కర్నూలులో కూటమి సునామీ
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:27 AM
కర్నూలు జిల్లా పల్లె ఓటర్లు కూటమికి భారీ విజయాన్ని అందించారు. జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాలు ఉంటే 26 స్థానాలకు, 432 ఎంపీటీసీ స్థానాలు ఉంటే(74 స్థానాలు ఏకగ్రీవం) 358 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
20 జడ్పీటీసీ, 313 ఎంపీటీసీ స్థానాలు
వైసీపీకి 5 జడ్పీటీసీ, 111 ఎంపీటీసీలే
కర్నూలు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా పల్లె ఓటర్లు కూటమికి భారీ విజయాన్ని అందించారు. జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాలు ఉంటే 26 స్థానాలకు, 432 ఎంపీటీసీ స్థానాలు ఉంటే(74 స్థానాలు ఏకగ్రీవం) 358 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 12.49 లక్షల ఓటర్లకు గానూ 8.52 లక్షల మంది ఓటర్లు తీర్పు ఇచ్చారు. 26 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 20 స్థానాల్లో విజయం సాధించింది. 237 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి సత్తా చాటింది. ఏకగ్రీవాలతో కలిపితే 313 ఎంపీటీసీ స్థానాలను కూటమి ఖాతాలో వేసుకుంది. వైసీపీ 5 జడ్పీటీసీ, 111 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. జడ్పీటీసీలకు పోలైన ఓట్లలో కూటమి పార్టీలు 68 శాతం ఓట్లు సాధించాయి.
ఎర్ర‘కోట’కు బీటలు
ఎమ్మిగనూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి ఎమ్మిగనూరు మండలం కంచుకోట. ఏ ఎన్నికలైనా ఆయనదే ఆధిపత్యం. 1987లో జరిగిన మండల పరిషత్ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా ఎంపీపీగా ఎన్నికయ్యారు. జడ్పీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1994లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించగా దక్కలేదు. దీంతో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి, ఆ తరువాత వైసీపీలో చేరారు. 1987 నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనదే పైచేయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపుడు ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత ఎర్ర‘కోట’ ఆధిపత్యానికి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి గండికొట్టారు. ఎమ్మిగనూరు మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 13 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..