Share News

పెళ్లి నగలూ తీసుకోనివ్వరా?

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:18 AM

యలహంక ప్యాలెస్‌లోకి చెల్లి షర్మిలను అడుగుపెట్టనివ్వకుండా అన్న జగన్‌ పంతం నెగ్గించుకున్నారు. కనీసం ప్యాలెస్‌ రోడ్డులోకి కూడా రానివ్వకుండా పోలీసుల ద్వారా అడ్డుకున్నారు

పెళ్లి నగలూ తీసుకోనివ్వరా?
sharmila and vijayamma

  • షర్మిలకు నో ఎంట్రీ!

  • తల్లి విజయలక్ష్మి కంట తడి!

  • ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్న పోలీసులు

  • ప్యాలెస్‌ రోడ్డులోకీ అడుగుపెట్టనివ్వని వైనం

  • పెళ్లి వస్తువులు తెచ్చుకునేందుకూ నో

  • ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా?

  • ఆ ఇంట్లో షర్మిలకూ అంతే హక్కుంది

  • విజయలక్ష్మి తీవ్ర మనస్తాపం.. కంట తడి!

  • కుమార్తె పెళ్లికి సొంత అన్నే ఆటంకాలు కల్పించడంపై షర్మిల తీవ్ర ఆవేదన

యలహంక ప్యాలెస్‌ వేదికగా ఆదివారం హైడ్రామా నడిచింది. చెల్లి షర్మిల ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకుండా తన జేబు సంస్థ సిలికాన్‌ బిల్డర్స్‌ ద్వారా కోర్టు ఉత్తర్వులు పొందిన జగన్‌ అండ్‌ కో.. నిర్దయగా వ్యవహరించారు. చెల్లెలి కుమార్తె పెళ్లి మాట దేవుడెరుగు.. అసలు షర్మిల ప్యాలెస్‌ రోడ్డులోకే అడుగు పెట్టకుండా కట్టడి చేయించారు. సంతోషంగా మేనకోడలి పెళ్లి వేడుకలు జరగాల్సిన వేళ.. కన్నతల్లి విజయలక్ష్మితో కన్నీళ్లు పెట్టించారు!!

jagan copy.jpg

బెంగళూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): యలహంక ప్యాలెస్‌లోకి చెల్లి షర్మిలను అడుగుపెట్టనివ్వకుండా అన్న జగన్‌ పంతం నెగ్గించుకున్నారు. కనీసం ప్యాలెస్‌ రోడ్డులోకి కూడా రానివ్వకుండా పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. షర్మిలకు వ్యతిరేకంగా పొందిన కోర్టు ఉత్తర్వుల అమలుకు సహకరించాలని ఆదివారం ఉదయమే పోలీసులను జగన్‌ అండ్‌ కో కోరినట్టు సమాచారం. దీంతో మధ్యాహ్నం 12 గంటలకే ప్యాలెస్‌ వద్ద బ్యారికేడ్లు పెట్టేసి, భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు ఎయిర్‌పోర్టులోనూ ప్రత్యేక బృందాలను పెట్టారు. పెళ్లి పనుల కోసం ఆదివారం సాయంత్రం 4 గంటలకు షర్మిల బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.


baricades.jpgఆమె వెంట తల్లి విజయలక్ష్మి, కొడుకు, కోడలు కూడా వచ్చారు. వారందరినీ పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. ఏకంగా ఒక డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం అక్కడ మోహరించి షర్మిలను అడ్డుకోవడం విశేషం. ప్యాలెస్‌కు వెళ్లనిచ్చేది లేదని షర్మిల కుటుంబానికి పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో దాదాపు 2 గంటలపాటు షర్మిల, విజయలక్ష్మి ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. అనంతరం యలహంకలో ఇన్నేళ్లుగా తాను ఉంటున్న భవనం నుంచి పెళ్లికి అవసరమైన వస్తువులైనా తెచ్చుకోవాలని భావించి ప్యాలెస్‌కు బయల్దేరారు. ప్యాలెస్‌ దగ్గర మోహరించడమే కాకుండా, ఆ దారి పొడవునా అప్పటికే పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి తల్లితో కలిసి కారులో బయల్దేరిన షర్మిల.. యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద సర్వీసురోడ్డు ద్వారా బాగలూరు యలహంక ప్యాలెస్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వెంటనే ఆమెను అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్యాలెస్‌ వైపు వెళ్లడానికి అనుమతించేది లేదని తెగేసి చెప్పారు. పెళ్లికి అవసరమైన వస్తువులు తీసుకోవాల్సి ఉందని చెప్పినా.. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వారు ససేమిరా అన్నట్టు సమాచారం. ఈ పరిణామంతో తల్లి విజయలక్ష్మి తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలిసింది. ఇన్నేళ్లుగా ఉన్న ఇంట్లోకి రానివ్వకపోవడం, ఆఖరికి పెళ్లి నగలు తెచ్చుకునేందుకు కూడా అనుమతించకపోవడమేమిటంటూ కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. ‘కేవలం కుటుంబ సభ్యులం వెళ్లడం వల్ల అక్కడ జరిగే నష్టం ఏముంటుంది? మొక్కల్ని మేమేం పాడుచేయం గదా. వస్తువుల్ని ధ్వంసం చేయం గదా. ఆడబిడ్డ కూతురి పెళ్లి చేస్తున్న సమయంలో ఈ ఆటంకాలేంటి? అయినా అది రాజశేఖరరెడ్డి కష్టార్జితం. ఆయన బిడ్డ కోసం కట్టించిన ఇంట్లోకి పోనివ్వడం లేదు.


sharmila3.jpg

అక్కడి భవనాల్లో జగన్‌కు ఎంత హక్కుందో.. షర్మిలకూ అంతే హక్కు ఉంది. మేనకోడలి పెళ్లి అన్న కనికరం కూడా లేకుండా, జగన్‌ నిర్దయగా వ్యవహరిస్తూ రాజశేఖరరెడ్డి పరువు తీస్తున్నాడు’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమైనట్టు సమాచారం. మరోవైపు తన బిడ్డ పెళ్లికి సొంత అన్నే ఇన్ని ఆటంకాలు కల్పించడంపై షర్మిల సైతం కుటుంబ సభ్యుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది.

sharmila1.jpg

జగన్‌ లోపలే!?

పోలీసులు ససేమిరా అనడంతో చేసేదేమీ లేక షర్మిల బృందం చివరికి హైవే మీదుగా నేరుగా బెంగళూరు నగరంలోకి ప్రవేశించింది. పెళ్లి కూతుర్ని చేసే వేడుక నిర్వహించనున్న లీలా ప్యాలెస్‌ హోటల్‌కు రాత్రి 7 గంటల తర్వాత చేరుకున్నారు. దాదాపు 3 గంటలపాటు ఎయిర్‌పోర్టు, నడి రోడ్డుపై ఈ తతంగం కొనసాగుతున్నంతసేపూ జగన్‌ ప్యాలెస్‌లోనే ఉన్నట్టు సమాచారం. కాగా, వరుసగా రెండు రోజులు వారాంతపు సెలవులు ఉండడంతో ప్యాలెస్‌ విషయమై షర్మిల కోర్టును ఆశ్రయించలేదు. సోమవారం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా, పెళ్లి వేడుకల తర్వాత కోర్టుకెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

ఎమ్మెల్యే అసభ్య మెసేజీలు పెట్టినట్టు ఆరోపణ.. మద్రాస్ హైకోర్టు సీరియస్

ఈఎంఐల కోసం వేధించొద్దు!

Updated Date - Nov 23 , 2026 | 04:14 AM