నేడే ఇరాన్‌తో డీల్..
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:56 AM
ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై నేడు (ఆదివారం) సంతకాలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ వెంటనే నౌకా రవాణా కోసం హోర్ముజ్ జలసంధి...
ఆ వెంటనే హోర్ముజ్ తెరుచుకుంటుంది
ఇరాన్‌తో కొత్త సంబంధాల కోసం ఎదురుచూస్తున్నా
ఒక్క డాలర్ ఖర్చు పెట్టకుండా ఒప్పందాన్ని ఖరారు చేశా
అంతా సద్దుమణిగిన తర్వాత ఇరాన్ యురేనియంను తెచ్చుకుంటాం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఆన్‌లైన్‌లోనే ఈ - సంతకాలు: పాక్ ప్రధాని వెల్లడి
ట్రంప్ ప్రకటనపై వెంటనే స్పందించని ఇరాన్
హోర్ముజ్‌లో ప్రయాణం ఇకపై ఉచితం కాదని స్పష్టీకరణ
వాషింగ్టన్/ టెహ్రాన్, జూన్ 13: ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై నేడు (ఆదివారం) సంతకాలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ వెంటనే నౌకా రవాణా కోసం హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ఈ అంశంపై శనివారం ఆయన ట్రూత్ సోషల్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘ఒప్పందంపై రేపు సంతకాలు జరుగుతాయి. ఆ వెంటనే హోర్ముజ్ తెరుచుకుంటుంది. ఇకపై ఇరాన్‌తో మా సంబంధాలు గతంకంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇరాన్‌తోపాటు పశ్చిమాసియా దేశాలతో సుదీర్ఘకాలం సుహృద్భావ సంబంధాలు కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నా. ఈ మార్పులన్నీ వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతాయని విశ్వసిస్తున్నా. ఒబామా హయాంలో ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకోవటానికి వందల బిలియన్ల డాలర్లు చేతులు మారాయి. కానీ, నేను ఒక్క డాలర్ కూడా ఖర్చు పెట్టకుండా ఇరాన్‌ను ఒప్పందానికి ఒప్పించా. భవిష్యత్తులో అంతా సద్దుమణిగిన తర్వాత ఒకరోజు మేము వెళ్లి ఇరాన్‌లోని కొండల కింద శిథిలాల్లో కూరుకుపోయిన యురేనియంను తెచ్చుకుంటాం. ఇక ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సమకూర్చుకోలేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇంకా సమయం ఉంది: ఇరాన్
ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే స్పందించలేదు. అయితే, షరీఫ్ ప్రకటనపై మాత్రం భిన్నంగా స్పందించింది. ఒప్పందంపై చర్చలు కొలిక్కి వచ్చాయని.. కానీ, సంతకాలు చేయటానికి మరికొంత సమయం పడుతుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘే తెలిపారు.మరోవైపు హోర్ముజ్ జలసంధిలో నౌకాయానం ఇకపై ఉచితం కాదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేస్తామని శనివారం తెలిపారు. అమెరికాతో చేసుకోబోయే ఒప్పందంలో ఈ మేరకు షరతు ఉంటుందని చెప్పారు. హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ జలాలంటూ ఏమీ లేవని స్పష్టంచేశారు. టోల్ వసూలులో వాణిజ్య, యుద్ధ నౌకలకు వేర్వేరు నిబంధనలు ఉంటాయని చెప్పారు. టోల్ వసూలుపై ఒమన్‌తో ఒప్పందం చేసుకుంటామని వెల్లడించారు.
ముఖాముఖి భేటీ లేనట్లే..
శాంతి ఒప్పందంపై యూర్‌పలో సంతకాలు జరుగుతాయని రెండు రోజుల క్రితం ప్రకటించిన ట్రంప్.. తాజా ప్రకటనలో వేదిక గురించి ఏమీ చెప్పలేదు. సంతకాలు జరుగుతాయని మాత్రమే చెప్పారు. అయితే, ట్రంప్ ప్రకటనకు ముందు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశంపై చేసిన ప్రకటనలో ’ఈ- సంతకాలు’ అనే మాటను వాడారు. ఇరు దేశాల నేతలు ముఖాముఖి సమావేశం కాకుండానే ఆన్‌లైన్‌లో ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. 24 గంటల్లో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని షరీఫే మొదట ప్రకటించారు.