తిరుపతిలో ఒకే రాత్రి మూడు ఆలయాల్లో చోరీకి పాల్పడిన దొంగలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:19 PM
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రామచంద్రాపురం మండలంలో ఆలయాలే లక్ష్యంగా శనివారం అర్ధరాత్రి దాటాక ఏకంగా మూడు గుళ్లలో వరుస చోరీలకు పాల్పడి స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేశారు.
తిరుపతి, జూన్14: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలంలో ఒకే రాత్రి మూడు ఆలయాల్లో వరుస చోరీలు జరగడం తీవ్ర కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనలో చల్లావారిపల్లిలో వెలసిన ముత్యాలమ్మ గుడితో పాటు తాటితోపు కండ్రిగలోని రాములోరి ఆలయం, అంకాళమ్మ ఆలయాలను దొంగలు టార్గెట్ చేశారు. చల్లావారిపల్లి ముత్యాలమ్మ గుడిలో భక్తులు సమర్పించిన 8 గ్రాముల బంగారు కాసులు, రూ.20 వేల నగదును అపహరించారు. అలాగే తాటితోపు కండ్రిగలోని రాములవారి, అంకాలమ్మ ఆలయాల తలుపులు బద్దలుగొట్టి లోపలికి చొరబడిన దుండగులు.. అక్కడి హుండీలను పగులగొట్టి సుమారు రూ.4 వేల నగదును దోచుకెళ్లినట్టు స్థానికులు తెలిపారు.
ఆదివారం ఉదయం పూజల కోసం ఆలయాల వద్దకు చేరుకున్న గ్రామస్థులు.. గుడి తలుపులు తెరిచి ఉండటంతో పాటు హుండీలు చిందరవందరగా పడిఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రామచంద్రాపురం పోలీసులు.. ఘటనా స్థలాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆలయ పరిసరాల్లోని వేలిముద్రలను సేకరించింది. కాగా ఒక ఆలయంలో దొంగలు హుండీని పగులగొడుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు సదరు ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒకే రాత్రి మూడు ఆలయాల్లో దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆలయాల్లో రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మునగాకు రైస్.. ఇలా చేస్తే ఆ టేస్టే వేరు..
యూఎస్‌తో డీల్‌పై గుస్సా.. ఇరాన్‌లో మిన్నంటిన నిరసనలు