Share News

కొండెక్కే ప్రతి భక్తుడికీ బీమా.. అలిపిరి దాటినప్పటి నుంచీ వర్తింపు..

ABN , Publish Date - Sep 10 , 2026 | 04:58 AM

తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికీ బీమా సదుపాయం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రకటించారు. అలిపిరి దాటినప్పటి నుంచీ భక్తులందరికీ ఈ గ్రూప్‌ పాలసీ వర్తిస్తుందని తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.

కొండెక్కే ప్రతి భక్తుడికీ బీమా.. అలిపిరి దాటినప్పటి నుంచీ వర్తింపు..

  • సహజ మరణాలకు రూ.2 లక్షలు

  • ప్రమాదాల్లో మరణిస్తే రూ.10 లక్షలు

  • రివాల్వింగ్‌ ఫండ్‌ కింద ఎల్‌ఐసీకి రూ.3 కోట్లు జమ చేయనున్న టీటీడీ

  • బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు

తిరుమల, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికీ బీమా సదుపాయం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రకటించారు. అలిపిరి దాటినప్పటి నుంచీ భక్తులందరికీ ఈ గ్రూప్‌ పాలసీ వర్తిస్తుందని తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులతో కలిసి చైర్మన్‌ మీడియాకు వివరించారు. కొండపై సహజ మరణం పొందిన భక్తుడి కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తామని చెప్పారు. ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఆలయాల పరిధిలో టీటీడీ ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. ప్రమాదాల్లో మరణించిన భక్తులకు రూ.3 లక్షలుగా ఉన్న బీమాను రూ.10 లక్షలకు పెంచామని, దీనికి రూ.17 లక్షల ప్రీమియం ఖర్చును టీటీడీ భరిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ నెల 15 నుంచి 23 వరకు సాలకట్ల, అక్టోబరు 12 నుంచి 20 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోందన్నారు. 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టువస్ర్తాలు సమర్పిస్తారని చెప్పారు. 16న రిలయన్స్‌ సంస్థ టీటీడీకి విరాళంగా అందజేసిన 25 విద్యుత్‌ బస్సులు, ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 10 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచుతామని అన్నారు. దేశవ్యాప్తంగా 25 రాష్ర్టాలతో పాటు సింగపూర్‌, జర్మనీ నుంచి కళాకారులు వాహన సేవల్లో ప్రదర్శనలిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం తిరుమలలోని జలాశయాల్లో 120 రోజుల అవసరాలకు సరిపడా నీళ్లున్నాయని చైర్మన్‌ తెలిపారు.


బోర్డు సమావేశంలో నిర్ణయాలు

  • తిరుమలలోని హోటళ్లు, అన్నప్రసాద భవనం నుంచి వచ్చే ఆహార వ్యర్థాలను విభజించి వాటర్‌ హైడ్రాలసిస్‌ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్‌ తయారు చేసి టీటీడీ అన్నప్రసాద కేంద్రానికి సరఫరా చేసేందుకు ఐవోసీఎల్‌ ముందుకు వచ్చింది. ఈ ప్లాంట్‌ నిర్వహణను రూ.2.80 కోట్లతో జీపీఎస్‌ రెన్యువబుల్స్‌ సంస్థకు అప్పగించేందుకు అంగీకారం .

  • శ్రీవారి పోటులో లడ్డూల తయారీని వేగవంతం చేసేందుకు మరో 400 మంది వర్కర్లను తీసుకునేందుకు ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు.

  • నారాయణవనంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పద్మావతి అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం ఏర్పాటుకు ఆమోదం.

  • రూ.17.05 కోట్లతో చెన్నైలోని అమ్మవారి ఆలయ ధ్వజస్తంభానికి, బలిపీఠానికి బంగారు తాపడం.

15న సీఎం సమక్షంలో ఎల్‌ఐసీతో ఎంవోయూ

శ్రీవారి భక్తులకు బీమా సౌకర్యం కల్పించే పథకం రూపకల్పనకు దాదాపు ఆరు నెలలకు పైగా టీటీడీ కసరత్తు చేసింది. అలిపిరి దాటినప్పటి నుంచి తిరిగి వెళ్లేవరకు దాదాపు మూడు రోజుల పాటు ఈ పాలసీ వర్తిస్తుంది. సహజ మరణాన్ని తిరుమలలోని అశ్విని ఆస్పతి నిర్ధారించిన తర్వాత బీమా సొమ్ము అందజేస్తారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు గ్రూప్‌ పాలసీ ద్వారా, మిగిలిన దర్శనాలకు వచ్చేవారికి నేరుగా బీమా సొమ్మును అందజేస్తారు. దీనికోసం టీటీడీ దాదాపు రూ.3 కోట్లను రివాల్వింగ్‌ ఫండ్‌ కింద ఎల్‌ఐసీలోని ప్రత్యేక ఖాతాలో జమ చేస్తుంది. 15న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీ, ఎల్‌ఐసీ మధ్య ఈ పాలసీకి సంబంధించిన ఎంవోయూ జరుగనుంది.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

శ్రీవారి వైభవం, తిరుమల విశిష్టతను కళ్లకు కట్టేలా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను టీటీడీ ఏర్పాటు చేయనుంది. కంపార్టుమెంట్‌ నం.17లో త్రీడీ, వీఆర్‌ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్‌ను 15న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీంతో పాటు గదుల్లో సమస్యలను తక్షణం పరిష్కరించేలా రూపొందించిన ‘నందకం’ యాప్‌ను కూడా సీఎం ఆవిష్కరించనున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

రెన్యువల్‌ అయ్యేలా చర్యలు చేపట్టండి

స్థానిక పోరుకు సన్నద్ధం..!

Updated Date - Sep 10 , 2026 | 06:49 AM