Share News

కన్నులపండువగా భాగ్‌ సవారి ఉత్సవం

ABN , Publish Date - Sep 25 , 2026 | 04:59 AM

తిరుమలలో గురువారం భాగ్‌ సవారి ఉత్సవం కన్నులపండువగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటిరోజు ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ కథనం ప్రకారం శ్రీవారి భక్తాగ్రేసరుడైన అనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు వెళతారు.

కన్నులపండువగా భాగ్‌ సవారి ఉత్సవం

  • అనంతాళ్వారు తోటలో శ్రీవారికి ప్రత్యేక పూజలు

తిరుమల, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారం భాగ్‌ సవారి ఉత్సవం కన్నులపండువగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటిరోజు ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ కథనం ప్రకారం శ్రీవారి భక్తాగ్రేసరుడైన అనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు వెళతారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారు తన భక్తిని పరీక్షించడానికి వచ్చింది స్వామివారేనని గ్రహించి పశ్చాత్తాపపడతాడు. వెంటనే అమ్మవారిని విముక్తిరాలిని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వామివారి చెంతకు చేరవేస్తాడు. ఆయన భక్తికి మెచ్చి స్వామివారు బ్రహ్మోత్సవాల మరుసటి రోజు తాను అనంతాళ్వారుల తోటలోకి అప్రదక్షణంగా విచ్చేస్తానని అభయమిస్తారు.

ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ ‘భాగ్‌ సవారి’ ఉత్సవం అద్యంతం ఆసక్తికరంగా సాగింది. శ్రీవారు గురువారం సాయంత్రం 4 గంటలకు వైభవోత్సవ మండపం నుంచి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్నారు. తిరిగి ఆలయంలోకి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ముగిసింది. అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌ సవారి ఉత్సవం సందర్భంగా నాలాయరా దివ్య ప్రబంధం నిర్వహించారు.

ఈ వార్తలనూ చదవండి...

మహిళల భద్రతకు ప్రాధాన్యం

మార్కాపురం జడ్పీపై నేతల కన్ను

Updated Date - Sep 25 , 2026 | 04:59 AM