టీటీడీ బోర్డు టర్మ్ పూర్తి
ABN , Publish Date - Oct 31 , 2026 | 03:17 AM
టీటీడీ ప్రస్తుత పాలక మండలి కాలపరిమితి నేటితో ముగియనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడిని..
నేటితో ముగియనున్న రెండేళ్ల కాలపరిమితి
పొడిగింపునకు చట్టంలో లేని అవకాశం
ఎన్నికల కోడ్ కారణంగా నూతన మండలి
ఏర్పాటు ఆలస్యం.. ఎన్నికల తర్వాతే కొత్త బోర్డు
పొడిగింపునకు చట్టంలో లేని అవకాశం
తిరుమల, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): టీటీడీ ప్రస్తుత పాలక మండలి కాలపరిమితి నేటితో ముగియనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడిని, మరో 23 మందిని సభ్యులుగా నియమిస్తూ 2024 నవంబరు 1న ఉత్తర్వులు ఇచ్చింది. నవంబరు 6న బీఆర్ నాయుడు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో శనివారం (అక్టోబరు 31)తో ప్రస్తుత బోర్డు కాలపరిమితి పూర్తికానుంది. దీంతో చైర్మన్ ఆఫీస్ కార్యకలాపాలు, చైర్మన్, సభ్యుల సిఫారసు లేఖలపై దర్శన కేటాయింపులు వంటివన్నీ శనివారం నుంచి నిలిచిపోనున్నాయి.
దేవదాయ చట్టం ప్రకారం బోర్డు ఏర్పాటైన తర్వాత రెండేళ్ల వరకూ దాని పదవీ కాలం ఉంటుంది. దీని ప్రకారం 2024 నవంబరు 1 బోర్డు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, 2026 అక్టోబరు 31తో ఆ మండలికి కాలపరిమితి ముగస్తుంది. అయితే బోర్డు కాలపరిమితి పొడిగింపునకు చట్టంలో ఎలాంటి అవకాశం లేదు. మరోవైపు ఇదే సమయంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో.. కొత్త బోర్డు ఏర్పాటు ప్రస్తుతానికి కుదరదు. ఎన్నికల తర్వాతే నూతన బోర్డు ఏర్పాటు అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తదుపరి టీటీడీ చైర్మన్ ఎవరనే దానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు నూతన బోర్డు ఏర్పాటయ్యే వరకు స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుకు అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?