Share News

పట్టపగలు నడిరోడ్డుపై భారీ దోపిడీ

ABN , Publish Date - Nov 05 , 2026 | 07:01 AM

పట్టపగలు నడిరోడ్డుపై భారీ దోపిడీ జరిగింది. ఆటోను అడ్డగించి ఇద్దరు వ్యాపారులను కిడ్నాప్‌ చేసిన దుండగులు వారిని శివారు ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రం గా కొట్టి రూ.2కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

పట్టపగలు నడిరోడ్డుపై భారీ దోపిడీ

  • రూ.2 కోట్ల బంగారు ఆభరణాలు అపహరణ

  • ఆటోను అడ్డగించి ఇద్దరు వ్యాపారుల కిడ్నాప్‌

  • ఒంగోలులో దారుణం.. ఆస్పత్రిలో బాధితులు

ఒంగోలు క్రైం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పట్టపగలు నడిరోడ్డుపై భారీ దోపిడీ జరిగింది. ఆటోను అడ్డగించి ఇద్దరు వ్యాపారులను కిడ్నాప్‌ చేసిన దుండగులు వారిని శివారు ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రం గా కొట్టి రూ.2కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఒంగోలు నగరంలో బుధవారం జరిగిందీ ఘటన. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఆర్‌డీ బాలాజీ, ఆయన కుమారుడు రత్నశరణ్‌ రెండు కిలోల బంగారు ఆభరణాలతో శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో బుధవారం ఉదయం 5 గంటలకు ఒంగోలుకు చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌ నుంచి షేరింగ్‌ ఆటోలో లాడ్జికి బయల్దేరారు.

వీరు ప్రతి బుధవారం ఒంగోలు వచ్చి ఆర్డర్‌ ఇచ్చిన వారికి బంగారు ఆభరణాలు ఇచ్చి వెళ్తుంటారు. ఈ సమాచారం తెలుసుకున్న దుండగులు పక్కా ప్రణాళికతో ఇన్నోవా కారులో ఒంగోలు రైల్వేస్టేషన్‌కు కొద్ది దూరంలోనే ఆటోను అడ్డగించారు. వీరిద్దరిపై దాడి చేసి బలవంతంగా కారులోకి ఎక్కించుకొని నగరం ఉత్తరం వైపు ఫ్లైఓవర్‌ వద్దకు తీసుకెళ్లి దాడి చేశారు. వారి వద్ద ఉన్న రెండు కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన బాధితులు స్థానికుల సహకారంతో రిమ్స్‌లో చేరారు. ఔట్‌పోస్టు పోలీసుల సమాచారంతో టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో ఆటోలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని, వారే దుండగులకు సమాచారం ఇచ్చి ఉంటారని వ్యాపారులు అనుమానిస్తున్నారు. ఆటో డ్రైవర్‌ సైతం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోవడం గమనార్హం.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 07:02 AM