Share News

శ్రీవారి ‘శాసనం!’

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:53 AM

ఏ రాజు ఎప్పుడు వచ్చారు? ఏయే కానుకలు ఇచ్చారు? ఆలయ సంప్రదాయం ఏమిటి? విశేష పర్వదినాల్లో ఏం చేయాలి?..... ఇలా ఎన్నెన్నో అంశాలు!

శ్రీవారి ‘శాసనం!’

  • తిరుమల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు

  • వందల ఏళ్ల నాటి అరుదైన శాసనాలు వెలుగులోకి

  • తిరుమల ఆలయ రాతి గోడలపై ఆనాటి వైభవం

  • ఉత్తర, దక్షిణ ప్రాకారాలపై మరో ఏడు సేకరణ

  • డిజిటలైజేషన్‌లో భాగంగా గుర్తించిన పురావస్తు శాఖ

  • ఇప్పటివరకూ ఆ శాఖ వద్ద మొత్తం 106 శాసనాలు

  • త్వరలోనే ‘భారత్‌-శ్రీ’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌

(తిరుమల - ఆంధ్రజ్యోతి): ఏ రాజు ఎప్పుడు వచ్చారు? ఏయే కానుకలు ఇచ్చారు? ఆలయ సంప్రదాయం ఏమిటి? విశేష పర్వదినాల్లో ఏం చేయాలి?..... ఇలా ఎన్నెన్నో అంశాలు! వాటిలో అనేకం ‘శాసనబద్ధం’గా శాశ్వతంగా నిలిచిపోయాయి. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారాలపై శతాబ్దాల క్రితం చెక్కిన పలు శాసనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆనాటి క్షేత్ర వైభవాన్ని, చరిత్రను కళ్లకు కడుతూ ఆలయంలోని రాతి గోడలపై నిక్షిప్తమైన వీటిని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎ్‌సఐ) అధికారులు ఆధునికసాంకేతికతను ఉపయోగించి కాపీ చేస్తున్నారు.

భావితరాలకు స్పష్టంగా అర్థయ్యేలా ఫొటోలతో సహా డిజిటలైజ్‌ చేస్తున్నారు. స్వామివారికి సంబంధించిన రాజకీయ, సామాజిక, మతపరమైన, ఆర్థిక, సాంస్కృతిక, విరాళాల వివరాలతో కూడిన ఏడు శాసనాలను ఏఎస్ఐ తాజాగా గుర్తించింది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లోని శాసనాలను భద్రపరచడమే లక్ష్యంగా ‘భారత్‌-శ్రీ’ కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తిరుమలలో శాసనాలను డిజిటలైజేషన్‌ చేసే పనులను ఏఎస్ఐ ప్రారంభించింది. ఇప్పటికే పలు దఫాల్లో 97 శాసనాలను సేకరించి భద్రపరిచింది. తాజాగా మరో ఏడింటిని దక్షిణ, ఉత్తర ప్రాకారాలపై కాపీ చేసింది. ప్రస్తుతం ఈ శాఖ వద్ద మొత్తం 106 శాసనాలు డిజిటలైజేషన్‌ ప్రక్రియలో ఉన్నాయి.


సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కృషితో....

శ్రీవారి ఆలయ పేష్కారుగా ఉంటూ ఎపిగ్రఫిస్ట్‌గా ఆలయ చరిత్ర, శాసనాల పరిశోధనలో సాధు సుబ్రహ్మణ్య శాస్ర్తి విశేష కృషి చేశారు. 1921 సెప్టెంబరులో చెన్నై వెళ్లిన ఆయన దాదాపు ఏడు నెలల పాటు పురావస్తు శాఖ వద్ద పరిశోధనలు నిర్వహించారు. 1922 మార్చిలో తిరిగి తిరుమలకు చేరుకొని శ్రీవారి ఆలయంలో శాసనాల సేకరణ ప్రక్రియను మొదలుపెట్టాను. 1927 మార్చి వరకు అంటే దాదాపు ఐదేళ్ల పాటు తిరుమలతో పాటు తిరుపతిలోని పలు ఆలయాల్లోని 1,060 శాసనాలను ఐ కాపీ ద్వారా సేకరించారు. ఇందులో శ్రీవారి ఆలయం, ప్రాకారాల్లో 648 శాసనాలు ఉన్నాయని, ఇరుకైన ప్రాంతాల్లో ఉన్న మరో దాదాపు 100 శాసనాల సేకరణ సాధ్యం కాలేదని 1935లో విడుదల చేసిన పుస్తకాల్లో ఆయన తెలిపారు.

