హింసా రాజకీయాలే గొడ్డలి పార్టీ దినచర్య
ABN , Publish Date - Oct 23 , 2026 | 06:11 AM
‘రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరగనీయకుండా అడ్డుకోవడమే గొడ్డలి పార్టీ లక్ష్యం. అందులో భాగంగానే నిత్యం అరాచకాలు, దాడులు, రక్తపాతానికి తెగబడుతోంది’ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి అన్నారు.
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికే ‘స్థానికం’పై కేసులు: కొమ్మారెడ్డి
అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరగనీయకుండా అడ్డుకోవడమే గొడ్డలి పార్టీ లక్ష్యం. అందులో భాగంగానే నిత్యం అరాచకాలు, దాడులు, రక్తపాతానికి తెగబడుతోంది’ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి అన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.12,500 కోట్లు శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణను నిష్పక్షపాతంగా నిర్వహిస్తుంది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేలా స్థానిక ఎన్నికలు జరగనివ్వకుండా కోర్టు కేసులు వేస్తోంది.
ఎన్నికల ప్రక్రియను భగ్నం చేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కిరాయి రౌడీలను రప్పించి అరాచకాలు సృష్టిస్తోంది. తమను నామినేషన్లు వేయనివ్వడం లేదంటూ గొడ్డలి పార్టీ నేతలు కోర్టులకు వెళుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గాల్లో సైతం వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎంపీటీసీ స్థానాలకు మొదటి రోజు 9829 స్థానాలకు 5267 నామినేషన్లు పడితే వాటిలో 1918 వైసీపీ వారివే. ప్రభుత్వం అడ్డుకుంటే తొలిరోజే అన్ని నామినేషన్లు వైసీపీ వాళ్లు వేయగలిగేవారా? 659 జెడ్పీటీసీ స్థానాలకు తొలి రోజు 409 నామినేషన్లు పడితే టీడీపీ వారివి 128 ఉంటే వైసీపీ వారు 192 నామినేషన్లు వేశారు. ఇంత భారీగా నామినేషన్లు వేసి కూడా దాడులు చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని కొమ్మారెడ్డి విమర్శించారు.
ఎన్నికలపై గొడ్డలి పార్టీ 56 పిటిషన్లు: ఎమ్మెల్యే బూర
ఎమ్మెల్యే బూర రామాంజనేయులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, ‘ఎన్నికలను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ 56 లిటిగేషన్ పిటిషన్లు వేసింది. వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ నాయకులపై 322 అక్రమ కేసులు పెట్టారు. 1045 బలవంతపు ఉపసంహరణలు చేయించారు. 3 హత్యలు, 48 హత్యాయత్నాలు జరిగాయి. దాడులకు అంతే లేకుండా పోయింది. పుంగనూరులో 85 స్థానాలకు 84 స్థానాల్లో, మాచర్లలో 77కి 74 స్థానాల్లో ఏకగ్రీవాలు జరిగాయి. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ప్రశాంతంగా నామినేషన్లు వేస్తున్నారు’ అని రామాంజనేయులు అన్నారు.
ఈ వార్తలనూ చదవండి: