Share News

Sankranti festival: వీరు... గ్రామీణ బాహుబలులు...

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:19 AM

సావరపాలెం గ్రామ పెద్దలు సబ్‌ జూనియర్స్‌కు 70 కిలోల బరువు, సీనియర్స్‌కు 120 కిలోల బరువుతో కూడిన ‘గుండు రాయి’ పోటీలు జరుపుతారు. పోటీలకు నిర్ణీత సమయం ఐదు నిమిషాలు కాగా, ఆ సమయంలో పోటీదారులు గుండు రాయిని పైకి ఎత్తి భుజం పైనుంచి వెనక్కు పడేయాల్సి ఉంటుంది.

Sankranti festival: వీరు... గ్రామీణ బాహుబలులు...

సంక్రాంతి వచ్చిందంటే... ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. స్థానికులు పండగ ఆచారాలను ఆచరించడం ఆనవాయితీ. ఈనేపథ్యంలో దేశ విదేశాల నుంచి ఎన్‌ఆర్‌ఐలు కూడా పండగ సమయాల్లో సొంత గ్రామాలకు కుటుంబ సభ్యులతో తరలి వస్తుంటారు. అన్నిచోట్ల ముగ్గులు పోటీలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు వంటివి సర్వ సాధరణమే. కానీ బాపట్ల జిల్లా ఈపూరుపాలెం పంచాయతీ సావరపాలెంలో పోటీలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏటా పూర్వీకుల నుంచి సాంప్రదాయంగా ఆచరిస్తున్న‘గుండు రాయి’ ఎత్తే పోటీలు విశేషం. సంక్రాంతి పండగకు వారం ముందు నుంచే పోటీదారులు కసరత్తులు చేస్తూ కనిపిస్తుంటారు.

సావరపాలెం గ్రామ పెద్దలు సబ్‌ జూనియర్స్‌కు 70 కిలోల బరువు, సీనియర్స్‌కు 120 కిలోల బరువుతో కూడిన ‘గుండు రాయి’ పోటీలు జరుపుతారు. పోటీలకు నిర్ణీత సమయం ఐదు నిమిషాలు కాగా, ఆ సమయంలో పోటీదారులు గుండు రాయిని పైకి ఎత్తి భుజం పైనుంచి వెనక్కు పడేయాల్సి ఉంటుంది. ఇలా నిర్ణీత సమయంలో ఎక్కువ సార్లు ఎవరయితే గుండును విసురుతారో... వారే ఆ ఏడాది ‘గ్రామీణ బాహుబలి’గా నిలుస్తారు. అలాగే సబ్‌ జూనియర్స్‌ విభాగంలో విజేతకు రూ.20 వేలు, సీనియర్స్‌ విభాగంలో విజేతకు రూ.30 వేలు బహుమతిగా అందిస్తారు.


ఆచారాలతో ఆనందమే...

‘ఈ విధంగా జరిగే పోటీలతో అంతరించి పోతున్న మానవ సంబంధాలకు కాస్తయినా సంప్రదాయ పోటీలతో ప్రయోజనం ఉంటుంద’ని గ్రామీణవాసులు చెబుతున్నారు. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా సెల్‌ఫోన్‌లతో మాత్రమే జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో ఇలాంటి పోటీలతో కాస్తయినా మానసికోల్లాసంగా ఉంటుందని విశ్వసిస్తున్నారు. అలాగే దేహదారుఢ్యంతో పాటు శారీరక, మానసిక సామర్థ్యాలపై ఏకాగ్రత పెరుగుతుందని శిక్షకులు చెబుతున్నారు. ప్రతీ ఏటా రెండు విభాగాల్లో జరిగే ఈ పోటీల్లో... ఒక్కో విభాగానికి 70 మందికి పైగా వివిధ జిల్లాల నుంచి పోటీదారులు హాజరవుతుంటారని చెబుతున్నారు. రాష్ట్రస్థాయిలో సీనియర్స్‌ పోటీలు జరుగుతుండగా, జిల్లా స్థాయిలో జూనియర్స్‌ విభాగం పోటీలు నిర్వహిస్తున్నారు.


మూడుసార్లు విజేతగా...

