Share News

జగన్‌ కోట కల్లాస్‌!

ABN , Publish Date - Nov 08 , 2026 | 02:56 AM

జగన్‌ సొంత మేనత్త విమలమ్మ స్వగ్రామమైన ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరంలో ఆపార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గణపవరం ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.

జగన్‌ కోట కల్లాస్‌!

  • కడపలో వైసీపీ కకావికలం.. ‘స్థానికం’లో వార్‌ వన్‌సైడే

  • కూటమి ఖాతాలో కడప కార్పొరేషన్‌.. 8 మునిసిపాలిటీలూ క్లీన్‌స్వీప్

  • మూడు దశాబ్దాల తరువాత జడ్పీ పీఠం టీడీపీ కైవసం

  • టీడీపీ 31, జనసేన 3, బీజేపీ 3 జడ్పీటీసీల గెలుపు

  • 2 జడ్పీటీసీలకే వైసీపీ పరిమితం.. 39 మండల పరిషత్‌లూ కూటమికే

కడప - ఆంధ్రజ్యోతి: వైసీపీ కకావికలమైంది. మాజీ సీఎం జగన్‌ కోటగా ముద్రపడ్డ ఈ గడ్డపై టీడీపీ తొలిసారి జెండా ఎగరేసింది. స్థానిక పట్టణ ఎన్నికల్లో కడప కార్పొరేషన్‌, ఎనిమిది మునిసిపాలిటీలను సొంతం చేసుకుని ఇక్కడ వార్‌ను ‘వన్‌ సైడ్‌’ చేసేసింది. మూడు దశాబ్దాల తర్వాత, తొలిసారి తిరిగి కడప జడ్పీని తన ఖాతాలో వేసుకుంది. నిజానికి, 2004 వరకు ఉమ్మడి కడప జిల్లా టీడీపీకి కంచుకోటలా ఉండేది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాబల్యం పులివెందులకే పరిమితం. 2004 ఎన్నికల్లో వైఎస్‌ సీఎం అయిన తరువాత ఉమ్మడి కడప జిల్లా ఆయన కుటుంబానికి ‘వన్‌సైడ్‌’ అయింది. వైఎస్‌ మరణానంతరం కడపలోని కాంగ్రెస్‌ క్యాడరంతా వైసీపీకే జై కొట్టింది. మున్సిపాలిటీలు, కడప కార్పొరేషన్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీలలో మెజారిటీ స్థానాలు వైసీపీనే గెలుచుకుంది. కేవలం బద్వేలు, మైదుకూరు మున్సిపాలిటీలతోనే టీడీపీ సరిపెట్టుకోవలసి వచ్చేది. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది.

వైసీపీ ఖాళీ..

2024లో జరిగిన ఎన్నికల్లో కడప పార్లమెంట్‌ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలు కూటమి గెలుచుకుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ప్రభంజనం కొనసాగించింది. ఆ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, జడ్పీ, మండల పరిషత్‌లను క్లీన్‌స్వీప్ చేసింది. జిల్లాలో కడప కార్పొరేషన్‌తో పాటు ఎనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో కడప కార్పొరేషన్‌, పులివెందుల, జమ్మలమడుగు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగ్గా, ఈ మూడింటినీ టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. అంతకు ముందే కమలాపురం, మైదుకూరు, బద్వేలు, రాజంపేట, ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలను టీడీపీ, ఎర్రగుంట్లను బీజేపీ ఏకగ్రీవం చేసుకున్నాయి. మొత్తం మీద జగన్‌ సొంతజిల్లాలో వైసీపీకి ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కలేదు.


పులివెందులలో...

