ఆ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తెలంగాణ హౌసింగ్ బోర్డు చెల్లించాలి
ABN , Publish Date - Aug 30 , 2026 | 07:02 AM
విభజన నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల హౌసింగ్ బోర్డుల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి వివాదాలు పరిష్కారం కాలేదనే కారణంగా ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు నిలిపివేయడం సమర్థనీయం కాదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.
విభజన వివాదాలు పరిష్కారం కాలేదనడం సమర్థనీయం కాదు
ఉమ్మడి బోర్డు ఆస్తుల్లో 96 శాతం టీఎస్హెచ్‌బీ ఆధీనంలోనే
పదవీ విరమణ ప్రయోజనాలు ఉద్యోగుల హక్కు
పిటిషనర్ల జీపీఎఫ్ బకాయిలు వడ్డీతో సహా 8 వారాల్లో చెల్లించండి
టీఎ్‌సహెచ్‌బీకి ఏపీ హైకోర్టు ఆదేశం
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): విభజన నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల హౌసింగ్ బోర్డుల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి వివాదాలు పరిష్కారం కాలేదనే కారణంగా ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు నిలిపివేయడం సమర్థనీయం కాదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత 96 శాతం ఆస్తులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు ఉద్యోగులకు చెల్లించాల్సిన దాదాపు రూ. 8.77 కోట్ల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ నిధులు తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయని గుర్తుచేసింది. పిటిషనర్లకు చెల్లించాల్సిన విభజనకు పూర్వపు జీపీఎఫ్ బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డు (టీఎస్‌హెబీ)పై ఉందని స్పష్టం చేసింది. పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జాప్యం జరిగితే వడ్డీతో సహా పొందే హక్కు ఉద్యోగికి ఉంటుందని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పిందని తెలిపింది. ప్రభుత్వ జీవోలు, జీపీఎఫ్ నిబంధనలను అనుసరించి బకాయిలను వడ్డీతో సహా 8 వారాల్లో చెల్లించాలని టీఎస్‌హెబీను ఆదేశించింది. నిర్ణీత గడువులోగా జీపీఎఫ్ బకాయిలను విడుదల చేయకుంటే ఉద్యోగులు పదవీ విరమణ చేసిన నాటి నుంచి సొమ్ము చెల్లించే వరకు 12 శాతం వార్షిక వడ్డీని అదనంగా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కోర్టు ఆదేశాల మేరకు చేసే ప్రస్తుత చెల్లింపులను రెండు రాష్ట్రాల హౌసింగ్ బోర్టుల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ సమయంలో సర్దుబాటు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య హౌసింగ్ బోర్డు ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు ఇచ్చారు. ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో ఇచ్చేవి కావని, సుధీర్ఘకాలం పాటు సేవలందించి ఉద్యోగులు సంపాదించుకున్న విలువైన హక్కు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నాటి ఉమ్మడి హౌసింగ్ బోర్డు ఏపీహెచ్‌బీ, టీఎస్‌హెబీగా విడిపోయింది. ఉమ్మడి బోర్డులో 30 ఏళ్లకుపైగా సేవలు అందించి, రాష్ట్ర విభజన అనంతరం ఏపీహెచ్‌బీలో పనిచేసిన పలువురు ఉద్యోగులు 2018 మే 31- 2020 మార్చి 31 మధ్య పదవీ విరమణ చేశారు. ఏపీహెచ్‌బీ పరిధిలో పనిచేసిన కాలానికి వారు జీపీఎఫ్ బకాయిలను పూర్తిగా అందుకున్నారు. విభజనకు పూర్వం ఉద్యోగుల నుంచి సేకరించిన జీపీఎఫ్ నిధులన్నీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో హైదరాబాద్‌లోని బ్యాంక్ ఖాతాల్లోనే ఉండిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో జీపీఎఫ్, రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించకపోవడంతో 2021, 2022లో ఉద్యోగులు హైకోర్టులో వేర్వేరుగా రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ఇటీవల తుది విచారణ జరిపింది. కేసు విచారణలో సహాయకారిగా(అమికస్ క్యూరీ) న్యాయవాది పదిరి రవితేజను కోర్టు నియమించింది. ఉద్యోగుల తరఫు న్యాయవాది టి.శ్రీచరణ్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) సాంబశివ ప్రతాప్, ఏపీహెచ్‌బీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వైవీ శ్రీనివాసన్ వాదనలు వినిపించారు.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు