Share News

సోషల్‌ మీడియాతో న్యాయ వ్యవస్థకు సవాళ్లు

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:44 AM

సోషల్‌ మీడియాతో న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా అన్నారు.

సోషల్‌ మీడియాతో న్యాయ వ్యవస్థకు సవాళ్లు
SUPREMECOURTjustice

  • తీర్పు చదవకుండానే ఏకపక్షంగా విశ్లేషణలు,టీవీల్లో చర్చలు చేస్తున్నారు

  • సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా

  • ప్రస్థానం ఎక్కడ మొదలైందో మర్చిపోకండి

  • ఏపీ జ్యుడీషియల్‌ ఆఫీసర్స్‌ కాన్ఫరెన్స్‌లో న్యాయమూర్తులు

అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాతో న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా అన్నారు. తీర్పు ప్రతుల్లో ఏముందో కనీసం చదవకుండా ఏకపక్షంగా విశ్లేషణలు చేస్తూ, టీవీల్లో చర్చలు నిర్వహిస్తూ న్యా య వ్యవస్థను ఒత్తిడిలోకి నెడుతున్నారన్నారు. వాస్తవాలు విస్మరించి ట్రోల్‌ చేస్తున్నారని, దీంతో న్యాయమూర్తులు బాధితులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయాధికారులు, న్యాయమూర్తులు కేసులను ట్రయల్‌ చేస్తుంటే.. సామాజిక మాధ్యమాల వేదికగా జడ్జీలనే ట్రయల్‌ చేస్తున్నారని అన్నారు. న్యాయస్థానాలు కక్షిదారులను భయపెట్టేవిగా ఉండకూడదన్నారు. విజయవాడలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కళావేదికలో ఆదివారం ఏపీ జ్యుడీషియల్‌ ఆఫీసర్స్‌ మూడో కాన్ఫరెన్స్‌ను హైకోర్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ సరసా వెంకట నారాయణ భట్టి ముఖ్య, గౌరవ అతిథులుగా హాజరయ్యారు. హైకోర్టు సీజే జస్టిస్‌ లిసాగిల్‌, ఇతర హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ మిశ్రా మాట్లాడుతూ.. దేశంలో పెండింగ్‌లో ఉన్న ప్రతీ 10 కేసుల్లో దాదాపు 9 కేసులు జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లోనే ఉన్నాయన్నారు. ప్రస్తు తం సుప్రీంకోర్టులో పెం డింగ్‌ కేసుల సంఖ్య 97 వేలకు చేరిందన్నారు. పెండింగ్‌ కేసుల సంఖ్య ను చూస్తే న్యాయాధికారుల బాధ్యత ఎంత పెద్దదో అర్థమౌతుందన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో జరిగిన న్యాయ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని అమరావతి విషయంలో తాను ఇచ్చిన తీర్పు ఏపీని రక్షించిందని, అందుకు ఏపీ ప్రజలందరూ కృతజ్ఞతగా ఉంటారని చెప్పారని అన్నారు. ‘‘నేను సీజేగా ఉన్నప్పుడు నాపై సామాజిక మాధ్యమాలలో పెట్టిన పోస్టులను రిజిస్ట్రీ నా దృష్టికి తీసుకొచ్చింది. అటువంటివి నా దృష్టికి తీసుకురావద్దని వారికి చెప్పాను. ఎటువంటి భయం, పక్షపాతం లేకుండా న్యాయాధికారులు విధులు నిర్వర్తించండి’’ అని పేర్కొన్నారు.


