Share News

అట్రాసిటి కేసుల విచారణ వేగవంతం చేయాలి

ABN , Publish Date - Sep 06 , 2026 | 06:45 AM

‘రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేయాలి. నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా వ్యవస్థ పని చేయాలని స్పష్టం చేశారు.

అట్రాసిటి కేసుల విచారణ వేగవంతం చేయాలి

  • వివిధ జిల్లాల్లో కేసులు పెరగడం అధ్యయనం చేయాలి

  • రాష్ట్ర స్థాయి హైపవర్‌ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేయాలి. నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా వ్యవస్థ పని చేయాలని స్పష్టం చేశారు. శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్ర స్థాయి హైపవర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల రక్షణ, సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్యారోగ్యం... తదితర అంశాలపై సీఎం కీలక సూచనలు చేశారు. ‘గుంటూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల కేసులు ఎక్కువగా నమోదైన అంశంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. కేసుల సంఖ్యతో పాటు వాటి స్వభావం, కారణాలు, పరిష్కారానికి పడుతున్న సమయం వంటి అంశాలను పరిశీలించాలి. బాధితులకు అందుతున్న పరిహారం సద్వినియోగం అయ్యేలా చర్యలు చేపట్టాలి. పరిహారంతో పాటు హౌసింగ్‌ వంటి ఇతర ప్రయోజనాలను కూడా బాధితులకు త్వరితగతిన అందించాలి’ అని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి సమావేశాల నిర్వహణలో అలసత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం... జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.


‘ఎస్సీ, ఎస్టీల్లో ఆర్థిక సాధికారత కల్పించడంతో పాటు ఆత్మవిశ్వాసం పెంచేలా అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలి. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో ఇంక్లూజివ్‌ గ్రోత్‌ సాధించేలా కృషి చేయాలి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని విద్యార్థుల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు చదువుతున్న హాస్టళ్లను రెసిడెన్షియల్‌ స్కూళ్లుగా మార్చడం వల్ల మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుని, ప్రగతి సాధించకూడదన్న ఉద్దేశంతో కొన్ని పార్టీలు మంచి విషయాలనూ వివాదం చేస్తున్నాయి’ అని సీఎం వ్యాఖ్యానించారు. గత పాలనలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని తెలిపారు. ఏజెన్సీలో అవకాశాలు లేక కాదు... అవగాహన లేకే వెనుకబాటుతనమని పేర్కొన్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

రెండుగా జడ్పీ

సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగేనా...?

Updated Date - Sep 06 , 2026 | 06:45 AM