శ్రీవారి ఆలయం ప్రాకారాలపై దాదాపు 750 శాసనాలు ఉండవచ్చని పేర్కొన్నారు. తాను సేకరించిన శాసనాల్లోన్ని సారాంశాన్ని పుస్తకాల్లో ప్రస్తావించారు. వాటి ద్వారానే తిరుమలకు సంబంధించిన అమూల్యమైన సమాచారం నేటి ప్రపంచాన్ని అందింది.

డిజిటలైజేషన్‌ ప్రక్రియకు టీటీడీ ఓకే

తిరుమల ఆలయం రెండో ప్రకారం నుంచి 1889, 1904, 1912, 1916 సంవత్సరాల్లో 44 శాసనాలు కాపీ చేశారు. ప్రస్తుత ఏఎ్‌సఐ ఎపిగ్రఫీ విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్న మునిరత్నం రెడ్డి 2008-09లో డిప్యూటీ ఈఈ హోదాలో తన బృందంతో కలిసి గర్భాలయంపై ఉన్న 104 శాసనాలను కాపీ చేయగలిగారు. అక్టోబరు 27, 28వ తేదీల్లో మరో రెండు శాసనాలను దక్షిణ, ఉత్తర ప్రాకారాలపై ఈ బృందం గుర్తించింది. సాధు సుబ్రహ్మణ్య శాస్ర్తి కూడా గుర్తించలేకపోయిన శాసనాలను తాము సేకరించామని, వివిధ భాషల్లో ఉన్న వాటిలోని సారాంశాన్ని నమోదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఆలయ ప్రాకారాలపై ఉన్న అన్ని శాసనాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ కోసం ఏఎ్‌సఐ చేసిన అభ్యర్థనకు టీటీడీ అంగీకారం తెలిపింది. దీంతో డిసెంబరు 1 నుంచి 11 వరకు ఆలయంలోని అన్ని ప్రాకారాలపై ఉన్న అన్ని శాసనాలను అచ్చు తీసి డిజిటలైజ్‌ చేయనున్నారు.


శాసనాల విశేషాలు...

495 ఏళ్ల క్రితం నాటి అచ్యుతదేవరాయులు తమిళ భాషలో వేయించిన శాసనంలో అనేక విశేషాలున్నాయి. శ్రీవారికి ప్రత్యేక పర్వదినాల్లో నైవేద్యాలు, అన్నప్రసాదాలు సమర్పించేందుకు 675 పణాలను ఆలయ భండారంలో జమ చేసినట్టు ఇందులో ఉంది. బ్రహ్మోత్సవాలు, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉరియడి ఉత్సవం, అధ్యయనోత్సవాల సమయంలో స్వామివారికి ఆహార నైవేద్యాలు సమర్పించేందుకు ఈ నిధులను వినియోగించాలని నిర్దేశించారు.

తిరువిడైయాట్టు అనే ఊర్లలో చెరువులు, సాగునీటి కాలువల నిర్వహణ బాధ్యతలను ఈ దాన శాసనంలో ప్రస్తావించారు. ఆయా గ్రామాల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ఆలయ భండారానికి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ శాసనాన్ని ఆలయ లెక్కల అధికారి తిరునిన్న ఊర్‌ ఉడైయాన్‌ రచించినట్టు నిర్ధారణ అయ్యింది.

1540 డిసెంబరు 31వ తేదీకి చెందిన మరో శాసనంలో అచ్యుతదేవరాయ తన సైన్యాధిపతి దళవాయి తిమ్మరసయ్యకు గ్రామ ఆదాయాన్ని మంజూరు చేశారు. చంద్రగిరి కోటలో సైనాధికారిగా పనిచేసిన తిమ్మరసయ్య, ప్రధాని సోమరసయ్య కుమారుడు. గోకుల గుంట సీమ పరిధిలోని సమాపురం-తిన్నై గ్రామ ఆదాయం నుంచి 150 రేఖై పొన్‌ (బంగారు నాణేలు) ఆయనకు కేటాయించినట్టు శాసనం రాశారు.

