Share News

శ్రీవారికి స్వర్ణాభిషేకం

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:34 AM

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి గురువారం భారీగా స్వర్ణాభరణాలు కానుకగా అందాయి. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధమాన్‌ జైన్‌, రాధిక జైన్‌ దంపతులు రూ.206 కోట్ల విలువైన 121 కేజీల బంగారు, వజ్రాభరణాలను శ్రీనివాసుడికి సమర్పించారు.

శ్రీవారికి స్వర్ణాభిషేకం

  • రూ.206 కోట్ల విలువైన 121 కేజీల ఆభరణాలు

  • కానుక అందజేసిన చెన్నై పారిశ్రామికవేత్త వర్ధమాన్‌ జైన్‌

  • ఒకే భక్తుడు ఇంత భారీ విరాళం ఇవ్వడం ఒక చరిత్ర

  • ఇటువంటి అపూర్వమైన సంఘటన ఎప్పుడూ జరగలేదు

  • ఈ మహత్తర ఘట్టంలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉంది

  • తరాలు మారినా శ్రీవారిపై భక్తి, విశ్వాసాలు కొనసాగుతున్నాయి

  • వేంకటేశ్వరుడి వైభవం మాటల్లో చెప్పేది కాదు: సీఎం చంద్రబాబు

  • నేడు మూలమూర్తికి నూతన ఆభరణాల అలంకరణ

తిరుమల, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి గురువారం భారీగా స్వర్ణాభరణాలు కానుకగా అందాయి. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధమాన్‌ జైన్‌, రాధిక జైన్‌ దంపతులు రూ.206 కోట్ల విలువైన 121 కేజీల బంగారు, వజ్రాభరణాలను శ్రీనివాసుడికి సమర్పించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆభరణాలను వేకువజామున ఆలయానికి తీసుకువచ్చి రంగనాయక మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమర్చారు.

అనంతరం దాత కుటుంబసభ్యులతో ఆలయానికి చేరుకున్నారు. వైకుంఠం క్యూంప్లెక్స్‌ క్యూలైన్‌ ద్వారా సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు కూడా వచ్చిన తర్వాత దాత ఆభరణాలను టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అర్చకులకు అందజేశారు. వాటిని తలపై పెట్టుకుని రంగనాయక మండపం నుంచి ఊరేగింపుగా గర్భాలయానికి తీసుకెళ్లి శ్రీవారిని దర్శించుకుని సమర్పించారు. శ్రీవారికి విరాళంగా అందిన 121 కేజీల బంగారు ఆభరణాలతో శుక్రవారం గర్భాలయంలోని మూలవిరాట్టును అలంకరించనున్నారు.


వేకువజామున అభిషేకం పూర్తికాగానే బొక్కసం విభాగ సిబ్బంది నూతన ఆభరణాలను అర్చకులకు అందజేస్తారు. వారు అభిషేకం అనంతరం స్వామికి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఆభరణాల సమర్పణ అనంతరం పద్మావతి అతిథిగృహంలో దాతతో కలిసి సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

‘డబ్బు, సంపద, హోదా శాశ్వతం కాదు. ఆధ్యాత్మికత, ధర్మం, సేవ మాత్రమే మనిషికి సంతోషాన్ని ఇస్తాయి. జైన్‌ దంపతులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి వారిని ప్రోత్సహించాలి’ అని కొనియాడారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే.. ‘శ్రీవారి వైభవం మాటల్లో చెప్పేది కాదు. తిరుమల అంటే భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత. ఎక్కడా దొరకని దివ్యానుభూతి తిరుమలలోనే లభిస్తుంది. అటువంటి పవిత్రమైన క్షేత్రంలో పవిత్రమైన ఘట్టం చోటుచేసుకుంది. శ్రీవారు ప్రతిరోజూ 121 కేజీల ఆభరణాలు ధరిస్తారనే కారణంతో వర్ధమాన్‌ జైన్‌ 121 కేజీల బంగారంతో ఆభరణాలను తయారు చేయించి, కానుకగా ఇచ్చారు. ఈ మహత్తర ఘట్టంలో భాగస్వామిని కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆభరణాల్లో కిరీటం, పాద కవచాలు, తులసిపత్ర హారం, కౌస్తుభం, శ్రీవత్సవం, నాగాభరణాలు, భుజకీర్తులు, శంఖం, చక్రం వంటివి వజ్రాలు, మణులు, పచ్చలు, కెంపులతో అద్భుతంగా తయారు చేయించారు. 106 కేజీల బంగారంతో శ్రీవారికి ఆభరణాలు, మరో 15 కేజీల బంగారంతో అమ్మవారికి స్వర్ణ వస్త్రం చేయించారు. వీటిలో 238 క్యారెట్ల వజ్రాలతో పాటు విలువైన రత్నాలు ఉన్నాయి. బంగారు విలువ, తయారీ ఖర్చులు కలిపి రూ.206 కోట్లు. ఒకే భక్తుడు ఇంత విరాళం ఇవ్వడం ఒక చరిత్ర. ఇటువంటి అపూర్వమైన సంఘటన ఎప్పుడూ జరగలేదు. విలువ పరంగా రూ.కోట్లల్లో ఉన్నప్పటికీ వాటి వెనుక ఉన్న భక్తివిశ్వాసాలను వెలకట్టలేం. శ్రీకృష్ణదేవరాయల నుంచి జైన్‌ దంపతుల వరకు తరాలు మారినా శ్రీవారిపై భక్తి, విశ్వాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ఎక్కడా ఇంత పవిత్రంగా, పరిశుభ్రంగా ఉన్న ఆలయం లేదు. తిరుమల ఆలయాన్ని ఆదర్శవంతంగా, పవిత్రతకు మారుపేరుగా తీర్చిదిద్దాలి. తిరుమల శ్రీవారి విషయంలో నేనెప్పుడూ తప్పు చేయలేదు. భవిష్యత్తులో కూడా చేయను. తప్పు చేసేవారిని వదిలిపెట్టను. శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధి చెందుతాయి. భారతీయ సంస్కృతి చాలా గొప్పది. దీన్ని లాజికల్‌గా ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే 2047కి భారతదేశం నంబర్‌ వన్‌గా మారుతుంది. అందులోనూ శ్రీవారు ఉండే ఆంధ్రప్రదేశ్‌ మందుండి నడిపిస్తుందని నమ్ముతున్నా.’


