Share News

తాళ్లతో కట్టేసి.. రోడ్డుపై ఊరేగించి..

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:25 AM

సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ను ట్రయల్‌ రన్‌ కోసం తీసుకెళ్లి యాక్సిడెంట్‌ చేసిన యువకుడిని ఓ మెకానిక్‌ దారుణంగా హింసించాడు. రాత్రంతా నిర్బంధించి చిత్రహింసలు పెట్టడమే కాకుండా మరుసటి రోజు ఉదయం తాళ్లతో చేతులు కట్టేసి, మెడలో తాడు వేసి లాగుతూ వీధుల్లో తిప్పి తీవ్రంగా అవమానించాడు.

తాళ్లతో కట్టేసి.. రోడ్డుపై ఊరేగించి..

  • ట్రయల్‌కు తీసుకెళ్లిన బైక్‌ను యాక్సిడెంట్‌ చేశాడని యువకుడిపై మెకానిక్‌, అతని స్నేహితుల దారుణం

  • రాత్రంతా షెడ్‌లో బంధించి చిత్రహింసలు

  • విజయనగరం జిల్లాలో ఐదుగురి అరెస్టు

  • హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు

భోగాపురం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ను ట్రయల్‌ రన్‌ కోసం తీసుకెళ్లి యాక్సిడెంట్‌ చేసిన యువకుడిని ఓ మెకానిక్‌ దారుణంగా హింసించాడు. రాత్రంతా నిర్బంధించి చిత్రహింసలు పెట్టడమే కాకుండా మరుసటి రోజు ఉదయం తాళ్లతో చేతులు కట్టేసి, మెడలో తాడు వేసి లాగుతూ వీధుల్లో తిప్పి తీవ్రంగా అవమానించాడు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి వారిపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ వెల్లడించారు. రామచంద్రపేటకు చెందిన ఎల్లా రాజేశ్‌ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ కొనాలనుకున్నాడు. దీనికోసం గత నెల 11న భోగాపురంలోని బైక్‌ మెకానిక్‌ వెన్ను మహేశ్‌ను సంప్రదించాడు. మహేశ్‌ చూపించిన బైక్‌ నచ్చడంతో ట్రయల్‌ రన్‌ కోసం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అదే రోజు ఓ కారును ఢీకొట్టాడు. దీంతో భయాందోళనకు గురైన రాజేశ్‌ బైక్‌ అక్కడే వదిలేసి పారిపోయాడు.


ఈ విషయం తెలుసుకున్న మహేశ్‌ తన బైక్‌ను షెడ్‌కు తీసుకువెళ్లిపోయాడు. అప్పటి నుంచి రాజేశ్‌ కోసం వెతుకుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భోగాపురం మండలం సుందరపేట వద్ద రాజేశ్‌ను చూసిన మరో మెకానిక్‌ లంకా శ్రీరామ్‌... ఈ విషయం మహేశ్‌కు చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి రాజేశ్‌ను పట్టుకుని మెకానిక్‌ షెడ్‌కు తీసుకెళ్లారు. బైక్‌, మరమ్మతుల ఖర్చుల కింద రూ.30 వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాజేశ్‌ తన వద్ద ప్రస్తుతం డబ్బుల్లేవని చెప్పడంతో రాత్రంతా షెడ్‌లో నిర్బంధించి, చిత్రహింసలు పెట్టారు. ఆదివారం ఉదయం వరకు డబ్బులు చెల్లించకపోవడంతో... మహేశ్‌, శ్రీరామ్‌ మరో ముగ్గురు స్నేహితులు బొమ్మిడి వెంకటరావు, నమ్మి గోవింద్‌, వెన్ను అప్పారావు సహకారంతో రాజేశ్‌ చేతులు, మెడను తాళ్లతో కట్టారు. ఆ తర్వాత అతన్ని చొక్కా లేకుండా నడిరోడ్డుపై ఊరేగిస్తూ హల్‌చల్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై రాజేశ్‌ తల్లి రాధ, అమ్మమ్మ చిన్నమ్మడు మీడియాతో మాట్లాడుతూ... ఏదైనా సమస్య ఉంటే తమ వద్దకి తీసుకురావాలి తప్ప.. తమ బిడ్డను ఇలా హింసించడం దారుణమని వాపోయారు. పోలీసులు తగిన న్యాయం చేయాలని కోరారు. ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ బాధితుడు రాజేశ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

విరగ్గాసిన స్టార్‌ ఫ్రూట్స్‌

వెంకటేశ్వరకాలనీలో కార్డన్‌సెర్చ్‌

Updated Date - Sep 07 , 2026 | 04:25 AM