Share News

విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి

ABN , Publish Date - Sep 25 , 2026 | 04:36 AM

ప్రమాదకరంగా కిందకు వాలిన కరెంటు తీగలు మృత్యుపాశాలయ్యాయి. రాష్ట్రంలో గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి...

విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి

  • విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి

బాపట్ల, నాతవరం, పెంటపాడు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రమాదకరంగా కిందకు వాలిన కరెంటు తీగలు మృత్యుపాశాలయ్యాయి. రాష్ట్రంలో గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. బాపట్ల రూరల్‌ మండలం చెరువు ఉప్పరపాలెం గ్రామానికి చెందిన ముద్రబోయిన రమాదేవి (52), ఆమె కుమారుడు ముద్రబోయిన వెంకటేశ్వర్లు (32) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున పనికి బయల్దేరుతున్న రమాదేవి వంట నూనె కోసమని పక్కనే ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చింది. విద్యుత్‌ స్తంభం నుంచి కిందకి జారిన వైరుని గమనించకుండా దానికి తగిలి షాక్‌తో ప్రాణాలు విడిచింది. అంతకుముందే టీ తాగేందుకు బయటకు వెళ్లిన వెంకటేశ్వర్లు తిరగొస్తూ కిందపడిన తల్లిని చూశాడు. వైరు తగిలి కింద పడి ఉంటుందని భావించి... ఆ వైరును పక్కకు లాగే ప్రయత్నంలో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కొద్ది రోజులుగా విద్యుత్‌ వైర్లు వేలాడుతున్న విషయాన్ని విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యా దు చేసినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలయ్యాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


కుమార్తెను కాపాడేందుకు వెళ్లి...

అనకాపల్లి జిల్లా నాతవరంలో విద్యుదాఘాతంతో తల్లీకూతురు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. నాతవరం గొల్లవీధికి చెందిన రొంగల జానకి (28) గురువారం తెల్లవారుజామున నిద్రలేచి బయటకు వస్తుండగా అక్కడ వేలాడుతున్న విద్యుత్‌ వైర్‌ తగిలి షాక్‌కు గురైంది. జానకి కేకలు విని ఆమె తల్లి గొంప మంగ (55) పరుగున వచ్చింది. జానకిని రక్షించే క్రమంలో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయింది. జానకి భర్త నాగరాజు కర్రతో విద్యుత్‌ వైర్‌ను తొలగించేందుకు యత్నించగా అతనికి కూడా షాక్‌ తగిలింది. పక్కింట్లో ఉంటున్న కుమారి సబ్‌స్టేషన్‌కు ఫోన్‌ చేయడంతో విద్యుత్‌ సరాఫరా నిలిపివేశారు. అప్పటికే మంగ, జానకి మృతిచెందారు. జానకి పదకొండు రోజుల క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెంలో ఇద్దరు చిన్నారులు విద్యుదాఘాతానికి గురై చనిపోయారు. ఒకే వీధికి చెందిన సూర్య (14), సాయి (12) గురువారం పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో కలిసి ఆడుకున్నారు. ఈ క్రమంలో వారు ప్రమాదవశాత్తు ఎర్త్‌ వైర్‌పై పడి విద్యుత్‌ షాక్‌కు గురై దుర్మరణం పాలయ్యారు.

ఈ వార్తలనూ చదవండి...

బజార్‌లో పోస్టుల అమ్మకం

మహిళల భద్రతకు ప్రాధాన్యం

Updated Date - Sep 25 , 2026 | 04:36 AM