యూఎస్‌తో డీల్‌పై గుస్సా.. ఇరాన్‌లో మిన్నంటిన నిరసనలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:28 PM
యూఎస్‌తో డీల్ కుదరనుందన్న వార్తలు ఇరాన్‌లో నిరసనలను రగిలించాయి. దేశ ప్రయోజనాల విషయంలో విదేశాంగ శాఖ మంత్రి అరాగ్చీ రాజీ పడ్డారంటూ ప్రజలు పలునగరాల్లో నిరసనలకు తెరతీశారు.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్‌తో డీల్ విషయంలో ఇరాన్‌లోని అతివాదులు నిరసన బాట పట్టారు. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అరాగ్చీ, పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ ఘాలిబఫ్‌కు వ్యతిరేకంగా నిరసనలకు తెరతీశారు. నేడు ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పాక్ కూడా ప్రకటించడంతో ఇరాన్‌లో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇరాన్ అధికార వర్గాలు మాత్రం ఈ విషయంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. అయినప్పటికీ, తమ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా విదేశాంగ శాఖ మంత్రి, స్పీకర్ యూఎస్‌తో ఒప్పందానికి సిద్ధమవుతున్నారంటూ కొందరు ఇరానీయన్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, మషాద్ నగరంలోని విదేశాంగ శాఖ కార్యాలయం ముందు అనేక మంది అతివాదులు పెద్ద ఎత్తున నిరసనకు తెరతీశారు. యూఎస్‌తో ఒప్పందం గురించి మంత్రి అరాగ్చీ ప్రస్తావించిన అనంతరం దేశంలో ఆగ్రహావేశాలు ఊపందుకున్నాయి. అనేక మంది అరాగ్చీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దేశానికి తలవంపులు తెచ్చే పని చేశారని, మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. రాజధాని టెహ్రాన్‌తో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తినట్టు తెలుస్తోంది.
యూఎస్‌తో కుదుర్చుకోనున్న ప్రతిపాదిత డీల్‌లో ఇరాన్ ప్రయోజనాలకు రక్షణలు లేవని ఇరాన్‌లోని అతివాద వర్గం ఆరోపిస్తోంది. ఈ డీల్ కుదిరితే హోర్ముజ్‌పై ఇరాన్ పట్టుసడలిపోతుందని వారు చెబుతున్నారు. అంతిమంగా ఇరాన్ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీల్ కోసం అమెరికా చెప్పినట్టల్లా తలూపుతున్నారని ఇరాన్ పాలకవర్గాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ డీల్ కుదిరాక అమెరికా విధించిన నిర్బంధం తొలగిపోతుందని అరాగ్చీ ఇటీవల చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
లండన్‌లో ఘాతుకం.. భారతీయుడి దారుణ హత్య..