అలంకరణకు 72 టన్నుల పుష్పాలు
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:47 AM
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో దాదాపు 72 టన్నుల పుష్పాలను అలంకరణ కోసం వినియోగించనున్నారు. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు తొమ్మిదిరోజుల పాటు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
తిరుమల, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో దాదాపు 72 టన్నుల పుష్పాలను అలంకరణ కోసం వినియోగించనున్నారు. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు తొమ్మిదిరోజుల పాటు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈక్రమంలో ఎప్పటిలానే తిరుమలను మరింత సౌందర్యంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ గార్డెన్ విభాగం సిద్ధమైంది. ఇందులో ప్రధానంగా తొమ్మిదిరోజుల పాటు మాడవీధుల్లో విహరించే ఉత్సవమూర్తుల అలంకరణ కోసం దాదాపు 3 టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. అలాగే శ్రీవారి ఆలయం, వెలుపల అలంకరణల కోసం దాదాపు 60 టన్నుల సంప్రదాయ పుష్పాలు వాడతారు. ఇక, గర్భాలయంలోని మూలవిరాట్టు అలంకరణ కోసం దాదాపు 4.7 టన్నుల పుష్పాలను వినియోగిస్తారు. మరోవైపు ఈసారి బ్రహ్మోత్సవాల్లో రెండ్రోజులపాటు ఆలయంలోని రంగనాయక మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఈక్రమంలో మండపం అలంకరణ కోసం మరో 4 టన్నుల పుష్పాలు వాడనున్నారు. ఇలా మొత్తం దాదాపు 72 టన్నుల పుష్పాలు స్వామి వారి బ్రహ్మోత్సవంలో పాలుపంచుకుంటాయి. ఇక, శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం, మహద్వారం, రంగనాయక మండపంలో 4 లక్షల కట్‌ఫ్లవర్స్‌ను అలంకరిస్తారు. పాపవినాశనం మార్గంలోని పుష్పప్రదర్శనశాలతోపాటు తిరుమలలోని ముఖ్య ప్రాంతాల్లో దాదాపు 1.30 లక్షల రంగురంగు పుష్ప మొక్కలను ఏర్పాటు చేయనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన వైభవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఈ పుష్పాలంకరణలు ప్రత్యేక అనుభూతిని ఇవ్వనున్నాయి. కాగా, ఈఏడాది పుష్పప్రదర్శన శాలలో ‘శిశుపాలుని వధ’ సెట్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి...
స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..