Share News

జగన్‌.. నీ మనస్సాక్షిని అడుగు

ABN , Publish Date - Mar 19 , 2026 | 05:24 AM

జగన్‌.. నీ మనస్సాక్షిని అడుగు. సునీత బాధితురాలా..? కాదా..?’’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌ను ఉద్దేశించి నిలదీశారు.....

జగన్‌.. నీ మనస్సాక్షిని అడుగు

  • సునీత బాధితురాలా? కాదా?‘అన్న’ అనే పదానికి జగన్‌ కళంకం: షర్మిల

  • ‘కడప ఎంపీ’ కేంద్రంగానే వివేకా హత్య

  • అవినాశ్‌కు కడప టికెట్‌ సరికాదన్నారు.. వివేకా తమకు ఎప్పుడైనా అడ్డంకేనని అవినాశ్‌, ఆయన తండ్రికి అర్థమైంది.. ఈ క్రమంలోనే దారుణ హత్య జరిగింది

  • ఇవేవీ తెలియనట్టు అవినాశ్‌రెడ్డి నటన.. సునీత భర్తే చేయించారనడం దారుణం

  • ఎవరు చంపించారో జగన్‌కు తెలీదా?

  • ఆయనలాంటి వ్యక్తులు అన్నగా ఉంటే శత్రువుల అవసరం లేదు: షర్మిల ఫైర్‌

  • వివేకాను ఎవరు చంపించారన్న విషయం జగన్మోహన్‌రెడ్డికి తెలియదా?. అసలు ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అనవసరం. ‘అన్న’ అనే పదానికి జగన్‌ కళంకం. గుండెపోటుతో వివేకా చనిపోయారన్న వార్తను సునీత పుట్టించిందా?. జగన్‌ మీడియా పుట్టించిందా?. వివేకా హత్యలో అవినాశ్‌ పాత్ర లేదా?

  • సొంత మీడియా ఉందన్న అహంకారంతో ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్నారు. పలుకుబడి ఉందన్న అహంకారంతో ఎన్ని నేరాలు చేసినా తప్పించుకోవచ్చని భావిస్తున్నారు. డబ్బు ఉందన్న అహకారంతో సోషల్‌ మీడియాలో సైతాన్‌ సైన్యంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.

- షర్మిల

విశాఖపట్నం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌.. నీ మనస్సాక్షిని అడుగు. సునీత బాధితురాలా..? కాదా..?’’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌ను ఉద్దేశించి నిలదీశారు. కడప పార్లమెంటు సీటు కేంద్రంగానే మాజీ మంత్రి, తమ బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిందని చెప్పారు. ‘‘వివేకా హత్యపై ప్రజలను గందరగోళానికి గురిచేయడమే జగన్‌ సిద్ధాంతంగా కనిపిస్తోంది. వివేకా హత్య ముమ్మాటికీ కడప ఎంపీ సీటు కేంద్రంగానే జరిగింది. చిన్నాన్న ఈ విషయమై నా వద్దకు వచ్చి రెండు గంటలపాటు చర్చించారు. అవినాశ్‌ రెడ్డికి కడప ఎంపీ సీటు కరెక్ట్‌ కాదని ఆయన గట్టిగా నమ్మారు. ఇదే విషయాన్ని జగన్‌తోపాటు అందరికీ చెప్పారు. అయినా.. జగన్‌ అవినాశ్‌రెడ్డికే టికెట్‌ ఇచ్చారు.’’ అని షర్మిల తెలిపారు. జగన్‌ మాటను గౌరవించి 2019 ఎన్నికల్లో అవినాశ్‌ గెలుపు కోసం వివేకా కృషి చేశారని చెప్పారు. అయితే, వివేకానందరెడ్డి తమకు ఎప్పటికైనా అడ్డంకేనని.. అవినాశ్‌, ఆయన తండ్రికి అర్థం కావడంతోనే ఈ హత్య జరిగిందన్నారు. ‘‘ఇవేమీ తెలియనట్టు, నిజం కానట్టు.. ఇప్పుడు వివేకా కుమార్తె సునీత భర్త హత్య చేయించాడంటూ అవినాశ్‌రెడ్డి మాట్లాడడం దారుణం. ఈ వ్యాఖ్యలు సునీత, ఆమె భర్తపై నెపాన్ని నెట్టే ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. సునీతకు ప్రాణ హాని ఉందని తెలిసినా ధైర్యంగా పోరాటం చేస్తోంది. అన్నగా జగన్‌కు వీసమెత్తయినా కనికరం లేదు. నీ మనస్సాక్షిని అడుగు. సునీత బాధితురాలా?, కాదా?.’’ అని షర్మిల నిలదీశారు. బుధవారం విశాఖ ఎయిర్‌పోర్టులో మీడియాతో ఆమె మాట్లాడారు. షర్మిల ఇంకా ఏమన్నారంటే..


