Share News

జగన్‌పై ఈడీ కేసుల విచారణ వేగంగా జరిగేలా ఆదేశించండి

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:57 AM

మాజీ సీఎం జగన్‌పై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణ వేగవంతం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.

జగన్‌పై ఈడీ కేసుల విచారణ వేగంగా జరిగేలా ఆదేశించండి

  • అధికారంలో ఉంటే కేసుల విచారణ జరగదనే

    తప్పుడు సందేశం వెళ్లరాదనే పిల్‌ దాఖలు

  • తెలంగాణ హైకోర్టుకు చేగొండి న్యాయవాది వెల్లడి

  • రోజువారీ విచారణకు ఆదేశించాలని కోరిన ఈడీ

  • పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌పై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణ వేగవంతం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణపై పర్యవేక్షణ చేపట్టడానికి హైకోర్టు సుమోటోగా ఒక వ్యాజ్యాన్ని నమోదు చేసి విచారిస్తోంది. అలాగే జగన్‌పై పెండింగ్‌లో ఉన్న ఈడీ కేసులను వేగంగా విచారణ చేపట్టేలా సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ పిటిషన్లు తాజాగా గురువారం జస్టిస్‌ కే లక్ష్మణ్‌, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. ఎంతో మంది ప్రజాప్రతినిధులపై కేసులు ఉండగా జగన్‌పై ఉన్న కేసులు మాత్రమే పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఎలా అవుతాయి? అని హరిరామజోగయ్య తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాది పి.రాధాకృష్ణ సమాధానం ఇస్తూ.. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ఈడీ చార్జిషీట్లు దాఖలు చేసిందని, సీఎంగా ఉండి కేసుల విచారణ ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు.


అధికారంలో ఉంటే కేసుల విచారణ జరగదనే తప్పుడు సందేశం వెళ్లకుండా ఉండటానికే పిల్‌ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. జగన్‌పై ఉన్న ఈడీ కేసుల్లో విచారణ వేగవంతంగా జరిగేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. జగన్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈడీకి సంబంధించిన కేసుల్లో చాలా మందిపై కేసులు పెండింగ్‌లో ఉండగా పిటిషనర్‌ కేవలం జగన్‌ కేసులపై మాత్రమే దృష్టిపెట్టారన్నారు.

మరోవైపు ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. జగన్‌పై ఉన్న ఈడీ కేసుల్లో రోజువారీ విచారణ జరగడం లేదని తెలిపారు. సీబీఐ కేసులపై మాత్రమే రోజువారీ విచారణ జరుగుతోందని, ఈడీ కేసుల్లో కూడా రోజువారీ విచారణకు ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ఈడీని ఉద్దేశించి.. ‘మీరు సీబీఐ కోర్టును కూడా ప్రతివాదిగా చేర్చారు. పాపం సీబీఐ కోర్టు జడ్జి (న్యాయాధికారి) మాత్రం ఏం చేస్తారు? ఆ కోర్టుపై ఇప్పటికే అధిక భారం పడుతోంది.

ఒక్కో డిశ్చార్జి పిటిషన్‌లో ఐదు రోజుల పాటు వాదనలు వినిపిస్తున్నారు. జడ్జి మాత్రం ఏంచేయగలరు’ అని వ్యాఖ్యానించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం ఇతర పిల్స్‌తో కలిపి వింటామని పేర్కొంది. విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. ప్రజాప్రతినిధుల పెండింగ్‌ క్రిమినల్‌ కేసులపై తాజా స్థాయి నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. తెలంగాణలోని క్రిమినల్‌ కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై మొత్తం 284 కేసులు వివిధ దశల్లో ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి హవా

Updated Date - Nov 20 , 2026 | 04:04 AM