సైనిక దళాల క్రమశిక్షణతో సమానంగా ఉండాలి

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌ మాట్లాడుతూ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా తీసుకున్న అనేక సంస్కరణలు నేడు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. న్యాయవ్యవస్థపై సామాన్య ప్రజలకు ఉండే విశ్వా సం లా జర్నల్స్‌, కాన్ఫరెన్స్‌ హాళ్లలో నిర్మితమయ్యేది కాదని, ట్రయల్‌ కోర్టుల పనితీరుపై అది ఆధారపడి ఉంటుందన్నారు. ‘న్యాయం చెప్పడం సులభం, న్యాయం చేయడం కష్టం’ అనే తెలుగు సామెతను గుర్తు చేస్తూ న్యాయం గురించి మాట్లాడడం, చర్చించడం సులభమే అయినా క్షేత్రస్థాయిలో న్యాయం జరిగేలా చూడడం అత్యంత కష్టతరమైన బాధ్యతని అన్నారు. ‘‘డిజిటల్‌ స్ర్కీన్లు, ఈఫైలింగ్‌, వర్చువల్‌ హియరింగ్‌ వంటి మౌలిక సదుపాయాలు పెరిగా యి. అయితే మారుమూల గ్రామం నుంచి వచ్చే 80 ఏళ్ల వృద్ధ్దురాలికి క్లౌజ్‌ సర్వీసులు, ఆన్‌లైన కాజ్‌ లిస్టుల గురించి ఏమీ తెలియదు. తన కేసు ఎందుకు వాయిదా పడిందో సాధారణ తెలుగు భాషలో తెలుసుకోవాలని మాత్రమే ఆమె ఆశపడుతుంది’’ అని అన్నారు. ‘దేశమంటే మట్టి కాదోయ్‌-దేశమంటే మనుషులోయ్‌’ అని గురజాడ అప్పారావు చెప్పిన సూక్తిని గుర్తు చేసిన సీజే.. భవనాలు, సాంకేతికత కంటే సంబంధిత కోర్టు న్యాయాధికారి వ్యవహరించే తీరు, స్పందించే గుణమే కోర్టును నిర్వచిస్తాయని అన్నారు. ‘‘గతంలో తీర్పు వెలువడితే సంబంధిత న్యాయవాదులు, అప్పిలేట్‌ కోర్టు, కక్షిదారులు మాత్రమే చదివేవారు. కానీ ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో తీర్పు వెల్లడించి పోడి యం దిగేలోపే 10 సెకన్ల వీడియో క్లిప్‌ వాట్సాప్‌, ఎక్స్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. యూట్యూబ్‌లలో విశ్లేషణ చేస్తున్నారు. ఈ ప్రచారానికి న్యాయాధికారులు, న్యాయమూర్తులు ఏమాత్రం కలవర పడకూడదు. కేవలం తమ తీర్పుల ద్వారా సమాధానం చెప్పాలి.’’ అని సీజే అన్నారు.


ఆ బాధ్యత న్యాయాధికారులదే

అంతకుముందు జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రారంభోపన్యాసం చేశారు. బలహీన, అణగారిన వర్గాలకు న్యాయాన్ని చేరువ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. న్యాయాధికారులు చట్టబద్ధమైన పాలన, న్యాయ వ్యవస్థపై ప్రజా విశ్వాసాన్ని కాపాడే రక్షకులన్నారు. న్యాయాధికారి ఇచ్చే ప్రతీ తీర్పు నిష్పాక్షికత, కరుణ, రాజ్యాంగ నిబద్ధతతో ఉండాలన్నారు. 2019లో జస్టిస్‌ జేకే మహేశ్వరి, 2021లో జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సులు జరిగాయని, ఐదేళ్ల విరామం తరువాత సీజే జస్టిస్‌ లిసాగిల్‌ దూరదృష్టితో ప్రస్తుత సదస్సు రూపుదిద్దుకుందని అన్నారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి అందించిన న్యాయసేవలను కొనియాడారు. జస్టిస్‌ మిశ్రా ఏపీ హైకోర్టు సీజేగా రాష్ట్ర న్యాయ వ్యవస్థను ఎంతో బలోపేతం చేశారన్నారు. రాజధాని అమరావతి విషయంలో ఆయన ఇచ్చిన తీర్పును సీఎం చంద్రబాబు సైతం గుర్తు చేసుకొని కృతజ్ఞతలు చెప్పారన్నారు. తెలుగు గడ్డ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డి.రమేష్‌, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, భారీ సంఖ్యలో న్యాయాధికారులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ సరసా వెంకట నారాయణ భట్టిలను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. బొబ్బిలి వీణలు బహూకరించారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 30 , 2026 | 03:17 AM