కుప్పం క్లీన్‌స్వీప్
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:09 AM
సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం టీడీపీకి జై కొట్టింది. ఒక్క ఎంపీసీటీ స్థానం మినహా అక్కడ తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసేసింది.
చంద్రబాబు నియోజకవర్గంలో దూసుకెళ్లిన సైకిల్
నాలుగు జడ్పీలూ కైవసం.. 68 ఎంపీటీసీల్లో 67 టీడీపీ ఖాతాలోకి..
‘మణీంద్రం’లో భంగపడ్డ వైసీపీ
కుప్పం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం టీడీపీకి జై కొట్టింది. ఒక్క ఎంపీసీటీ స్థానం మినహా అక్కడ తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసేసింది. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండల జడ్పీటీసీలనూ కైవసం చేసుకుంది. 68 ఎంపీటీసీల్లో 67 స్థానాలను సొంతం చేసుకుంది. ఆ ఒక్క స్థానం బీజేపీ గెలుచుకుంది. కుప్పం మండలంలో జడ్పీటీసీగా బి.స్వాతి 15,893 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. శాంతిపురం జడ్పీటీసీగా 8,285 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి విజయరామిరెడ్డి.. గుడుపల్లె నుంచి 11,094 ఓట్ల మెజారిటీతో మంజుప్రియ.. రామకుప్పం నుంచి 14,710 ఓట్ల మెజారిటీతో బుజ్జమ్మ గెలుపొందారు. ఈ నియోజకవర్గంలోని మొత్తం 68 ఎంపీటీసీ స్థానాలలో 14 టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి.
మిగిలిన 54 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, టీడీపీ ఏకంగా 52, కూటమిలోని బీజేపీ ఒకటి సొంతం చేసుకున్నాయి. వైసీపీకి ఒక స్థానం దక్కింది. కుప్పం మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాలకుగాను టీడీపీ 20, బీజేపీ 1; శాంతిపురం మండలంలో 18 స్థానాలుండగా 16 టీడీపీ, అనికెర ఎంపీటీసీ స్థానం వైసీపీ గెలిచాయి. గుడుపల్లెలోని 13 ఎంపీటీసీ స్థానాలనూ టీడీపీనే గెలుచుకుంది. రామకుప్పం మండలంలోని 16 స్థానాలకుగాను 14 టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగిన మణీంద్రం, 89 పెద్దూరు ఎంపీటీసీ స్థానాలనూ అధికార పార్టీయే కైవసం చేసుకుంది. ఇందులో మణీంద్రం స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిని నిలబెట్టకపోయినా, బరిలో ఉన్న బీజేపీ రెబల్ అభ్యర్థికి లోపాయికారీ మద్దతు ప్రకటించి భంగపడింది.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..