సొంత మీడియా అహంకారం

వివేకా గుండెపోటుతో చనిపోయారన్న థియరీని సృష్టించింది సునీత అంటూ అవినాశ్‌ మాట్లాడుతున్నారు. కానీ, వాస్తవంగా వివేకా చనిపోయిన రోజు సునీత హైదరాబాద్‌లో ఉన్నారు. అదేరోజు ఉదయం 7 గంటల నుంచి గుండెపోటుతో చనిపోయినట్టు జగన్‌ మీడియాలో ప్రసారం చేశారు. మేమంతా అప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాం. ఈ వార్త విని షాక్‌కు గురయ్యాం. జగన్‌ సొంత చానెల్‌లో గుండెపోటుతో చనిపోయినట్టు చూపించారు. లోకల్‌ న్యూస్‌ ఇచ్చే అవకాశం అక్కడే ఉన్న అవినాశ్‌కు ఉంటుందా? హైదరాబాద్‌లో ఉన్న సునీతకు ఉంటుందా?. రక్తపు మడుగులో పడి ఉన్న వివేకానందరెడ్డిని చూసిన ఎవరికైనా గుండెపోటు కాదని అర్థమవుతుంది. ఇది స్థానికంగా ఉన్న అవినాశ్‌ రెడ్డి ప్రభావితం చేసినట్టు కాదా?. అప్పట్లో గుండెపోటు అని ప్రచారం చేసిన దానిపై ఆ మీడియాను నడుపుతున్న భారతీరెడ్డి గానీ, జగన్‌గానీ ఇప్పటి వరకు ఎందుకు సమాధానం చెప్పలేదు.

తండ్రిలా చూసుకున్నారు!

వివేకాను సునీత భర్త రాజశేఖర్‌రెడ్డి చంపించారన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే వివేకానందరెడ్డి బావమరిదే రాజశేఖర్‌రెడ్డి. సునీత కంటే ఎక్కువగా వివేకాను ఆయన ప్రేమిస్తారు. అంత సన్నిహితంగా ఉండేవారు. అటువంటి ఆయన్ను ఎందుకు చంపుతారు. వివేకాకు కొడుకులేని లోటును రాజశేఖర్‌రెడ్డి తీర్చారు. అవినాశ్‌ను దోషిగా చూపిస్తే తనను వదిలేసి బీజేపీలోకి వెళ్లిపోతాడని జగన్‌ చెప్పారు. సీబీఐ విచారణ వేగవంతం చేయాలని సునీత ఎంతో ప్రాధేయపడింది. జగన్‌ ఒప్పుకోకపోవడంతోనే విభేదించి పోరాటం మొదలు పెట్టింది.

మీరు న్యాయం చేయనందుకే!

బాధితుల పక్షాన నిలబడకుండా నిందితుల పక్షాన నిలబడ్డారంటే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే ఎంత బాధపడేవారో అందరికీ తెలుసు, చంద్రబాబును సునీత కలిసిందని ఆరోపణలు చేస్తున్నారు. మీరు న్యాయం చేయలేదు కాబట్టే చంద్రబాబును కలిసిందన్న విషయం తెలియదా?. సీబీఐ విచారణకు అడిగితే వేయలేదు కాబట్టే పోరాటం చేయాల్సి వచ్చింది. వివేకాను ఎవరు చంపించారన్న విషయం జగన్మోహన్‌రెడ్డికి తెలియదా?.ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అనవసరం. ‘అన్న’ అనే పదానికి జగన్‌ కళంకం. సునీత పోరాటం చేస్తుంటే మీడియా ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అన్యాయం.

Updated Date - Mar 19 , 2026 | 05:24 AM