Share News

సేవా కేంద్రంగా తిరుపతి!

ABN , Publish Date - Sep 17 , 2026 | 02:49 AM

టీటీడీకి చెందిన విద్యా, వైద్య, ఆధ్యాత్మిక సంస్థల్లో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వస్తున్న వారితో... తిరుపతి సేవా కేంద్రంగా (సర్వీస్‌ హబ్‌) మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమల పద్మావతి అతిథి భవనంలో బుధవారం టీటీడీతో పాటు జిల్లా యంత్రాంగంతో ఆయన సమీక్ష నిర్వహించారు.

సేవా కేంద్రంగా తిరుపతి!

  • 12 లక్షలకు చేరిన శ్రీవారి సేవకులు

  • టీటీడీ ఆస్పత్రులన్నీ అనుసంధానం..

  • వెడ్డింగ్‌ డెస్టినేషన్‌ కేంద్రంగా తిరుపతి: సీఎం

వేంకటేశ్వర స్వామి పవిత్రతను ఆయన కాపాడుకుంటారు. భక్తులుగా ఆయన ఆదేశాలను పాటిస్తాం. అలాకాకుండా విర్రవీగిన వాళ్లందరూ ఏమైపోయారో ప్రజలు చూశారు. నేను, టీటీడీ చైర్మన్‌, బోర్డు సభ్యులు, ఈవో, ఎమ్మెల్యేలు అందరం ట్రస్ట్‌ నిర్వహణకే తప్ప పెత్తనం చేయడానికి కాదు. అందరం కూడా ఇగోలను పక్కనబెట్టి స్వామి వారికి దాసోహం అంటున్నాం. - సీఎం చంద్రబాబు

తిరుపతి(టీటీడీ)/తిరుమల, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): టీటీడీకి చెందిన విద్యా, వైద్య, ఆధ్యాత్మిక సంస్థల్లో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వస్తున్న వారితో... తిరుపతి సేవా కేంద్రంగా (సర్వీస్‌ హబ్‌) మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమల పద్మావతి అతిథి భవనంలో బుధవారం టీటీడీతో పాటు జిల్లా యంత్రాంగంతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుపతిలోని స్విమ్స్‌, బర్డ్‌, రుయా, చిల్డ్రన్స్‌ ఆస్పత్రి, కార్డియాలజీ ఆస్పత్రి అన్నీ అనుసంధానం చేసి ఒక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కిందకు తీసుకొస్తాం. టాటా క్యాన్సర్‌ ఆస్పత్రి, అరవింద్‌ ఐ ఆస్పత్రిని సైతం వీటి పరిధిలోకి తీసుకొస్తాం. శ్రీవారి వైద్య సేవ కోసం 800 మంది రిజిస్ర్టేషన్‌ చేసుకోగా 70 మంది వైద్యులు వచ్చి పనిచేస్తున్నారు. గోశాలకు సైతం వెటర్నరీ వైద్యులు శ్రీవారి సేవకులుగా ముందుకు వచ్చారు. తిరుపతి ఒక సర్వీస్‌ హబ్‌గా మార్పు చెందుతోంది. ఇప్పటికే 12లక్షల మంది శ్రీవారి సేవకులు రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు’’ అని తెలిపారు. వృక్ష గోవిందం కింద చెట్లు నాటే కార్యక్రమం చేపడతామన్నారు. తిరుమలలో ప్రస్తుతం 89.4 శాతం గ్రీన్‌ కవర్‌ ఉందని... రాబోయే రోజుల్లో ఔషధ మొక్కలు పెంచుతామని ప్రకటించారు.‘‘అన్నప్రసాదంలో మజ్జిగ బదులు పెరుగు ఇవ్వాలని సూచన వచ్చింది. దాన్ని అమలు చేస్తాం’’ అని తెలిపారు. ‘తిరుమల రాజకీయాలకు వేదిక కాకూడదు. ఇక్కడ వేంకటేశ్వర స్వామి స్మరణ తప్ప మరొకటి వినపడకూడదు’ అని స్పష్టం చేశారు. టీటీడీ పరిధిలో నెట్‌జీరో విధానం కోసం తిరుపతిలోని టీటీడీ ఆస్తులపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏడాదిన్నరలో 100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తిరుమలలో ఎక్కడా కొత్త నిర్మాణాలు చేపట్టబోమని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...