శ్రీవారికి విరాళంగా అందిన ఆభరణాలివీ...

రెండు పాద కవచాలు, రెండు అందెలు, పాగడా, తులసిపత్ర హారం, అష్టోత్తర శతకాసుల మాల, చతుర్భుజ లక్ష్మీ హారం, పులిగోరు, అశ్వత్థపత్ర హారం, సాదా వడ్డాణం, గంటల మొలతాడు, సూర్యకఠారి, కౌస్తుభం, శ్రీవత్సం, మొలచేయి, కఠి హస్తం పైరేకు, నాగాభరణ వడ్డాణం, గొలుసు, ఐదు అభయ చేతుల కంకణాలు, చంద్రవంక కఠి, వైకుంఠ హస్తం, కఠి హస్తం, రెండు నాగాభరణ కడియాలు, రెండు నాగాభరణాలు, రెండు భుజకీర్తులు, రెండు కర్ణపత్రాలు, రెండు బావులీలు, రెండు సాలిగ్రామ హారాలు, రెండు సాలిగ్రామ హారాలు, యజ్ఞోపవీతం, శంఖ కవచం, చక్ర కవచం, ముక్కుపుడి, కిరీటం

పదేళ్ల క్రితం మొక్కుకున్నా: వర్ధమాన్‌ జైన్‌

శ్రీవారికి 121 కేజీల బంగారు సమర్పిస్తానని సుమారు పదేళ్ల క్రితం ఎందుకు మొక్కుకున్నానో నాకూ తెలియదు. అనుకోకుండా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పిన దాని ప్రకారం స్వామివారు రోజూ ధరించే బంగారం పరిమాణం కూడా ఇదే సంఖ్య. గతేడాది మా కంపెనీని న్యూయార్క్‌లోని ఒక ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థకు విక్రయించాం. అందులో వచ్చిన డబ్బు నుంచి 121 కేజీల బంగారాన్ని సమర్పించాలని వెంకయ్య చౌదరిని కలిశా. ఆయన నన్ను సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. స్వామివారికి ఆభరణాలు చేయించాలని చంద్రబాబు సూచించారు.

సీఎం మాకు కేటాయించింది కేవలం 5 నిమిషాలే అయినా ఆ సమావేశం తెలియకుండానే దాదాపు గంట నడిచింది. 121 అనే సంఖ్యను ఎలా నిర్ణయించానో తెలుసుకోవడానికి చంద్రబాబు చాలా ఆసక్తి చూపారు. నిజంగా ఒక డివైన్‌ నంబరు అది. ఇచ్చిన మాట ప్రకారం 120.6 కేజీల బరువున్న ఆభరణాలను సమర్పించాం. ఇందులో 106 కేజీల బంగారు శ్రీవారికి, మరో 15 కేజీల బంగారంతో పద్మావతి అమ్మవారికి ఒక చీరను తయారు చేయించాలని ఈవో రవిచంద్ర సూచించి, ఒప్పించారు. తిరుచానూరులో అమ్మవారు ధరించే చీర 30 ఏళ్ల పాతది. అందుకే 15 కేజీల బంగారంతో కొత్త చీరను తయారు చేయించాలని నిర్ణయించాం. ఈ చీరను రాబోయే మూడు నెలల్లో సమర్పిస్తాం.

ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ అధికార యంత్రాంగానికి, సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు. గతేడాది ఆగస్టులో నేను చంద్రబాబును కలిసినప్పటి నుంచీ ప్రతివారం సీఎంవో సిబ్బంది ఈ కార్యక్రమం గురించి వివరాలు తెలుసుకుంటూ వస్తున్నారు.


ఆభరణాల బరువు.. విలువ

  • మొత్తం బంగారం: 121 కేజీలు (24 క్యారెట్లు)

  • మొత్తం ఆభరణాలు: 33 రకాలు, 46 ఆభరణాలు

  • ఆభరణాల తయారీ ఖర్చుతో కలిపి మొత్తం విలువ: రూ.206 కోట్లు

  • శ్రీవారి ఆభరణాలకు వినియోగించిన బంగారం: 106 కేజీలు

  • 15 కేజీల బంగారంతో తిరుచానూరు అమ్మవారికి స్వర్ణ వస్త్రం

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 03:47 AM