్లే భక్తులకు కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేస్తూ.. ప్రయాణికులు, సరకు రవాణా రద్దీని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాదిలో ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 17 జిల్లాల పరిధిలో రూ.10,021 కోట్ల వ్యయంతో 540 కిలోమీటర్ల మేర ఐదు మల్టీట్రాకింగ్ (లైన్ల విస్తరణ) ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. 2029-30 నాటికి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రవాణా వ్యయం తగ్గి, సమయం ఆదా అవుతుంది. ఈ ఐదు ప్రాజెక్టుల పరిధిలో 2,121 గ్రామాలు, సుమారు 52 లక్షల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టుల వల్ల దాదాపు 8 కోట్ల లీటర్ల ఇంధన(డీజిల్) దిగుమతి తగ్గి, 42 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని, ఇది 2 కోట్ల చెట్లను నాటడంతో సమానమని కేంద్రం తెలిపింది. కాగా, ముంబై-చెన్నై హైడెన్సిటీ కారిడార్‌లో భాగమైన అరక్కోణం- రేణిగుంట(తిరుపతి) మార్గం తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది భక్తులతో నిత్యం రద్దీగా ఉంటుంది.
ప్రస్తుతం ఈ సెక్షన్‌లో ట్రాఫిక్ సామర్థ్యం 120 శాతానికి చేరి తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.1,936 కోట్లతో 77 కిలోమీటర్ల పొడువున 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 12 భారీ వంతెనలు, 221 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. ఈ లైన్ల నిర్మాణంతో ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలు, తమిళనాడులోని రాణిపేట, తిరువళ్లూరు జిల్లాలకు లబ్ధి కలగనుంది. ఈ లైన్ల నిర్మాణంతో రాయలసీమ పవర్ ప్లాంట్, కుడ్గి ప్లాంట్‌లకు ఎన్నోర్ పోర్టు నుంచి బొగ్గు రవాణా సులభతరం అవుతుంది. ఆటోమొబైల్ రవాణాకు, సిడ్కో, సిప్‌కాట్, సిమెంట్ పరిశ్రమలకు కొత్త ఊపు రానుంది.
ఢిల్లీ వైపు ప్రయాణం మరింత వేగవంతం..
తెలంగాణకు అత్యంత కీలకమైన సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)- కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర లైన్ల విస్తరణ(మల్టీట్రాకింగ్) చేపట్టనున్నారు. దక్షిణాది నుంచి ఉత్తరాదిని కలిపే అత్యంత రద్దీ మార్గాల్లో ఇదొకటి. మల్టీట్రాకింగ్ పూర్తయితే సికింద్రాబాద్ నుంచి వరంగల్, కాజీపేట, ఢిల్లీ వైపు వెళ్లే ప్రయాణికుల రైళ్లతోపాటు సరకు రవాణా రైళ్ల రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి.
మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు: అశ్వినీ వైష్ణవ్
రైల్వే రద్దీని తగ్గించడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి 7 హై-డెన్సిటీ రైల్వే కారిడార్లను నాలుగు లైన్లుగా మార్చుతున్నామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. క్యాబినెట్ భేటీ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఏడు హై-డెన్సిటీ కారిడార్లలో ఢిల్లీ-ముంబై, ముంబై-చెన్నై, చెన్నై-కోల్‌కతా, ఢిల్లీ-కోల్‌కతా తదితర అత్యంత రద్దీ మార్గాలున్నాయని చెప్పారు. రూ.20,804 కోట్లతో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో అదనంగా 1196 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ పెరగనుందన్నారు. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్‌కు సంబంధించిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి సిద్ధమవుతుందని చప్పారు.కాగా, హై-డెన్సిటీ కారిడార్ల ఆధునికీకరణతో విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్లు, రేణిగుంట మీదుగా నాలుగు రైల్వే లైన్ల నిర్మాణం జరగనుంది.
ఈ వార్తలనూ చదవండి:
రెన్యువల్ అయ్యేలా చర్యలు చేపట్టండి