ఏపీ లిక్కర్ స్కామ్ కేసు: నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..!
ABN , Publish Date - Jul 30 , 2026 | 05:17 PM
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ9గా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఢిల్లీ, జులై 30: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన ఏ9 ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే దర్యాప్తు సంస్థల ముందు లొంగిపోవాలని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులోని ఇతర నిందితులకు ఇచ్చిన సడలింపులు లేదా ఉత్తర్వులను కిరణ్ కుమార్ రెడ్డికి వర్తింపజేయలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. మద్యం కుంభకోణంలో వచ్చిన నిధులను, నగదును వేర్వేరు మార్గాలకు చేర్చడంలో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించారని పోలీసుల విచారణలో తేలింది. అందుకే ఈ కేసులో ఆయన పాత్ర ఇతర నిందితుల కంటే భిన్నమైనదని, సమాజంపై ప్రభావం చూపేంత తీవ్రమైనదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిజాలను బయటకు తీసేందుకు అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ముందుగా దర్యాప్తు సంస్థల ముందు లొంగిపోయి కస్టోడియల్ విచారణకు పూర్తిగా సహకరించాల్సిందేనని సూచించింది. లొంగిపోయిన తర్వాతే చట్టప్రకారం కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆయన పెట్టుకునే రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను కూడా చట్టబద్ధంగా వ్యతిరేకించే హక్కు దర్యాప్తు సంస్థలకు ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించడంతో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్‌కు లేదా లొంగుబాటుకు మార్గం సుగమమైంది.
ఇవి కూడా చదవండి..
మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు: ఆదోని చిన్నారులతో లోకేశ్ ఫొటో
సూపర్ ఎల్‌నినోపై రైతుల్లో అవగాహన కల్పించాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్