జగన్‌కు పులివెందుల పెట్టని కోటలా ఉండేది. ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో చైర్‌పర్సన్‌ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. అలాగే 40 వార్డుల్లో కేవలం 3 వార్డులకే వైసీపీ పరిమితమైంది. అలాగే పులివెందుల నియోజకవర్గంలోని 7 జడ్పీటీసీ స్థానాల్లో 3 కూటమికి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన నాలుగుకు ఎన్నికలు జరగగా, రెండుచోట్ల మాత్రమే వైసీపీ గెలుపొందింది. పులివెందుల నియోజకవర్గంలోని అన్ని మండలపరిషత్‌లూ కూటమి ఖాతాలో చేరాయి.

మూడు దశాబ్దాల తరువాత..

కడప జడ్పీ పీఠాన్ని టీడీపీ మూడు దశాబ్దాల తరువాత తిరిగి కైవసం చేసుకుంది. 1995లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎన్‌.తులసిరెడ్డి జడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన 2000 వరకు పనిచేశారు. తర్వాత కాంగ్రెస్‌, ఆ తర్వాత వైసీపీ జడ్పీని గెలుచుకుంటూ వచ్చాయి. ఇప్పుడు 39 జడ్పీటీసీలకు 31 టీడీపీ గెలుచుకోగా, 3 జనసేన, 3 బీజేపీ, 2 వైసీపీ గెలుచుకున్నాయి. అంటే 37 కూటమి ఖాతాలో ఉన్నాయి. ఇక జిల్లాలోని 39 మండల పరిషత్‌లు కూడా గెలుచుకుంది. కార్పొరేషన్‌, జడ్పీ చైర్మన్‌ సహా అన్ని మున్సిపాలిటీలు, మండలపరిషత్‌లను కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసేసింది.

జగన్‌పై కుదరని నమ్మకం

కాంగ్రెస్‌ను వీడి జగన్‌ సొంత పార్టీ పెట్టిన తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీకి కడప ప్రజలు బ్రహ్మరఽథం పట్టారు. ఆ తరువాత స్థానిక ఎన్నికల్లో ఫ్యానుకే ఓటు వేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ జిల్లాలో ఆశించిన అభివృద్ధి చేయలేదు. ఆయనను వైఎ్‌సతో జనం పోల్చుకుని నిరాశపడ్డారు. దీంతో పాటు బాబాయ్‌ వివేకానందరెడ్డి హత్య తీవ్ర నష్టం చేసింది. ఇది జనాల్లోకి బాగా వెళ్లింది. ఇక వైసీపీ హయాంలో కబ్జాలు, దందాలకు అడ్డూ అదుపులేదు. దీంతో జగన్‌ మీద జిల్లా ప్రజలకు నమ్మకం సడలింది. ఫలితంగా 2024లో ఈ జిల్లాలో కేవలం రెండు అసెంబ్లీ సీట్లకే వైసీపీని పరిమితం చేశారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూటమి క్లీన్‌స్వీ్‌ప చేయడం వైసీపీని పెద్ద షాక్‌కు గురిచేసింది.


ఎన్నికలపై ఆరోపణలు

మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై వైసీపీ నానా యాగీ చేసింది. రిగ్గింగ్‌ చేశారంటూ, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసింది. వైసీపీ ఎంత రచ్చ చేసినా, జనం జగన్‌ను ఆదరించలేదు. జగన్‌పై జనం ఎంత విసిగిపోయి ఉన్నారో దీంతో తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

కలిసొచ్చిన అభివృద్ధి, సంక్షేమం

చంద్రబాబు సీఎం అయిన తరువాత కూటమి ప్రభుత్వం కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో పెద్ద ఎత్తున సోలార్‌ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. స్టీలు ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయి. కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమలు వస్తున్నాయి. టూరిజం పరంగా గండికోట అభివృద్ధి చెందుతోంది. దీంతో ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కలిసొచ్చింది. దీనికి తోడు జగన్‌ హయాంలో పల్లెల్లో అభివృద్ధి పడకేసింది. ఇప్పుడు సిమెంటు రోడ్లు, డ్రైనేజీల పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వానికి సానుకూలమైన వాతావరణం ఏర్పడేలా చేశాయి.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 03:04 AM