శ్రీవారి ఆస్తులు ఆన్‌లైన్‌లో

‘తిరుమలలో నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాం. వచ్చే ఏడాది సోమశిల జలాశయం ద్వారా మల్లెమడుగు, బాలాజీ జలాశయాలకు, ఈ ఏడాది హంద్రీ నీవా ద్వారా కల్యాణి డ్యాంకు నీటిని తరలించనున్నాం. తిరుమలలోని పురాతన వస్తువులు మాయమైనట్లు గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. అన్నీ డాక్యుమెంటు చేసి కంప్యూటరీకరించి ప్రజల ముందుంచుతున్నాం. ఆస్తులు, ఆభరణాల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నాం. తిరుపతిని వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎల్‌ఐసీ తరపున బీమా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆధార్‌ ఆధారిత పేపర్‌ లెస్‌ క్లెయిమ్స్‌ విధానాన్ని తీసుకొచ్చాం. తిరుమలలో ఎవరైనా చనిపోతే వెంటనే రూ.2లక్షలు అందిస్తారు. 1999లో నేను సీఎంగా ఉన్నప్పుడు మ్యూజియం నిర్మాణం చేపట్టాం. ఇప్పుడు దీన్ని మరింత ఆధునికీకరించాం. దీనికోసం టీసీఎస్‌ రూ.104 కోట్లు ఖర్చు చేసింది. దీని నిర్వహణ బాధ్యతలను సైతం వారికే అప్పగిస్తున్నాం. తిరులలో 32 ఈవీ బస్సులను ప్రారంభించాం. ఇందులో 25 రిలయెన్స్‌, భారత్‌ బయోటెక్‌ ఏడు బస్సులు ఇచ్చాయి. వీటిని ఏసీ బస్సులుగా మార్చనున్నాం. శ్రీవాణి నిధులతో పెద్దఎత్తున ఆలయాలు నిర్మిస్తున్నాం’’ అని తెలిపారు. కాగా, తిరుమలలో సీఎం పలు ప్రారంభోత్సవాలు, సమీక్షలతో బుధవారం దాదాపు ఐదున్నర గంటల పాటు బిజీగా గడిపారు. ఉదయం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ 17వ కంపార్టుమెంట్‌లో ఏర్పాటు చేసిన తిరుమల హీలింగ్‌ అండ్‌ డివోషన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించారు. పరిమిత సంఖ్యలో భక్తులు వీక్షించే సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన, అభిషేకం తదితర విశిష్ట సేవలను వీఆర్‌ సాంకేతికతతో వీక్షించగలిగే ‘దుర్లభ దర్శన్‌’ను ఇక్కడ ఏర్పాటు చేశారు. అత్యాధునిక వీఆర్‌ హెడ్‌సెట్‌ ద్వారా 13 నిమిషాల త్రీడీ, 360 డిగ్రీల వర్చువల్‌ రియాలిటీ చిత్రాన్ని భక్తులు వీక్షించవచ్చు.


ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించి, ప్రయాణించిన చంద్రబాబు

32 ఎలక్ట్రిక్ బస్సులను ‘శ్రీవారి ధర్మరథాలు’గా సీఎం ప్రారంభించారు. అనంతరం మంత్రులు, టీటీడీ బోర్డు చైర్మన్‌, సభ్యులు, ఉన్నతాధికారులతో కలసి నారాయణగిరి పార్కు నుంచి ఎస్వీ మ్యూజియం వరకు ఆయన ఎలక్ట్రిక్ బస్సులో చేరుకున్నారు. అక్కడినుంచి శ్రీవేంకటేశ్వర మ్యూజియానికి చేరుకున్న సీఎం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించిన మ్యూజియాన్ని ప్రారంభించారు. అలాగే శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి జీవిత బీమా రక్షణ కల్పించే గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. తిరుమలకు చేరుకునే భక్తులు బసచేసే కాటేజీల్లో సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేలా రూపొందించిన ‘నందకం’ డిఫెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ యాప్‌ను కూడా సీఎం ప్రారంభించారు.

ఈ వార్తలనూ చదవండి:

గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్

ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య

Updated Date - Sep 17 , 2026 | 02:49 AM