‘గుండురాయి’ పోటీల్లో సుమారు ఆరుసార్లు పాల్గొన్నట్లు గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు గొర్ల గోపీనాఽథ్‌ చెబుతున్నారు. ‘‘ఈ పోటీలతో కచ్చితమైన ఆలోచనాసరళి ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. దీంతో పోటీలకు సుమారు 15 జిల్లాల నుంచి పోటీ దారులు హాజరవుతున్నారు. ఇప్పటిదాకా జరిగిన పోటీల్లో సీనియర్స్‌ విభాగంలో మూడు సార్లు విజేతగా నిలిచాను. గ్రామ పెద్దల సమక్షంలో జరిగే పోటీల్లో ప్రజలంతా ఎంతో చక్కగా... వివాదాలకు తావు లేకుండా ఆనందిస్తారు. ఈ పోటీలకు మా గ్రామం కేరాఫ్‌ అడ్రస్‌గా మారడం ఆనందకరం’’ అంటున్నారు గోపీనాథ్‌.

- తాళ్లూరి ప్రదీప్‌, చీరాల


book6.2.jpg

‘డ్రాగన్‌’ పడవలు... చూడతరమా!

వశిష్ట, గౌతమి నదుల మధ్య ఉన్న అందమైన ప్రాంతం ఆత్రేయపురం. ఈ పేరు వినగానే తీపి పూతరేకులు గుర్తుకొస్తాయి ఎవరికైనా. అయితే కేరళలాగే ఇక్కడ కూడా పడవ పోటీలు జరుగుతాయని తెలుసా? సంక్రాంతికి నిర్వహించే ఆత్రేయపురం 2026 ఉత్సవం... ‘సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ జాతీయ డ్రాగన్‌ పడవ పోటీలు’ అంగరంగ వైభవంగా జరుగుతాయి.

ఆత్రేయపురం వేదికగా తాడిపూడి వద్ద ప్రధాన పంటకాలువ ఉంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని కేరళ తరహాలో సంప్రదాయ పడవ పోటీలు జరుగుతాయిక్కడ. ఈ పోటీలు కోనసీమ అందాలకు మరింత శోభను తీసుకొస్తాయి. జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, అసోమ్‌, తమిళనాడుల నుంచి సుమారు 30 టీమ్‌లు, 300మంది జల క్రీడాకారులు పాల్గొంటారు.


పోటీలు ఎక్కడంటే...

2024లో శ్రీకారం చుట్టిన ఈ పోటీలను జాతీయస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఆత్రేయపురం వద్ద తాడిపూడి ఉచ్చిలి వరకూ ప్రధాన కాలువలో డ్రాగన్‌ పడవ, స్విమ్మింగ్‌ పోటీలుంటాయి. ఈ పోటీల్లో ఒక్కొక్క బోటులో పది మంది ఉంటారు. వారంతా రిథమిక్‌గా తెడ్లు వేస్తూ పడవలను ముందుకు పరుగెత్తి స్తారు. ఆ దృశ్యాలు గట్టు మీద నుంచి చూస్తు న్నవారికి కనువిందు చేస్తాయి.


సంక్రాంతికి మూడు రోజులపాటు జరిగే ఈ పందాల ఫైనల్‌ పోటీలు జనవరి 13న నిర్వహించి, బహుమతులు అందజేస్తారు. ప్రథమ బహు మతి రూ. 2లక్షలు, ద్వితీయ బహుమతి రూ.లక్ష, తృతీయ బహుమతి రూ.50వేలతో పాటు ట్రోఫీ అందిస్తారు. వీటితో పాటు జాతీయస్థాయిలో నిర్వహించే స్విమ్మింగ్‌ పోటీల్లో వివిధ రాష్ర్టాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు. వారిలో పదేళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల దాకా ఉంటారు. 1000 మీటర్లు, 100 మీటర్లు, 4ఇన్‌టు 100 రిలే... ఇలా మొత్తం 16 కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈసారి డ్రాగన్‌ పడవ పోటీలతో పాటు కయాకింగ్‌ బోటింగ్‌ కూడా ఇక్కడికి విచ్చేసేవారికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

- పి.వి.నాగబాబు

ఆత్రేయపురం


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

దారి మళ్లింది 42 కోట్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2026 | 02:15 PM