Share News

వెంకన్నకు భారీ కానుక

ABN , Publish Date - Nov 22 , 2026 | 06:47 AM

తిరుమల ఆలయ చరిత్రలోనే శ్రీవారికి అత్యంత భారీ మొత్తంలో విరాళం సమర్పించేందుకు ఒక భక్తుడు సిద్ధమయ్యారు. చెన్నైకు చెందిన ఒక భక్తుడు సుమారు రూ.200 కోట్లకుపైగా విలువైన ...

వెంకన్నకు భారీ కానుక

  • 140 కిలోల స్వర్ణాభరణాలు

  • 26న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అందించనున్న దాత

  • తిరుమల చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత విరాళం

  • విలువ సుమారు రూ.200 కోట్లపైనే

తిరుపతి(టీటీడీ), నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): తిరుమల ఆలయ చరిత్రలోనే శ్రీవారికి అత్యంత భారీ మొత్తంలో విరాళం సమర్పించేందుకు ఒక భక్తుడు సిద్ధమయ్యారు. చెన్నైకు చెందిన ఒక భక్తుడు సుమారు రూ.200 కోట్లకుపైగా విలువైన 140 నుంచి 150 కిలోల బంగారు ఆభరణాలను స్వామికి సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా వీటిని శ్రీవారికి సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వాస్తవానికి ఏడాది క్రితమే ఒక భక్తుడు శ్రీవారికి సుమారు 121 కిలోల బంగారాన్ని విరాళంగా అందించేందుకు సిద్ధమైనట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం బంగారం ఇచ్చినంత మాత్రాన వాటిని వివిధ అవసరాలకు టీటీడీ వినియోగించే ఆస్కారం ఉండదని ఆ భక్తుడు భావించారు.


ఈ నేపథ్యంలో స్వామి వారికి నిత్యం వివిధ కైంకర్యాలు, ఉత్సవాల సందర్భంగా వాటిని ఉపయోగించేందుకు వీలుగా ఆభరణాలను తయారు చేయించి విరాళంగా అందించాలని నిర్ణయించారు. అత్యంత నాణ్యమైన మేలిమి బంగారంతో 45 రకాల బంగారు ఆభరణాలను భక్తుడు కానుకగా సమర్పించనున్నట్టు తెలిసింది. వాస్తవానికి ముందుగా 121 కిలోల వరకు బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని అనుకున్నా ఆభరణాల తయారీ సమయంలో బంగారం వినియోగం పెరిగినట్టు సమాచారం. దీంతో ఆభరణాల తయారీకి సుమారు 140 కిలోలకుపైగా వినియోగించినట్టు తెలుస్తోంది. ఈ ఆభరణాలను చెన్నైలోని ఒక ప్రముఖ బంగారు దుకాణంలో తయారు చేయించారు. శ్రీవారికి రాజులు పెద్ద సంఖ్యలో వివిధ సందర్భాల్లో ఆభరణాలు, ఆలయానికి అవసరమైన పాత్రలు, భూములను విరాళంగా భక్తిభావంతో సమర్పించారు.

ఆ తర్వాత కొందరు దాతలు బంగారు, వెండి ఆభరణాలు, కిరీటాలు చేయించారు. మరోవైపు ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టును చేపట్టిన సమయంలో రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షల విలువైన సుమారు 1 కిలో బంగారాన్ని దాతలు అందజేశారు. నాడు 49 మంది దాతలు ముందుకు వచ్చి వీటిని అందించారు. అయితే వ్యక్తిగతంగా ఇంత భారీ స్థాయిలో ఎవరూ శ్రీవారికి విరాళంగా అందించలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 06:51 AM