Share News

కసిరెడ్డి కస్టడీపై సీరియ్‌సగా ఉన్నారా? Supreme Court Questions SIT Over Kasireddy Custody

ABN , Publish Date - Sep 01 , 2026 | 05:32 AM

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెండేళ్లుగా ఏం చేస్తున్నారు.. కీలక నిందితుడు రాజ్‌ కసిరెడ్డి కస్టడీపై సిట్‌ అసలు సీరియ్‌సగా ఉందా అని ప్రశ్నించింది. కోర్టు అనుమతి ఇఛ్చిన తర్వాత కస్టడీకి సిద్ధంగా లేమని పోలీసులు ఎలా చెబుతారని నిలదీసింది.

కసిరెడ్డి కస్టడీపై సీరియ్‌సగా ఉన్నారా? Supreme Court Questions SIT Over Kasireddy Custody

  • కోర్టు అనుమతి వచ్చాక విచారణకు సిద్ధంగా లేమంటే ఎలా?

  • ఏపీ మద్యం కేసులో సిట్‌ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి

  • రెండేళ్లుగా ఏం చేస్తున్నారని ఆగ్రహం

  • కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు నోటీసు

న్యూఢిల్లీ, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెండేళ్లుగా ఏం చేస్తున్నారు.. కీలక నిందితుడు రాజ్‌ కసిరెడ్డి కస్టడీపై సిట్‌ అసలు సీరియ్‌సగా ఉందా అని ప్రశ్నించింది. కోర్టు అనుమతి ఇఛ్చిన తర్వాత కస్టడీకి సిద్ధంగా లేమని పోలీసులు ఎలా చెబుతారని నిలదీసింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019-24 మధ్య కాలంలో ఎక్సైజ్‌ పాలసీ మార్పులు, మద్యం రవాణా టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ 2024లో కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ సైతం కేసు నమోదు చేసింది. ఇదే వ్యవహారానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి లో సీఐడీ అధికారులు మద్యం రవాణా అక్రమాలకు సంబంధించి మరో కొత్త కేసు నమోదు చేశారు. ఈ కేసులో కసిరెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉండగా.. పోలీసులు పీటీ వారెంట్‌ ద్వారా జూలై 20న కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌ తీసుకున్నారు. అసలెందుకు అరెస్టు చేస్తున్నారో పోలీసులు కారణాలను లిఖితపూర్వకంగా తనకు ఇవ్వలేదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(1), సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం చట్టవిరుద్ధమని కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు చేసేటప్పుడు రాతపూర్వకంగా గ్రౌండ్స్‌ ఇవ్వడం తప్పనిసరని.. పోలీసులు ఆ నిబంధన పాటించకపోతే ఆ అరెస్టు చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రాష్ట్రప్రభుత్వం ఆగస్టు 22న సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట సోమవారం విచారణకు వచ్చింది. దర్యాప్తు సంస్థ సిట్‌ ఉద్దేశపూర్వకంగానే ఒకదాని తర్వాత ఒకటి చొప్పున కేసులు నమోదు చేస్తోందని కసిరెడ్డి తరఫు న్యాయవాది తెలిపారు. రాష్ట్రప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇదొక భారీ కుంభకోణమని, ఇందులో కసిరెడ్డి కీలక నిందితుడని తెలిపారు. నిందితుడిని కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు.


ప్రొడక్షన్‌ వారెంట్‌.. అరెస్టు వారెంట్‌తో సమానం..

దర్యాప్తు సంస్థ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘కసిరెడ్డి పోలీసు కస్టడీపై సిట్‌ నిజంగా సీరియ్‌సగా ఉందా? ఒకవైపు కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ కావాలని కోరుతూనే.. తీరా జడ్జి ప్రొడక్షన్‌ వారెంట్‌ ఇచ్చాక పోలీసు కస్టడీకి తాము సిద్ధంగా లేమని ఎలా చెబుతారు? ముందుగా సన్నద్ధం కాకుండానే కస్టడీకి ఇవ్వాలని అడగడమేంటి? ప్రొడక్షన్‌ వారెంట్‌ అనేది అరెస్టు వారెంట్‌తో సమానం. గత రెండేళ్లుగా ఈ కేసు దర్యాప్తు నడుస్తోంది. ఇప్పటి వరకూ అసలేం కనుగొన్నారు? ముందుగా దర్యాప్తు సంస్థ తీరును పరిశీలిస్తాం. ఆ తర్వాతే హైకోర్టు తీర్పు గురించి ఆలోచిస్తాం’ అని స్పష్టం చేసింది. నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఆయన ఇప్పటికే కస్టడీలో ఉన్నారని, పారిపోయే అవకాశం ఏమాత్రం లేదని, అలాంటప్పుడు ప్రొడక్షన్‌ వారెంట్‌ కోసం ఎలా దరఖాస్తు చేస్తారు.. ఇది హైకోర్టును అతిక్రమించడం కాదా అని ప్రశ్నించింది. కస్టడీలో ఉన్న వ్యక్తికి సంబంధించి ప్రొడక్షన్‌ వారెంట్‌ ఇవ్వడాన్ని తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిట్‌ అనుసరించాల్సిందేనని స్పష్టంచేసింది. కేసు మెరిట్స్‌ ఆధారంగా దీన్ని లోతుగా పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రతివాదులైన నిందితులు రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 15కి వాయిదా వేసింది.

ఈ వార్తలను కూడా చదవండి

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..

పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Sep 01 , 2026 | 05:32 AM