శ్రీకృష్ణదేవరాయలు మొత్తం ఏడుసార్లు తిరుమల క్షేత్రాన్ని సందర్శించగా... తొలిసారి జరిపిన యాత్రలోనే అనేక కానుకలు సమర్పించినట్లు రెండు శాసనాలు చెబుతున్నాయి. ఇవి తెలుగులోనే ఉండటం విశేషం. 1513 ఫిబ్రవరి 10న శ్రీకృష్ణదేవరాయల రాణులు చిన్నాజీ అమ్మ, తిరుమలమ్మతో కలిసి తిరుమలకు వచ్చారు. రాత్రి పూజ అనంతరం స్వామి వారికి పాలు సమర్పించేందుకు 374 తూకాల బరువున్న రెండు బంగారు గిన్నెలు, సుగంధ ద్రవ్యాలు ఉంచేందుకు 10 తూకాల బరువున్న బంగారు పళ్లాన్ని కానుకగా ఇచ్చినట్లు శాసనాల్లో లిఖించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలోని భోగ శ్రీనివాసమూర్తి (మానవాళ పెరుమాళ్‌) విగ్రహం ఏడో శతాబ్దం నాటిదేనని పురావస్తుశాఖ నిర్ధారించింది. ఆలయంలోని మొదటి ప్రాకారం ఉత్తర గోడపై రెండు అత్యంత ప్రాచీన తమిళ శాసనాల ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. పార్ధవేంద్ర వర్మన్‌కు సామంతుడైన శక్తివిటంకన్‌ భార్య, పల్లవ రాణి సామవై శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించాక.. తిరువిళంకోయిల్‌లో మానవాళ పెరుమాళ్‌ వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు శాసనాల్లో పేర్కొన్నారు.

ప్రధాన మూలవిరాట్టుకు ప్రతిరూపంగా భావించే ఈ విగ్రహానికి నిత్య నైవేద్యాలు, అభిషేకాలు, ఆభరణాల సమర్పణ, ప్రత్యేక ఉత్సవాల నిర్వహణ కోసం పన్ను మినహాయింపుతో కూడిన భూములు సైతం దానం చేశారు. వీటితోపాటు వివిధ సేవల నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు శాసనాల్లో ఉంది. దాదాపు 1,300 ఏళ్ల చరిత్ర కలిగిన భోగ శ్రీనివాసమూర్తి నేటికీ తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య పూజలు అందుకుంటున్నాడు!


ఇది స్వామివారి అనుగ్రహమే

‘‘తిరుపతి స్థానికుడైన నాకు శ్రీవారి ఆలయంలోని శాసనాలను డిజిటలైజేషన్‌ చేసే అవకాశం లభించింది. 1889 ఏప్రిల్‌ 25న జారీచేసిన పబ్లిక్‌ ఆర్డర్‌ ప్రకారం డాక్టర్‌ హుల్స్‌ అనే బ్రిటిష్‌ అధికారికి శాసనాల పరిశోధన కోసం శ్రీవారి ఆలయ అంతర్భాగంలోకి ప్రవేశించేందుకు అప్పటి మహంతు అనుమతి ఇవ్వలేదు. దానిపై అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వ కౌన్సిల్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే గర్భాలయ ప్రాకారాలపై శాసనాలను అచ్చు తీసే అవకాశం నాకు మాత్రమే లభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది స్వామి అనుగ్రహమే. వీలైనంత త్వరగా ఆలయ ప్రాకారాలపై ఉన్న అన్ని శాసనాలను అచ్చు తీసి డిజిటలైజ్‌ చేయడంతో పాటు వాటిని ‘భారత్‌-శ్రీ’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తాం.

- మునిరత్నం రెడ్డి, డైరెక్టర్‌, ఎస్ఐ ఎపిగ్రఫీ విభాగం

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 06:01 AM