ఈఎంఐల కోసం వేధించొద్దు!
ABN , Publish Date - Nov 23 , 2026 | 02:20 AM
ఇళ్ల నిర్మాణం ఆగిపోయినప్పుడు, బిల్డర్‌కు, బ్యాంకులకు మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని పరిశీలించకుండా కొనుగోలుదారుల నుంచి ఈఎంఐలు (రుణ వాయిదాలు) వసూలు చేయాలంటూ..
ఇళ్ల నిర్మాణం ఆగిపోతే కొనుగోలుదారులను ఒత్తిడి చేయడం సరికాదు
ముందు బిల్డర్, బ్యాంకు మధ్య జరిగిన రహస్య ఒప్పందాన్ని తేల్చాలి
ఒప్పందం ప్రకారమే బ్యాంకు బిల్డర్‌కు డబ్బులిచ్చిందా? అన్నది కింది కోర్టులు తేల్చాలి
ఓ కేసులో సుప్రీం కోర్టు తీర్పు
న్యూఢిల్లీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇళ్ల నిర్మాణం ఆగిపోయినప్పుడు, బిల్డర్‌కు, బ్యాంకులకు మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని పరిశీలించకుండా కొనుగోలుదారుల నుంచి ఈఎంఐలు (రుణ వాయిదాలు) వసూలు చేయాలంటూ కింది కోర్టులు ఆదేశాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొనుగోలుదారుల వైపు తప్పు ఉందని తేలితే తప్ప.. వారిని ఒత్తిడి చేయకూడదని తేల్చిచెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఓ కేసు విచారణలో భాగంగా ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. గురుగ్రామ్‌లో ‘రహేజా డెవలపర్స్’ అనే సంస్థ ‘కృష్ణ హౌసింగ్ స్కీమ్’ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో ఇళ్లు కొనుగోలు చేసిన వారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), బిల్డర్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. గృహరుణాల సొమ్మును నిర్మాణ పనులకు అనుగుణంగా బిల్డర్‌కు దశలవారీగా ఇవ్వాలి. కానీ, నిర్మాణం పనులు ముందుకు సాగకపోయినా.. నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌బీఐ బిల్డర్‌కు నిధులన్నీ ఇచ్చేసింది. 2025 ఆగస్టులో రహేజా డెవలపర్స్ దివాలా తీసింది. కొనుగోలుదారుల డబ్బును 6 నెలల వాయిదాల్లో తిరిగి ఇచ్చేస్తామని కంపెనీల ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముందు ఆ సంస్థ చెప్పిం ది. ఈ కేసు నడుస్తుండగానే ఎస్‌బీఐ.. ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కొనుగోలుదారులపై కేసు వేసింది. కొనుగోలుదారులు బ్యాంకుకు ఈఎంఐలు కట్టాల్సిందేనని ఆ కోర్టు ఆదేశించగా.. కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం.. బిల్డర్, బ్యాంకు అధికారులకు మధ్య ఉన్న రహస్య సంబంధం తొలత తేలాలని స్పష్టం చేసింది. ‘‘బ్యాంకు అధికారులు ఒప్పందం ప్రకారమే బిల్డర్‌కు డబ్బులు ఇచ్చారా? లేదా ? అనేది ముందుగా కింది కోర్టులు తేల్చాలి. బిల్డర్, బ్యాంకు అధికారుల మధ్య ఉన్న రహస్య సంబంధాన్ని బయటపెట్టడం కోర్టుల బాధ్యత. ఇల్లు కొన్నవారిదే తప్పని స్పష్టంగా తేలితే తప్ప, వారిని ఈఎంఐలు కట్టమని ఒత్తిడి చేయకూడదు. ఈ విషయం తేలేవరకు పిటిషనర్లపై(కొనుగోలుదారులు) ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.